మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 09, 2020 , 00:16:56

ఇదీ బీజేపీ బలం

ఇదీ బీజేపీ బలం

  • వెలవెలబోయిన కంటోన్మెంట్‌ సభ జనాలు లేక కంగుతిన్న బండి సంజయ్‌.. గంటసేపు కిషన్‌రెడ్డి ఎదురుచూపులు మధ్యలోనే వెనుతిరిగిన జనం.. బీజం పడకముందే వాడిన కమలం

కంటోన్మెంట్‌: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌పై పాగా వేస్తామని బీరాలు పోతున్న బీజేపీకి క్షేత్రస్థాయి వాస్తవమేమిటో ఆదివారం నాటి కంటోన్మెంట్‌ సభ తెలియజెప్పింది. 150 డివిజన్లలో జెండా ఎగురవేస్తామన్న పార్టీ.. కంటోన్మెంట్‌ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు చేరిక అంటూ భారీ సభ, బైక్‌ ర్యాలీ ఏర్పాటుచేసి కేంద్ర హోం శాఖ సహాయమంత్రి, రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు అక్కడికి చేరుకుంటే తీరా వంద, నూటయాభై మంది మాత్రమే జనం కనిపించారు. దీంతో బీజం పడకముందే కమలం వాడిపోయిందన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కంటోన్మెంట్‌ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ బీజేపీలో చేరికను నేపథ్యం చేసుకుని ఆ పార్టీ పెద్దలు అట్టహాసాన్ని ప్రదర్శించాలని ఉబలాటపడ్డారు. కానీ, జనం లేక సభ వెలవెలబోవడంతో తెల్లముఖాలు వేయాల్సి వచ్చింది.

కంగుతిన్న నేతలు

కంటోన్మెంట్‌ బోర్డు మాజీ ఉపాధ్యక్షుడు రామకృష్ణ బీజేపీలో చేరికకు ఆ పార్టీ భారీ సభ ఏర్పాట్లు చేసింది. సభాస్థలికి ఉదయం 11.40 గంటలకు కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి చేరుకున్నారు. అక్కడ జనం పలుచగా ఉండటంతో 12.40 గంటల దాకా ఎదురుచూశారు. అప్పటికీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ బైక్‌ ర్యాలీ సభాస్థలికి చేరుకోలేదు. జనమంతా బైక్‌ ర్యాలీ వెంట ఉన్నారనుకుని త్వరగా రావాలని సంజయ్‌కు కిషన్‌రెడ్డి ఫోన్‌ చేసినట్లుగా సమాచారం. దీంతో ఆదరాబాదరాగా ఆయన సభ వద్దకు చేరుకోగా.. ఇటు ర్యాలీలో జనం లేక, అటు సభ వద్ద జనం లేక.. మొత్తంగా 100-150 మంది మాత్రమే దర్శనమివ్వడంతో నేతలంతా కంగుతిన్నారు. దీంతో జనసమీకరణలో విఫలమైన స్థానిక నేతలపై తీవ్ర అసంతృప్తి వ్యక్తంచేశారు. ఇంతదానికి తననను ఎందుకు ఆహ్వానించారంటూ మండిపడినట్లు తెలిసింది. ‘ఈ గింత కార్యక్రమాన్ని పార్టీ కార్యాలయంలోనే పెట్టుకుంటే సరిపోయేది కదా’ అని మందలించినట్లు సమాచారం.  ఒక దశలో బీజేపీ శ్రేణులు రెచ్చగొట్టేలా వ్యవహరించినా పోలీసులు పూర్తి సంయమనం పాటించారు. 

బెడిసికొట్టిన వ్యూహం

కంటోన్మెంట్‌ బోర్డును ప్రజాదరణతో టీఆర్‌ఎస్‌ కైవసం చేసుకోగా.. పార్టీలో అంతర్గత ఒప్పందం ప్రకారం బోర్డు ఉపాధ్యక్షుడిగా ఉన్న రామకృష్ణ రాజీనామా చేసి, మరొకరికి ఆ అవకాశం ఇవ్వాల్సి ఉంది. కానీ పదవీ వ్యామోహంతో ముందస్తు అంగీకారాన్ని విస్మరించడంతో పార్టీ అధిష్ఠానం కూడా తప్పుకోవాలని సూచించింది. ఈ నేపథ్యంలో పదవి కోసం టీఆర్‌ఎస్‌ పార్టీని వీడిన రామకృష్ణను ఇతర టీఆర్‌ఎస్‌ సభ్యులు అవిశ్వాస తీర్మానం ప్రకటించి పదవినుంచి దించేశారు. రామకృష్ణను పార్టీలో చేర్చుకుని కంటోన్మెంట్‌ పరిధిలో లేని బలాన్ని ప్రదర్శించాలని కమలనాథులు అత్యాశకు పోయారు. ముఖ్యంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌ని ఆహ్వానించడం వల్ల జనం కూడా భారీ ఎత్తున వస్తారని ఊహించారు. కానీ వాళ్ల వ్యూహం పూర్తిగా బెడిసికొట్టింది. స్థానిక జనం ఆ వంక కన్నెత్తి చూడకపోగా... కార్యక్రమాన్ని నిర్వహించిన వారు సైతం జనాన్ని తీసుకురాలేక చేతులెత్తేయడంతో సభా ప్రాంగణం ఖాళీ కుర్చీలతో వెలవెలబోయింది. 

మాస్కు ఎక్కడ బండి?

కరోనా విజృంభిస్తున్న సమయంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్న బండి సంజయ్‌ మాస్కు లేకుండానే ర్యాలీలో పాల్గొన్నా రు. ఇప్పటికీ కరోనా తగ్గుముఖం పట్టలేదని.. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చెప్తున్నా, మాస్కు పెట్టుకోకపోవడంపై పలువురు విమర్శిస్తున్నారు.