గురువారం 28 మే 2020
Telangana - May 01, 2020 , 15:20:00

ఇత్తేసి పొత్తుకూడుతున్న బీజేపీ: ఎర్రబెల్లి

ఇత్తేసి పొత్తుకూడుతున్న బీజేపీ: ఎర్రబెల్లి

వరంగల్‌ రూరల్‌: కేంద్ర ప్రభుత్వ శైలి, బీజేపీ వ్యవహారం ఇత్తేసి పొత్తు కూడినట్లుగా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు ఆరోపించారు. తెలంగాణ ప్రభుత్వం చేసే సాయంలో కేంద్రం చెల్లించేది కొద్దిమొత్తమేనని, బీజేపీ మాత్రం మొత్తం మేమే ఇస్తున్నామని గొప్పలు పోతున్నదని ఎద్దేవా చేశారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుకొండ మండలం కోనాయి మాకులలో మే డే ఉత్సవాల్లో పాల్గొన్నారు. లాక్‌డౌన్‌ కారణంగా ఎన్ని ఆర్థిక ఇబ్బందులు ఉన్నా రాష్ట్రంలో పెన్షన్లను అందిస్తున్నామని తెలిపారు. పెన్షన్ల కోసం రూ.12 వేల కోట్లను రాష్ట్రం ఇస్తుండగా, అందులో రూ. రెండు వందల కోట్లు మాత్రమే కేంద్ర ప్రభుత్వం తన వాటాగా చెల్లిస్తుందన్నారు. దీనికి అంతా తామే చేస్తున్నట్లు బీజేపీ నాయకులు ప్రగల్భాలు పలుకుతున్నారని విమర్శించారు. 

ఉపాధి హామీ కూలీలకు వేతనాన్ని రూ.221 నుంచి రూ.237కు పెంచిన ఘనత సీఎం కేసీఆర్‌ ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. రోజుకు పది లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్న ప్రభుత్వం కూడా తెలంగాణ మాత్రమేనని చెప్పారు. కరోనా కాలంలో దేశంలో ఇంతగా ఉపాధి ఎక్కడా లభించడం లేదని ఎర్రబెల్లి తెలిపారు. పెరిగిన వేతనాలు ఏప్రిల్‌ నుంచే చెల్లిస్తున్నామని వెల్లడించారు.


logo