మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 22, 2020 , 22:15:26

బీజేపీకి ఓటు వేస్తే బురదలో వేసినట్లే: మంత్రి హరీశ్‌రావు

బీజేపీకి ఓటు వేస్తే బురదలో వేసినట్లే:  మంత్రి   హరీశ్‌రావు

రామచంద్రాపురం:  టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం హయాంలో జరుగుతున్న అభివృద్ధిని ప్రజలు గమనించి అభివృద్ధివైపు ప్రజలందరూ నిలవాలని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు.  ఆదివారం ఆర్సీపురం 112 డివిజన్‌లోని వడ్డెర బస్తీలో, భారతీనగర్‌ 111 డివిజన్‌లోని ఇక్రిశాట్‌ ఫెన్సింగ్‌ ఏరియాలో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ అభ్యర్థులు బూరుగడ్డ పుష్పానగేశ్‌, సింధూ ఆదర్శ్‌రెడ్డిలతో కలిసి మంత్రి హరీశ్‌రావు సమావేశం నిర్వహించారు. మంత్రి సమావేశానికి రెండు బస్తీల్లోంచి ప్రజలు పెద్ద ఎత్తున వచ్చారు. మూడేండ్లు టీఆర్‌ఎస్‌ పార్టీయే అధికారంలో ఉంటుందని, డివిజన్‌లు అభివృద్ధి చెందాలంటే టీఆర్‌ఎస్‌ పార్టీకి చెందిన కార్పొరేటర్లు ఉంటేనే సాధ్యమవుతుందని ఆయన ప్రజలకు వివరించారు. 

పేదల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని తెలిపారు. ఝాటా పార్టీ అయిన బీజేపీని ప్రజలు నమ్మవద్దని, బీజేపీకి ఓటు వేస్తే బురదలో వేసినట్లేనని అన్నారు. ఆర్సీపురం, భారతీనగర్‌, పటాన్‌చెరు డివిజన్‌ల అభివృద్ధి తన భుజాలపై వేసుకుంటానని, డివిజన్‌లో ఉన్న సమస్యలన్నింటిని పరిష్కరిస్తామని అన్నారు. 

అభివృద్ధికి పాటుపడే టీఆర్‌ఎస్‌కే ప్రజలు ఓటు వేసి అభ్యర్థులను గెలిపించాలని ఆయన కోరారు.  పలువురు మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. ఈ కార్యక్రమంలో ఎంపీ ప్రభాకర్‌రెడ్డి, రాష్ట్ర అటవీ అభివృద్ధి కార్పొరేషన్‌ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, ఎమ్మెల్సీలు భూపాల్‌రెడ్డి, ఫారుక్‌హుస్సెన్‌, ఎమ్మెల్యే మహిపాల్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే సత్యనారాయణ, కార్పొరేటర్‌ అంజయ్య తదితరులు పాల్గొన్నారు.