మంగళవారం 01 డిసెంబర్ 2020
Telangana - Nov 21, 2020 , 01:51:33

పింఛన్‌ వంచన

పింఛన్‌ వంచన

  • కేంద్రంపై పండుటాకుల న్యాయపోరాటం
  • ఉద్యోగులు, కార్మికుల హక్కును హరిస్తున్న మోదీ సర్కారు
  • 30 ఏండ్ల కొలువుతో కంట్రిబ్యూషన్‌ కడితే.. పెన్షన్‌ 1,250
  • తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే ఉచిత పెన్షన్‌ కన్నా తక్కువ
  • పార్లమెంటు కమిటీ సిఫారసు చేసినా పట్టింపే లేదు
  • సుప్రీంకోర్టు సహా ఐదు హైకోర్టులు తీర్పులిచ్చినా లెక్కే లేదు
  • నెలకు రూ.1,250తో బతుకటం సాధ్యమేనా?
  • ఒంటరి మహిళలు, వితంతువులు, వృద్ధులు, బీడీ కార్మికులు, బోదకాలు బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతినెలా ఇస్తున్న పింఛన్‌ రూ.2016
  • వికలాంగులకు ఇస్తున్న పింఛన్‌ రూ.3016 ... అదీ పూర్తి ఉచితంగా 

పాతిక ముప్ఫై ఏండ్లపాటు ప్రభుత్వరంగ సంస్థల్లో, ప్రైవేట్‌ సంస్థల్లో ఉద్యోగంచేసి.. ఉద్యోగ పింఛన్‌ నిధికి యాజమాన్యంతోపాటు తాను కంట్రిబ్యూట్‌చేసి.. రిటైరైతే.. సదరు ఉద్యోగికి మోదీ సర్కారు ప్రతి నెలా ఇస్తున్న పింఛన్‌ కనీసంరూ.1250 ... అదీ దశాబ్దాలపాటు కంట్రిబ్యూషన్‌ కడితే... వయోవృద్ధులు ఆత్మగౌరవంతో బతుకాలనే మానవీయ దృక్పథంతో ఎవరూ కోరకుండానే  సామాజిక బాధ్యతగా తెలంగాణ ప్రభుత్వం 36 లక్షల మందికి పింఛన్లు ఇస్తున్నది. ఈపీఎస్‌ కింద దేశవ్యాప్తంగా సుమారు 64 లక్షల మంది ఉద్యోగులకు హక్కుగా రావాల్సిన అధిక పెన్షన్‌ను ఇవ్వడానికి మోదీ సర్కారుకు మనసురావడంలేదు. 

‘వర్క్‌మెన్‌ కోసం రూపొందించిన చట్టాలను ట్యాంపర్‌ చేయవద్దు. పెన్షనర్లు తమ జీవితపు చివరిదశలో ఉన్నారు. వాళ్ల నోటికాడి ముద్దను దోచుకోవద్దు. పెన్షన్‌ అంటే వాయిదా జీతాన్ని చెల్లించడమే. ఇదేదో ఉదారంగా ఇచ్చేదికాదు. ఇది ఉద్యోగి హక్కు’.. సాక్షాత్తు సుప్రీంకోర్టు అన్న మాటలివి. అయినా అమలుచేయని మోదీ సర్కారును ఏమనాలి? ఏం చేయాలి?

ఉద్యోగం నుంచి రిటైర్‌ అయిన తర్వాత ప్రశాంతంగా జీవించడంకోసం ఉద్యోగంలో చేరిన్నాటినుంచే పింఛన్‌ ఖాతాలో జమచేసుకొంటారు. ఆ సొమ్మంతా కేంద్ర సర్కారు అక్కడా.. ఇక్కడా తిప్పి సొమ్ము చేసుకొంటది. తీరా రిటైర్‌ అయిన తర్వాత కనీసం అప్పటిదాకా సంపాయించిందాంట్లో సగమైనా పింఛన్‌గా వస్తుందని ఆశపడితే.. వృద్ధాప్య పింఛన్‌కంటే తక్కువగా.. బిచ్చమేసినట్టు ఓ 1250 రూపాయలు పడేసి ఆడుకొంటది. 

సామాన్యుల్లా ఒక్కసారి ఆలోచిద్దాం.. 1250 రూపాయలతో నెల మొత్తం బతకడం సాధ్యమేనా? ఇవాళ దినసరివేతన కార్మికుల కూలీ కూడా రోజుకు కనీసంగా వెయ్యి రూపాయలు ఉంటుంది. అలాంటిది.. నిన్నటిదాకా 60 వేల నుంచి లక్ష దాకా సంపాదించి.. రిటైరైతే.. గౌరవప్రదంగా జీవించడానికి అనువైన పరిస్థితులు కల్పించడం ప్రభుత్వ బాధ్యత కాదా?

ఉద్యోగుల భవిష్యనిధికి ఉద్యోగులు చెల్లించే వాటాతో ఈపీఎఫ్‌వో వ్యాపారంచేస్తుంది. స్టాక్‌మార్కెట్లో షేర్లు కొంటుంది. రకరకాల బాండ్లు కొంటుంది. వడ్డీ సంపాదిస్తుంది. వడ్డీలమీద వడ్డీ సంపాదిస్తుంది. లాభాలొస్తే వస్తాయి.. నష్టాలొచ్చినా అడిగేటోడు ఉండడు. ఈపీఎఫ్‌వో ఎవరికీ జవాబుదారీగా వ్యవహరించదు. సదరు ట్రస్టు సభ్యులు ఏమనుకొంటే అదిచేస్తారు. 60 లక్షల మందికి పైగా ఉన్న ఉద్యోగుల సొమ్ము ఇది. దీన్ని భద్రపరచి.. సంపదను పెంచి.. తిరిగి ఉద్యోగులకు పంచడం దాని విధి. కానీ ఈపీఎఫ్‌వో ఆ పనిచేయదు. ఉద్యోగులు తమ సొమ్ము తాము తీసుకోవడానికి కోర్టు మెట్లక్కాలి. ఉద్యోగుల పైసలపై బతికే ఈపీఎఫ్‌వో మాత్రం ఆ ఉద్యోగులపైనే దాష్టీకం ప్రదర్శిస్తుంది. పింఛన్‌ తీసుకోవడం వాళ్ల హక్కు అని సుప్రీం కోర్టు చెప్పినా.. లెక్కచేయదు. ప్రభుత్వం పట్టించుకోదు. చివరకు ఉద్యోగుల జీవితాలు ఈపీఎఫ్‌వో అనే పిచ్చోడి చేతిలో రాయిలా మారింది. 

హైదరాబాద్‌ సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఒక సాధారణ ఉద్యోగి రెక్కలాడుతున్నప్పడే నాలుగు రాళ్లు వెనుకేసుకొని, పదవీ విరమణ తర్వాత దానికి తగ్గట్లు వచ్చే పెన్షన్‌తో ప్రశాంతంగా మలి దశను దాటాలనుకొంటాడు. కానీ ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేట్‌రంగాల్లోని ఈపీఎస్‌-95 పెన్షనర్‌ ఈ హక్కును మోదీ ప్రభుత్వం హరించివేస్తున్నది. జీతానికి అనుగుణంగా పీఎఫ్‌ కంట్రిబ్యూషన్‌ ఉన్నప్పటికీ పెన్షన్‌ స్కీంలో గరిష్ఠ వేతన పరిమితితో అధిక పెన్షన్‌ అందని ద్రాక్షగా మారింది. దీనిపై పెన్షనర్లు దశాబ్దాలుగా పోరాటం సాగిస్తున్నా... ఉద్యోగి కంట్రిబ్యూషన్‌కు తగిన పెన్షన్‌ ఉండాలని న్యాయస్థానాలు ఆదేశించినా కేంద్ర సర్కారు మాత్రం చలించడంలేదు. 

ఇంత దారుణమా? 

ప్రభుత్వ రంగసంస్థలు, ప్రైవేట్‌ రంగ ఉద్యోగులకు పదవీవిరమణ తర్వాత వారి ఆర్థిక, సామాజిక భద్రత కోసం కేంద్రం 1995లో ప్రారంభించిన ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీం (ఈపీఎస్‌)లో భాగంగా ఈపీఎఫ్‌వో నిర్ధారించిన నెలసరి పింఛన్‌ దేశంలోని పలు రాష్ట్ర ప్రభుత్వాలు ఇస్తున్న సామాజిక పింఛన్ల కంటే తక్కువ ఉండటం దారుణం. 2014 సెప్టెంబర్‌ ఒకటిన చేసిన సవరణలతో పెన్షన్‌ను వెయ్యి రూపాయలుగా నిర్ధారించగా.. సగటు న రూ.1,250 మాత్రమే పింఛన్‌ లభిస్తున్నది. నేటి సామాజిక జీవన ప్రమాణాలతో బేరీజువేస్తే నెలకు రూ.1,250 ఇవ్వడం అన్యాయం. దేశవ్యాప్తంగా సుమారు 64 లక్షల మంది పెన్షనర్లు ఉంటే.. వీరిలో దాదాపు 40 లక్షల మంది వరకు నెలకు పొం దే పెన్షన్‌ రూ.1000-1500 మాత్రమే. గరిష్ఠంగా లెక్కించినా పింఛను రూ.7,500గా ఉన్నది. ఈ మొత్తం కొద్దిమందికి మాత్రమే. అందుకే న్యాయంగా రావాల్సిన అధిక పింఛ న్‌ కోసం పెన్షనర్లు దశాబ్దాలుగా పోరాడుతున్నారు. 

విపక్షంలో ఉన్నప్పుడు ఒకమాట.. ఇప్పుడొకమాట

ఈపీఎస్‌పై నిపుణుల కమిటీ నివేదికలు, ఒక పార్లమెంటరీ కమిటీ నివేదిక కూడా ఉన్నాయి. రాజ్యసభ కమిటీ 3.9.2013 నాటి 147వ నివేదికలో ఈపీఎస్‌-95 సవరణ కోరుతూ అప్పటి రాజ్యసభ సభ్యుడు ప్రకాశ్‌ జవదేకర్‌ (ప్రస్తుత కేంద్రమంత్రి) దాఖలుచేసిన పిటిషన్‌ను పరిగణించి, కనీస పెన్షన్‌ను నెలకు రూ.3 వేలకు పెంచాలని, జీవనవ్యయానికి సూచిక చేయాలని సిఫార్సు చేశారు. కోషియార్‌ కమిటీ కనీసం నెలకు రూ.3 వేల పెన్షన్‌ ఇవ్వాలని 2013లో నివేదిక సమర్పించింది. కానీ యూపీఏ, ఎన్డీయే ప్రభుత్వాలు వీటిని బుట్టదాఖలుచేశాయి. విపక్షంలో ఉన్నప్పుడు దీనిపై గళం విప్పిన ప్రస్తుత కేంద్రమంత్రి జవదేకర్‌ ఇప్పుడు మౌనంగా ఉండిపోయారు. మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం కేంద్ర కార్మిక, ఉపాధిశాఖ కార్యదర్శి ఆధ్వర్యంలో ఉన్నతస్థాయి కమిటీనివేసింది. ఈ కమిటీ అంతకుముందు సిఫార్సులను పట్టించుకోకుండా నెలకు రూ.2 వేల పెన్షన్‌ ఇస్తే చాలని పేర్కొన్నది. కనీస వేతనస్థాయి, ఇతర జీవన వ్యయ వాదనలతో అనుసంధానించిన పెన్షన్‌ ఆధారంగా కార్మిక సంఘాలు జీవన వ్యయానికి సూచికగా రూ.6,500 కనీస పెన్షన్‌ను కోరుతున్నాయి. కుటుంబ పెన్షన్‌ మొత్తాన్ని పెంచేందుకు తక్షణ నిర్ణయం తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వ మాజీ కార్యదర్శి ఈఏఎస్‌ శర్మ ఇటీవల కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్‌ను కోరారు. ఎంపీ హేమామాలిని కూడా ఈపీఎస్‌-95 పెన్షనర్ల ఆవేదనపై నేరుగా ప్రధానమంత్రికి లేఖ కూడారాశారు. పెన్షనర్లు గౌరవంగా జీవించేందుకు రూ.7500 పెన్షన్‌ ఇవ్వాలని కోరారు. 

వృద్ధులపై ఇంత కక్షసాధింపా?

ఈపీఎస్‌ కింద ప్రభుత్వ రంగ సంస్థలు, ప్రైవేట్‌ ఉద్యోగులు తమ కంట్రిబ్యూషన్‌కు అనుగుణంగా అధిక పెన్షన్‌ పొందడమనేది వాళ్ల హక్కు. సాక్షాత్తూ దేశ అత్యున్నత న్యాయస్థానంచేసిన వ్యాఖ్య ఇది. అధిక పెన్షన్‌ కోసం పండుటాకులు ఏండ్ల తరబడి పోరాడిన అనంతరం సుప్రీంకోర్టు నుంచి వెలువడ్డ మాటలు. న్యాయస్థానం హక్కును ప్రసాదించడంతో ఇకనైనా ఉపశమనం లభిస్తుందనుకొన్న పెన్షనర్లపై మోదీ సర్కారు కక్షపూరితంగా వ్యవహరిస్తున్నది. సుప్రీంకోర్టులో ఎస్‌ఎల్పీలు, రివ్యూ పిటిషన్లు వేస్తూ వాళ్ల ఉసురు తీసుకొంటున్నది. కోర్టు కేసుల కోసం కోట్ల రూపాయలు ఖర్చుచేస్తుందే తప్ప తమ కష్టార్జితానికి అనుగుణంగా వృద్ధ్దాప్యంలో పెన్షన్‌ ఇవ్వాలని కోరుతున్న కోట్లమంది ఈపీఎస్‌ పెన్షనర్లపై కనికరం కూడా చూపడంలేదు. జీవిత చరమాంకంలో ఉన్న వయోవృద్ధులతో మానవత్వాన్ని మరచి ప్రవర్తిస్తున్నది. 

ఫలితం వచ్చేదాకా బతికేది ఎందరు?

ఎంప్లాయిస్‌ తమ జీతంలో నుంచి డబ్బుల్ని దాచుకొని.. వాటిని అధిక పెన్షన్‌ రూపంలో ఇవ్వమని అభ్యర్థిస్తున్నా... కేంద్రం, ఈపీఎఫ్‌వో చలించవు సరికదా.. కోర్టు కేసులకు మాత్రం కోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్నాయి. 2016-17, 2017-18.. అంటే రెండేండ్లలోనే కోర్టు కేసులకు ఈపీఎఫ్‌వో రూ.11.50 కోట్లు ఖర్చుచేసింది. దీన్నిబట్టి గత దశాబ్దకాలంలో ఇంకెన్ని కోట్లు ఖర్చు చేసిందో అర్థం చేసుకోవచ్చు. హైకోర్టులో ఒక కేసు విచారణకు కనీసం నాలుగేండ్ల సమయం పడుతుంది. తీర్పు రావడానికి మరో పది నెలలు అవుతుంది. తర్వాత పై బెంచిలకు వెళ్తే మరో మూడు నెలలు.. ఉత్తర్వులకు ఏడాది.. ఇక సుప్రీంకోర్టుకు పోతే మరో ఏడాది.. ఇలా ఉజ్జాయింపుగా లెక్కేసుకొంటేనే ఏడేండ్లు పడుతుంది. కేంద్రం రివ్యూపిటిషన్‌ వేయడంతో అంతే సంగతులు. ఈ కాలగమనంలో కాలగర్భంలో కలిసిపోయిన పెన్షనర్లు ఎందరు? కేంద్రం తన మొండి వైఖరిని వీడేవరకు బతికేది ఎందరు.. లబ్ధి పొందేది ఎందరు? 

పింఛన్‌ లెక్క ఇలా..

1.4.2000లో జాయిన్‌ అయిన ఒక ఉద్యోగి.. తన సర్వీసును నెలకు రూ.50 వేల జీతంతో మొదలుపెట్టాడు. ఏటా ఐదు శాతం వృద్ధితో అతను 31.3.2020 న పదవీ విరమణచేశారు. పదవీ విరమణ సమయానికి అతని నెల జీతం రూ.1,26,347.50. ఈపీఎఫ్‌వో నిబంధనల ప్రకారం 2014 సెప్టెంబర్‌కు ముందు గరిష్ఠ వేతన పరిమితి రూ.6,500గా ఉండేది. ఆపై పరిమితి రూ.15 వేలుగా ఉన్నది. ఈ క్రమంలో ప్రస్తుతం ఉన్న ఈపీఎఫ్‌వో విధానం ప్రకారం అతని పెన్షన్‌ లెక్కింపు ఇలా ఉంటుంది. సర్వీసు సమయం 20 సంవత్సరాలు. బోనస్‌గా రెండు సంవత్సరాలు కలుపుకొని 22 సంవత్సరాలు అవుతుంది.   గరిష్ఠ వేతన పరిమితి రూ.15 వేలుగా ఉన్నందున 15000 * 22/70 = రూ.4,714. అంటే పదవీ విరమణ సమయానికి లక్షకు పైగా జీతం ఉన్న సదరు ఉద్యోగి నెలసరి పెన్షన్‌ కేవలం రూ.4,714. కానీ అధిక పెన్షన్‌ విధానంలోనైతే పదవీ విరమణ సమయానికి ముందు ఏడాది సరాసరి నెల జీతం రూ.1,26,348. ఈ చొప్పున 1,26,348* 22/70=రూ.39,703 పెన్షన్‌ పొందుతాడు.  

పెన్షన్‌లో ఉద్యోగి వాటా ఎంత?

ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేట్‌రంగ ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక, సామాజిక భద్రతకోసం కేంద్ర ప్రభుత్వం 1995లో ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీం (ఈపీఎస్‌)ను ప్రారంభించింది. ఇందులో కంపెనీ ఉద్యోగి వేతనంలో 12 శాతాన్ని పీఎఫ్‌ కింద జమచేస్తారు. ఆయా సంస్థల యాజమాన్యాలు కూడా మరో 12 శాతాన్ని జమచేస్తాయి. కంపెనీ వాటాలోని 12 శాతంలో 8.33 శాతం ఈపీఎస్‌కు జమ అవుతుంది. మిగిలిన 3.67 శాతం ఈపీఎఫ్‌ (ప్రావిడెంట్‌ ఫండ్‌)కు వెళుతుంది. ఈ పథకాన్ని ప్రారంభించినపుడు గరిష్ఠ వేతనం రూ.5,000 గా పరిమితి విధించారు. గరిష్ఠంగా రూ.417 మాత్రమే ఈపీఎస్‌లో జమవుతుంది. 2011లో గరిష్ఠ వేతనాన్ని రూ.6,500 పెంచారు. ఈపీఎస్‌లో జమయ్యే మొత్తం గరిష్ఠంగా రూ.541 కి పెరిగింది. 2014 సెప్టెంబర్‌ నుంచి గరిష్ఠ వేతనం రూ.15 వేలు, జమయ్యే మొత్తం గరిష్ఠంగా రూ.1,250కి చేరింది. దీని ప్రకారమే పదవీ విరమణ తర్వాత ఉద్యోగి పెన్షన్‌ను నిర్ధారిస్తారు.

ఈపీఎఫ్‌వో విచిత్రం

పింఛన్‌పై కేంద్రానికి, ఈపీఎఫ్‌వోకు ఒక స్పష్టమైన వైఖరి లేకుండాపోయింది. స్పష్టత లేకుంటేపోయే.. కనీసం కోర్టులు ఈ విషయంలో తీర్పులు చెప్పిన తరువాతైనా అమలు చేయవచ్చుకదా.. అంటే అదీ లేదు. పైగా మోదీ సర్కారు వచ్చిన తర్వాత చిత్రవిచిత్రమైన నిర్ణయాలు తీసుకొంటున్నది. తమకు అధిక పింఛన్‌ చెల్లింపులో అన్యాయం జరిగిందని 24,672 మంది సుప్రీంకోర్టుకు వెళ్తే.. న్యాయస్థానం వారికి అనుకూలంగా తీర్పు ఇచ్చింది. 2016, అక్టోబర్‌ 10న సుప్రీం ఇచ్చిన తీర్పును అనుసరించి 2017 మార్చి 23న ఈపీఎఫ్‌వో సర్క్యులర్‌ను మోదీ ప్రభుత్వం ఆమోదించింది. ఈ ప్రకారంగా కేసు వేసిన 24, 672 మందికి మాత్రమే పింఛన్‌ పెరిగింది. మిగతావాళ్ల నోళ్లలో మన్నుకొట్టింది. ఒక్కొక్కరికి రూ.1636.99 నుంచి రూ.2241.83 దాకా ఉన్న పింఛన్‌.. రూ.4007.58 నుంచి గరిష్ఠంగా రూ.7,399.02 పెరిగింది. కొందరికి మాత్రం రూ.15 వేల వరకు వస్తున్నది. ప్రస్తుతం ఈ విధానాన్ని కూడా ఈపీఎఫ్‌వో పక్కన పెట్టింది. పాత వాదనలతో తిరిగి ఆ ప్రయోజనాల్ని కల్పించేందుకు నిరాకరిస్తున్నది. రివ్యూ పిటిషన్‌పై తుది తీర్పు వచ్చేవరకు పాత నిబంధనలు అమలుచేసేందుకు ఈపీఎఫ్‌వో ప్రయత్నిస్తున్నది. సర్వీసులో ఉన్నపుడు ఎలాంటి ఆప్షన్లు ఇవ్వని, మ్యాచింగ్‌ కంట్రిబ్యూషన్‌ ఇవ్వనివారికి అధిక పెన్షన్‌ ఇవ్వలేమని వాదిస్తున్నది. 

వృద్ధాప్య పింఛను కంటే తక్కువ

రాష్ట్రంలో ఒకప్పుడు వృద్ధాప్య పెన్షన్‌ నెలకు రూ.75 ఉండేది. కాంగ్రెస్‌ హయాంలో తెలంగాణ ఏర్పడేనాటికి అది రూ.200 కు చేరుకొన్నది. తెలంగాణ సర్కారు వచ్చిన తర్వాత ఆ మొతాన్ని అమాంతంగా వెయ్యి రూపాయలకు పెంచింది. ప్రస్తుతం నెలకు రూ.2,016 ఇస్తున్నది. శరీరంలో సత్తువ ఉన్నన్నాళ్లు పోరాడి.. మలి దశలో ఎవరి ముందు చెయ్యి చాచకుండా ఉండాలనే మానవతా దృక్పథంతో, సామాజిక బాధ్యతతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ వారికి జీవిత చరమాంకంలో అండగా నిలుస్తున్నారు.  

మరి.. ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేట్‌ రంగంలోని ఉద్యోగులకు అందుతున్న పెన్షన్‌ ఎంతో తెలుసా?! నెలకు సగటున రూ.1,250. ఈ డబ్బుతో వయో భారాన్ని మోస్తూ.. ప్రశాంతంగా జీవనం సాగించడం సాధ్యమేనా? ముమ్మాటికీ సాధ్యంకాదని కేంద్రంలోని మోదీ ప్రభుత్వానికి తెలియందేమీ కాదు. గత దశాబ్దకాలంలో ఎన్ని కమిటీలు సిఫార్సులుచేసినా, సుప్రీంకోర్టుతోపాటు.. దేశంలోని అనేక న్యాయస్థానాలు ఆదేశించినా.. పండుటాకులకు ఓ పది రూపాయలు పెంచి అధిక పెన్షన్‌తో సంతృప్తిపరిచేందుకు మోడీ ప్రభుత్వానికి మనసు రావడంలేదు. ఎంప్లాయీస్‌ పెన్షన్‌ స్కీం (ఈపీఎస్‌) కింద ప్రభుత్వరంగ సంస్థలు, ప్రైవేట్‌ ఉద్యోగులు తమ కంట్రిబ్యూషన్‌కు అనుగుణంగా పెన్షన్‌ పొందడమనేది వాళ్ల హక్కు. ఏండ్ల తరబడి న్యాయస్థానాల్లో పోరాడి తమ హక్కును కోర్టు తీర్పుద్వారా చెప్పించుకోగలిగారే కానీ.. ప్రభుత్వం ద్వారా సాధించుకోలేకపోయారు. 56 అంగుళాల ఛాతి అంటూ వీరబొడుచుకొని పరాయివాడిపై సర్జికల్‌ స్ట్రైక్‌లుచేశామని చెప్పుకొనే మోదీ.. దేశంలో అభాగ్యులైన వయోవృద్ధులపైనే అదేస్థాయిలో సమరంచేయడం ఎంతవరకు సమంజసం? కనీసం రాష్ర్టాల్లో ప్రభుత్వాలు ఇస్తున్న వృద్ధాప్య పింఛన్లపాటి కూడా పొందేందుకు వీరికి అర్హతలేదా?

ఈపీఎస్‌ అర్హతలేమిటి?

ఈపీఎస్‌కు అర్హత సాధించాలంటే కనీసంగా సర్వీసు సమయం పదేండ్లు ఉండాలి. ఒకవేళ 9.6 సంవత్సరాలు ఉంటే దానిని పది సంవత్సరాలుగా, 10.5 సంవత్సరాలుంటే పదకొండు సంవత్సరాలుగా పరిగణిస్తారు. 

గరిష్ఠంగా 35 సంవత్సరాలను సర్వీస్‌ సమయంగా పరిగణలోనికి తీసుకుంటారు. అంటే 40 సంవత్సరాల సర్వీస్‌ ఉన్నప్పటికీ 35 సంవత్సరాలను మాత్రమే లెక్కిస్తారు.

కనీసంగా 20 ఏండ్ల సర్వీసు దాటిన వారికి బోనస్‌గా రెండు సంవత్సరాలు కలుపుతారు. అంటే 33 సంవత్సరాల వారికి రెండు సంవత్సరాలు జోడించి... సర్వీస్‌ను 35 సంవత్సరాలుగా లెక్కిస్తారు. 

ఈ క్రమంలో గరిష్ఠ సర్వీస్‌ అనేది 33 సంవత్సరాలన్నమాట.

ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ (ఈపీఎఫ్‌ఓ) మార్గదర్శకాల ప్రకారం నెలకు రూ.15 వేల జీతం వచ్చే ఉద్యోగికి సర్వీసు లెక్కల ప్రకారం పదవీ విరమణ తర్వాత వచ్చే గరిష్ఠంగా వచ్చే పెన్షన్‌ రూ.7,500. ఉద్యోగంలోకి ప్రవేశించిన సమయంలోనే రూ.50వేల జీతంతో.. పదవీ విరమణ సమయానికి లక్షల్లో జీతం తీసుకొనే ఉద్యోగికి పదవీ విరమణ తర్వాత. అదే సర్వీసు లెక్కల ప్రకారం వచ్చే పెన్షన్‌ ఎంతో తెలుసా?! అక్షరాలా.. అదే ఏడున్నర వేల రూపాయలు.. 

ఎంత చెట్టుకు అంతగాలి అన్న సామెత ఇక్కడ పనికిరాదు. చెట్టు ఎంతదైనా.. అంతే గాలి. 

మొండి బకాయిల భరతం పడుతా.. మీ ఖాతాలో జమ చేస్తా అని ప్రజలకు వాగ్దానం చేసిన నరేంద్ర మోదీ సర్కార్‌ కార్పొరేట్లకు బానిసయ్యింది. 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి బకాయిలు ఏకంగా నాలుగు రెట్లు పెరిగాయి. మార్చి 31, 2014 వరకు రూ.2.63 లక్షల కోట్లుగా ఉన్న నిరర్థక ఆస్తుల విలువ మార్చి 31, 2018 నాటికి రూ.10.39 లక్షల కోట్లకు చేరుకున్నాయి. ఇదే సమయంలో దేశీయ బ్యాంకులు రూ.6.60 లక్షల కోట్ల మొండి బకాయిలను మాఫీచేశాయి. ఈపీఎఫ్‌ పింఛనర్లకు మాత్రం బతకడానికి భరోసా మాత్రం మోదీ సర్కారు ఇవ్వలేకపోతున్నది. 

కోర్టుల్లో సుదీర్ఘ పోరాటం

ఈపీఎఫ్‌వో ఈపీఎస్‌-95 పెన్షనర్లపై అనుసరిస్తున్న తీరుకు 2014లో మోదీ సర్కారు విడుదలచేసిన మార్గదర్శకాలే తార్కాణం. వీటిపై పెన్షనర్లు నిరసన వ్యక్తంచేశారు. తమ కంట్రిబ్యూషన్‌కు అనుగుణంగా పెన్షన్‌ కావాలని పలు న్యాయస్థానాల తలుపు తట్టారు. కేరళ హైకోర్టులో నాలుగేండ్లపాటు వాదనల అనంతరం 2018 అక్టోబర్‌ 12న పెన్షనర్లకు అనుకూలంగా తీర్పు వచ్చింది. దీనికి వ్యతిరేకంగా ఈపీఎఫ్‌వో సుప్రీంకోర్టులో స్పెషల్‌ లీవ్‌ పిటిషన్‌ను వేసిం ది. సుదీర్ఘ వాదనల అనంతరం ధర్మాసనం పెన్షనర్లకు అనుకూలంగా తీర్పునిచ్చింది. ‘పెన్షనర్లు తమ జీవితపు చివరిదశలో ఉన్నారు. వాళ్ల నోటికాడి ముద్దను దోచుకోవద్దు. పెన్షన్‌ అనేది కేవలం వాయిదా జీతాన్ని చెల్లించడం లాంటిది. ఇదేదో ఉదారంగా ఇచ్చేది కాదు. ఇది ఉద్యోగి హక్కు’ అని విస్పష్టంగా చెప్పింది. కేరళ హైకోర్టు తీర్పే కాదు.. ఈపీఎస్‌-95 కేసుల్లో పంజాబ్‌, హర్యానా, జార్ఖండ్‌ (రాంచి), హిమాచల్‌ప్రదేశ్‌ న్యాయస్థానాలు సైతం పెన్షనర్లకు అనుకూలంగా తీర్పులిచ్చాయి. దేశంలో ఏ ఒక్క న్యాయస్థానం కూడా ఈపీఎఫ్‌వోకు అనుకూలంగా తీర్పు ఇవ్వలేదు. అయినా మోదీ సర్కారు అంగీకరించడంలేదు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 226, సెక్షన్‌ (2) ప్రకారం.. ఏదైనా జాతీయ అంశానికి సంబంధించిన దానిపై హైకోర్టు తీర్పు ఇచ్చినట్లయితే అది పాన్‌ ఇండియా అంటే దేశం మొత్తానికి వర్తిస్తుందని కుసుమ్‌ ఇగ్నోట్స్‌ అండ్‌ అల్లోస్‌ లిమిటెడ్‌ కేసులో సుప్రీంకోర్టు చెప్పింది. కానీ, మోదీ సర్కారు మాత్రం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్‌ వేసి.. పెన్షనర్లకు కాలడ్డం పెట్టింది. 

గత నాలుగేండ్లలో చనిపోయిన పెన్షనర్ల సంఖ్య 1,64,003


అన్‌క్లెయిమ్‌ ఖాతాల్లో అరలక్ష కోట్లు

ఎంప్లాయీస్‌ క్లెయిమ్‌ చేసుకోకపోవడంతో.. మనుగడలో లేని ఈపీఎఫ్‌ ఖాతాల్లో ఉన్న మొత్తం ఎంతో తెలుసా?! రూ.54,658.86 కోట్లు. ఇది 2018 మార్చి వరకు లెక్కలు మాత్రమే. మరి ఆ మొత్తం ఇంకా పెరిగింది.

ఈ ప్రశ్నలకు బదులేది

మోదీ ప్రభుత్వం ఎన్‌పీఏలకు సంబంధించి జాతీయబ్యాంకుల్లో కార్పొరేట్లకు అనుకూలంగా నిర్ణయాలు తీసుకొని లక్షల కోట్ల బకాయిలు మాఫీచేసింది. నిరుపేద పెన్షనర్ల పట్ల మాత్రం జాలి దయ లేకుండా ఎందుకు వ్యవహరిస్తున్నది?

పెన్షన్‌ఫండ్‌ అనేది విరాళాలనుంచి సేకరిస్తారు. పెన్షనర్‌ లేదా నామినీ మరణించిన తర్వాత కూడా ఆ మొత్తం ఈపీఎఫ్‌వోలోనే ఉంచుకొంటారు. నామినీకి 50% పెన్షన్‌ చెల్లించడం.. వారి తదనంతరం ఆ మొత్తాన్ని ఈపీఎఫ్‌వో తన దగ్గర ఉంచుకోవడం ఎంతవరకు సమంజసం?

హైకోర్టుల నుంచి సుప్రీంకోర్టు వరకు అన్ని న్యాయస్థానాలు పెన్షనర్లకు అనుకూలంగా తీర్పులిచ్చినా ఒక్కో దానిపై అప్పీలుకు వెళుతూ ఈపీఎఫ్‌వో జాప్యం చేయడం ధర్మమేనా?  

ఈపీఎఫ్‌వోలో పనిచేసే ఉద్యోగులకు.. ఈపీఎఫ్‌వో సభ్యులైన ఉద్యోగులు చెల్లించే పరిపాలనా చార్జీల నిధి (అడ్మినిస్ట్రేటివ్‌ చార్జెస్‌ ఫండ్‌) నుంచే జీతాలు ఇస్తారు. పదవీవిరమణ తర్వాత వీరికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు సమానంగా పెన్షన్‌ వస్తుంది. కానీ పేద పెన్షనర్లకు మాత్రం ఎందుకు అన్యాయం జరుగుతుంది?

వాస్తవంగా కేంద్రం, ఈపీఎఫ్‌వో వేసిన ఎస్‌ఎల్పీ అనేది 1.9.2014 కంటే తర్వాత పదవీ విరమణ చేసిన వారికి సంబంధించింది. కానీ అంతకుముందు పదవీ విరమణచేసిన వారికి ఎందుకు అధిక పెన్షన్‌ను నిలిపివేసింది?