గురువారం 26 నవంబర్ 2020
Telangana - Nov 01, 2020 , 02:02:42

బీజేపీ, కాంగ్రెసోళ్లకు దుబ్బాక గుబులు

బీజేపీ, కాంగ్రెసోళ్లకు దుబ్బాక గుబులు

  • టీఆర్‌ఎస్‌కు ఆదరణ చూసి తట్టుకుంటలేరు 
  • బీజేపీ ఝూటా మాటలనుతిప్పికొట్టాలి
  • యువతకు ఆర్థికశాఖమంత్రిహరీశ్‌రావు పిలుపు
  • రాయపోల్‌, నార్సింగ్‌మండలాల్లో ప్రచారం

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్‌ఎస్‌ పార్టీకి వస్తు న్న ఆదరణ చూసి బీజేపీ, కాంగ్రెసోళ్లకు గుబు లు పుట్టిందని.. ఏంచేయాలో తెలియక ఆ రెండు పార్టీల నాయకులు ఆగమాగమవుతున్నారని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు అన్నా రు. శనివారం సిద్దిపేట జిల్లా రాయపోల్‌ మండలం ఎల్కల్‌, బేగంపేట, మెదక్‌ జిల్లా నార్సింగ్‌తోపాటు బోనాల, కొండాపూర్‌లో జరిగిన ఎన్నికల ప్రచార సభల్లో హరీశ్‌రావు పాల్గొన్నారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా కృషి చేస్తుంటే.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రైతుల వెన్ను విరిసేలా కరెంటు మోటర్లకు మీటర్లు పెట్టాలని చూస్తున్నదని విమర్శించారు. దుబ్బాక ప్రజలు చూస్తూ ఊరుకోవద్దని, ఓటుతో బీజేపీకి గుణపాఠం చెప్పాలని మంత్రి పిలుపునిచ్చారు. ఒకటికి రెండుసార్లు ఆలోచించి ఓటేయాలని కోరారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాతక్కను భారీ మెజార్టీతో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

మంచినీళ్ల కష్టం తీరింది.. 

ఆడబిడ్డలు నీళ్ల కోసం బిందెలతో రోడ్డుపైకి రావొద్దని సీఎం కేసీఆర్‌ ప్రభుత్వం మిషన్‌ భగీరథ ద్వారా ఇంటింటికీ నీరిచ్చి మహిళల కష్టాలను దూరంచేసిందని మంత్రి అన్నారు. సమైక్య పాలనలో మహిళలు బోరింగులు కొట్టికొట్టీ.. బిందెలు మోసీ భుజాలు కాయలు కాసేవని, ఇప్పుడు ఏ గ్రామంలోనూ నీటి కష్టాలు లేవన్నారు. ఓట్ల కోసం ఈ రోజు అందరూ వస్తున్నారనీ, జనం కష్టాలు తెలియని నాయకులు మొసలి కన్నీళ్లు కారుస్తున్నారని ప్రజలు గమనించాలని విజ్ఞప్తిచేశారు. వృద్ధులు, వితంతువులు, బీడీ కార్మికులకు టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం పింఛన్లు ఇస్తున్నదని, బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడా ఇలాంటి పథకాలే లేవని హరీశ్‌రావు స్పష్టంచేశారు. బీడీ కార్మికులకు రూ.1600 పింఛన్‌ కేంద్రమే ఇస్తున్నట్లు నిరూపిస్తే తాను రాజీనామా చేస్తానని సవాల్‌ విసిరితే.. బీజేపీ వాళ్లు ఎవరూ ముందుకురాలేదని మంత్రి ఎద్దేవా చేశారు. ముక్కునేలకు రాసే పరిస్థితి వస్తుందనే వారెవరు రాలేదని విమర్శించారు.ఏడాదికి కోటి అన్నారు.. 

ఏడేండ్లలో ఎన్ని ఉద్యోగాలిచ్చారు?

కేంద్రంలో తాము అధికారంలోకి వస్తే ఏటా కోటి ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన బీజే పీ.. గడచిన ఏడేండ్లలో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో చెప్పాలని మంత్రి హరీశ్‌రావు డిమాండ్‌ చేశారు. నార్సింగి మండలం బోనా ల కొండాపూర్‌ యువగర్జన సభలో మంత్రి మాట్లాడుతూ.. విదేశాల్లోని నల్లడబ్బు తెచ్చి ఒక్కొక్కరి ఖాతాల్లో రూ.15 లక్షలు చొప్పున వేస్తామని మోదీ చెప్పారని.. ఇప్పటివరకు ఎంతమందికి డబ్బులు వేశారో చెప్పాలని ప్రశ్నించారు. గోబెల్స్‌ ప్రచారంలో బీజేపీ వాళ్లకు నోబెల్‌ బహుమతి ఇవ్వొచ్చని మంత్రి ఎద్దేవా చేశారు. సోషల్‌ మీడియాలో బీజేపీ చేస్తున్న తప్పుడు ప్రచారాన్ని గట్టిగా తిప్పికొట్టాలని యువతకు పిలుపునిచ్చారు. భుజాలు కాయలుకాసేలా జెండాలు మోసిన కార్యకర్తలనే పట్టించుకోని బీజేపీ నేతలు, ప్రజలను ఏం పట్టించుకుంటారని విమర్శించారు. ప్రస్తుత కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.. నాడు తెలంగాణ ఉద్యమంలో రాష్ట్రం కోసం పదవికి ఎందుకు రాజీనామా చేయలేదు? అని ప్రశ్నించారు. రాజీనామాలు, త్యాగాలు చేయాలంటే బీజేపీ నాయకులు వెన్ను చూపారని.. ఆమరణ దీక్షలు, పోరాటాలు చేసింది టీఆర్‌ఎస్సేనని స్పష్టం చేశాఉ. తెలంగాణలోని 7 మండలాలను ఆంధ్రలో కలిపి తెలంగాణకు అన్యాయం చేసింది ఎవరని బీజేపీపై మంత్రి హరీశ్‌రావు విరుచుకుపడ్డారు.

సీలేరు పవర్‌ ప్లాంట్‌ను అన్యాయంగా ఆంధ్రలో కలిపింది ఎవరని ప్రశ్నించారు. రెండు రోజుల్లో ఝూటా బీజేపీ నాయకులు ఏదో ఒకటి యాక్షన్‌ చేస్తారని.. వాళ్ల బట్టలు వాళ్లే చింపుకుని టీఆర్‌ఎస్‌ వాళ్లే చింపారంటారనీ, మనం జాగ్రత్తగా ఉండాలని మంత్రి సూచించారు. దుబ్బాక టీఆర్‌ఎస్‌ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించుకుని హుజూర్‌నగర్‌ తరహా ప్యాకేజీ దుబ్బాకకు తెచ్చుకుందామని పిలుపునిచ్చారు. నార్సింగ్‌లో జరిగిన రోడ్‌షో, సభలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థి సోలిపేట సుజాత, ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, మానకొండూరు ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పాల్గొన్నారు.  

పసుపుబోర్డు బాండ్‌పేపర్‌ ఏమైంది?

దుబ్బాక: బీజేపీ నాయకులు చేసే ఝూటా ప్రచారాలు  నచ్చక ఆ పార్టీ శ్రేణులు టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు పేర్కొన్నారు. శనివారం రాత్రి దుబ్బాక రెడ్డి సంఘంలో హరీశ్‌రావు సమక్షంలో చెల్లాపూర్‌కు చెందిన బీజేపీ నాయకులు భారీ సంఖ్యలో టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. దుబ్బాకలో బీజేపీ నాయకులు చేసిన ఝూటా ప్రచారంపై తాను 10 ప్రశ్నలు వేస్తే ఇప్పటికీ ఏ ఒక్క దానికి సమాధానం చెప్పలేకపోతున్నారని విమర్శించారు. ఆ పార్టీకి చెందిన ఒకతను నిజామాబాద్‌కు పసుపు బోర్డు తీసుకొస్తానని బాండ్‌ పేపరు రాసిచ్చి రెండేండ్లు గడిచినా.. ఇంతవరకు తేలేదన్నారు. ఇప్పుడు దుబ్బాకలో వాళ్లూ చేస్తున్న ప్రచారం కూడా అలాంటిదేనని ఎద్దేవా చేశారు.  

ప్రతి ఎకరాకూ గోదావరి నీళ్లు

ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా.. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తి చేసి బీడు భూముల్లో గోదావరి నీళ్లు పారించామని మంత్రి స్పష్టంచేశారు. ఇంటింటికీ తాగునీరిచ్చినట్లే ప్రతి ఎకరాకూ సాగు నీరు ఇచ్చి తీరుతామని హరీశ్‌రావు చెప్పారు. దుబ్బాక నియోజకవర్గంలోని ప్రతి ఎకరాకూ గోదావరి నీళ్లు ఇస్తామని చెప్పారు. రాబోయే రోజుల్లో రైతులకు బోర్లు వేసే పరిస్థితి ఉండదనీ, కాలు అడ్డం పెడితే గోదావరి జలాలు పొలాల్లోకి వస్తాయన్నారు. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్‌ ఇస్తున్నట్లుగా బీజేపీ పాలిత రాష్ర్టాల్లో ఎక్కడైన ఉచిత కరెంట్‌ ఇస్తున్నారో బీజేపీ నాయకులు చెప్పాలని డిమాండ్‌ చేశారు.