బుధవారం 03 మార్చి 2021
Telangana - Jan 27, 2021 , 19:54:43

పసుపు రైతులను ఆదుకోవడంలో బీజేపీ, కాంగ్రెస్‌ విఫలం

పసుపు రైతులను ఆదుకోవడంలో బీజేపీ, కాంగ్రెస్‌ విఫలం

నిజామాబాద్‌ : కేంద్రంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న బీజేపీ, గతంలో పాలించిన కాంగ్రెస్‌ పార్టీ పసుపు రైతులను ఆదుకోవడంలో పూర్తిగా విఫలమయ్యాయని పసుపు రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటపాటి నర్సింహనాయుడు అన్నారు. జిల్లాలోని ఆర్మూర్‌లోని రైతు సేవా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన రైతు సంఘం నాయకులతో కలిసి మాట్లాడారు. రాష్ట్రంలోని పసుపు రైతులు 15 ఏండ్లుగా పసుపు బోర్డు ఏర్పాటు, మద్దతు ధరల కోసం ఆందోళనలు చేస్తున్నారన్నారు.

2004 నుంచి 2014 వరకు కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌ దృష్టికి పసుపు అంశాన్ని తీసుకెళ్లడానికి ఆర్మూర్‌ ప్రాంత రైతులు నాలుగు దఫాలుగా ఢిల్లీలో ధర్నాలు నిర్వహించినట్లు చెప్పారు. పార్లమెంట్‌ను సైతం పసుపు రైతులు ముట్టడించారని, అప్పటి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించిందన్నారు. నిజామాబాద్‌కు పది సంవత్సరాలు ఎంపీగా ఉన్న మధుయాష్కీగౌడ్‌ ఒక్కసారి కూడా పార్లమెంట్‌లో ఈ విషయాలపై మాట్లాడలేదన్నారు. మరోవైపు ఢిల్లీ, హైదరాబాద్‌లో పసుపు రైతుల ఆందోళనల్లో పాల్గొన్న బీజేపీ నాయకులు అధికారంలోకి వచ్చాక ఈ అంశలపై నోరు మెదపడం లేదని విమర్శించారు.

అప్పటి నిజామాబాద్‌ ఎంపీ కల్వకుంట్ల కవిత ఎన్నో రకాలుగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చినప్పటికీ పసుపు రైతులకు కేంద్రం న్యాయం చేయలేదన్నారు. పసుపు రైతుల సమస్యను పరిష్కరిస్తే కల్వకుంట్ల కవితకు పేరు వస్తుందని 2014 నుంచి 2019 వరకు పసుపు అంశాన్ని పక్కన పెట్టారన్నారు. 2019 ఎన్నికలకు ముందు కేంద్రంలో అధికారంలోకి వస్తే పసుపు పంటకు ప్రత్యేక బోర్డును, మద్దతు ధరను ఇస్తామని బీజేపీ ఎంపీ అభ్యర్థి ధర్మపురి అర్వింద్‌ బాండ్‌ పేపర్‌ రాసిచ్చి గెలిచిన తర్వాత రైతులను మోసగించాడని దుయ్యబట్టారు. ప్రస్తుతం బీజేపీ అగ్రనేతలు, నిజామాబాద్‌ ఎంపీ ధర్మపురి అర్వింద్‌ కల్లబొల్లి మాటలు చెబుతూ కేసీఆర్‌పై నెపం వేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు.

సీఎం కేసీఆర్‌ ఉత్తరం ఇస్తే మద్దతు ధర ఇస్తామని చెప్పడం ప్రజలను తప్పుదారి పట్టించడమేనన్నారు. ఏదైనా పంటలకు మద్దతు ధర ఇవ్వాలనుకుంటే నేరుగా ఇచ్చే వీలుందన్నారు. రైతులు బీజేపీ చెబుతున్న ఈ విషయాలను గమనించాలని కోటపాటి కోరారు. రైతాంగం కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలను చేపడుతున్న సీఎం కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సమర్థించాలని, టీఆర్‌ఎస్‌ పార్టీని ముందుకు నడుపాలని కోటపాటి అన్నారు. సమావేశంలో పసుపు రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగారెడ్డి, ఆర్మూర్‌ మండల అధ్యక్షుడు నక్కల చిన్నారెడ్డి, డిచ్‌పల్లి మండల అధ్యక్షుడు రాజారెడ్డి, కార్యవర్గ సభ్యులు నర్సారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 

ఇవి కూడా చదవండి..

13 సార్లు జైలుకు వెళ్లొచ్చినా తీరు మారలేదు

సీఎం కేసీఆర్ గొప్ప లౌకికవాది : మంత్రులు

అనర్హులకు ఇండ్లు కేటాయిస్తే కఠిన చర్యలు : స్పీకర్‌ పోచారం 

తెలంగాణ అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకం 

ఉనికి కోసమే ఉత్తమ్ పాకులాట : ఎమ్మెల్యే శానంపూడి 

రోడ్డు ప్రమాదంలో సైకిలిస్ట్ మృతి  

VIDEOS

logo