గురువారం 09 జూలై 2020
Telangana - Jun 12, 2020 , 02:26:23

విమర్శిస్తే గొప్పవాళ్లు కాలేరు

విమర్శిస్తే గొప్పవాళ్లు కాలేరు

  • సీఎం కేసీఆర్‌ను దేశమంతా గౌరవిస్తున్నది
  • ఎంపీ బండి అనుచిత వ్యాఖ్యలపై గంగుల మండిపాటు
  • మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరిన బీజేపీ కార్పొరేటర్‌ 

కరీంనగర్‌ కార్పొరేషన్‌: విమర్శించిన వాళ్లంతా గొప్పవాళ్లు కాలేరనీ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. కరీంనగర్‌ బీజేపీ కార్పొరేటర్‌ గుగ్గిళ్ల జయశ్రీ గురువారం మంత్రి సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరగా.. గులాబీ కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..  ఉద్యమ నాయకుడిగా, తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన నేతగా సీఎం కేసీఆర్‌ ను దేశమంతా గౌరవిస్తున్నదని.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ మాత్రం ఆయనను ఏకవచనంతో వ్యాఖ్యానిస్తున్నాడని మండిపడ్డారు. కేసీఆర్‌ రాజకీయ అనుభవాన్ని, నాయకత్వపటిమను దృష్టిలో పెట్టుకొని ప్రధాని మోదీ గౌరవంగా సంభోదిస్తారని గుర్తుచేశారు. బండి వ్యవహార శైలి  ఆ పార్టీకి మంచి చేస్తుందో.. చెడు చేస్తుందో పరిశీలించుకోవాలని బీజేపీ నాయకత్వానికి సూచించారు. కరీంనగర్‌ ఎంపీ స్థానం నుంచి పోటీచేసి ఓడిపోయిన ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ నిత్యం ప్రజల మధ్య ఉంటే.. గెలిచిన బండి మాత్రం క్వారంటైన్‌లో ఉన్నారని ఎద్దేవా చేశా రు. ఇప్పటికే కరీంనగర్‌ నియోజకవర్గ ప్రజలు ఎంపీ కనిపించట్లేదని పోలీస్టేషన్లలో ఫిర్యాదు చేస్తున్నారని అన్నారు.  

టీఆర్‌ఎస్‌లోకి కొనసాగుతున్న వలసలు 

ధర్మపురి/బల్మూరు: టీఆర్‌ఎస్‌లోకి వలసలు కొనసాగుతున్నాయి. జగిత్యాల జిల్లా వెల్గటూర్‌ మం డలం చర్లపల్లికి చెందిన టీపీసీసీ సభ్యుడు, మాజీ సర్పంచ్‌ చుక్క శంకర్‌రావుతోపాటు చర్లపల్లి, జగదేవ్‌పేటలోని ఆయన అనుచరులు దాదాపు 400 మంది గురువారం మంత్రి కొప్పుల ఈశ్వర్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు. నాగర్‌కర్నూలు జిల్లా బల్మూరు మండలం పోలెపల్లిలో సర్పంచ్‌ సువర్ణ, ఉపసర్పంచ్‌ కృష్ణాగౌడ్‌, స్థానిక ఆంజనేయ దేవాలయ కమిటీ అధ్యక్షుడు రాజేందర్‌గౌడ్‌ ఆధ్వర్యంలో దాదాపు 50 మందికిపైగా కాంగ్రెస్‌ నాయకులు  ప్రభుత్వ విప్‌ గువ్వల బాలరాజ్‌ సమక్షంలో టీఆర్‌ఎస్‌లో చేరారు.


logo