శనివారం 06 జూన్ 2020
Telangana - May 22, 2020 , 01:20:32

బయోడైవర్సిటీ ఫస్ట్‌ లెవల్‌ ఫ్లైఓవర్‌ ఓపెన్‌

బయోడైవర్సిటీ ఫస్ట్‌ లెవల్‌ ఫ్లైఓవర్‌ ఓపెన్‌

  • ప్రారంభించిన మంత్రి కేటీఆర్‌

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: హైదరాబాద్‌లోని బయోడైవర్సిటీ జంక్షన్‌లో ఫస్ట్‌ లెవల్‌ ఫ్లైఓవర్‌ని గురువారం మున్సిపల్‌శాఖ మంత్రి కేటీ రామారావు ప్రారంభించారు. దీంతో హైటెక్‌సిటీ, మాదాపూర్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య చాలా వరకు తగ్గనుంది. రూ.30.26 కోట్ల వ్యయంతో ఈ ఫ్లైఓవర్‌ను నిర్మించారు. వ్యూహాత్మక రోడ్ల అభివృద్ధి ప్రణాళిక(ఎస్‌ఆర్డీపీ) ప్యాకేజీ-4లో భాగం గా ఐటీ కారిడార్‌లో చేపట్టిన ఆరు పనుల్లో ఇది చివరిది. వెస్ట్‌జోన్‌, ఫైనాన్షియల్‌ డిస్ట్రిక్ట్‌ ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్యలను అధిగమించేందుకు ఈ ప్యాకేజీ-4ను ప్రారంభించారు. ఇందులో భాగంగా రూ. 379 కోట్ల వ్యయంతో జేఎన్టీయూ నుంచి బయోడైవర్సిటీ వరకు సుమారు 12 కిలోమీటర్ల కారిడార్‌లో నాలుగు ఫ్లైఓవర్లు, రెండు అండర్‌పాస్‌ల నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించారు. ఇందులో ఇదివరకే ఐదు పనులను పూర్తి చేసి ప్రారంభించారు. తాజాగా గురువారం బయోడైవర్సిటీ ఫస్ట్‌ లెవల్‌ ఫ్లైఓవర్‌ను కూడా ప్రారంభించడంతో నాలుగో ప్యాకేజీ కింద చేపట్టిన మొత్తం ఆరు పనులూ పూర్తయినట్టైంది. ఫ్లైఓవర్‌ ప్రారంభ కార్యక్రమంలో విద్యాశాఖ మంత్రి సబితారెడ్డి, పార్లమెంటు సభ్యుడు రంజిత్‌రెడ్డి, ప్రభుత్వ విప్‌ అరికెపూడి గాంధీ, మేయర్‌ బొంతు రామ్మోహన్‌, స్థానిక కార్పొరేటర్లు, అధికారులు పాల్గొన్నారు.


logo