బుధవారం 03 జూన్ 2020
Telangana - Feb 17, 2020 , 03:01:01

నేటినుంచి బయోఏషియా సదస్సు

నేటినుంచి బయోఏషియా సదస్సు
  • జీనోమ్‌ వ్యాలీ అవార్డు ప్రదానం చేయనున్న మంత్రి కేటీఆర్‌
  • రేపు కేంద్ర మంత్రి పీయూష్‌గోయల్‌ హాజరు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లైఫ్‌సైన్సెస్‌ విభాగంలో ప్రతిష్ఠాత్మక బయోఏషియా సదస్సు సోమవారం నుంచి ప్రారంభంకానున్నది. హెచ్‌ఐసీసీలో మూడురోజులపాటు జరిగే ఈ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. ఈ సదస్సుకు 37 దేశాల నుంచి 2,000 మంది ప్రతినిధులు హాజరుకానున్నారు. వీరంతా సోమవారం ఉదయం జీనోమ్‌ వ్యాలీని సందర్శిస్తారు. 


అక్కడ వీరితో రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు భేటీకావడంతోపాటు మరికొన్ని కార్యక్రమాల్లో పాల్గొంటారు. సాయంత్రం 6 గంటలకు ఆయన బయోఏషియా సదస్సు ప్రారంభ కార్యక్రమానికి హాజరై జీనోమ్‌ వ్యాలీ అవార్డును ప్రదానం చేయనున్నారు. లైఫ్‌సైన్సెస్‌ విభాగంలో విశేషకృషి చేసిన కార్ల్‌ హెచ్‌ జూన్‌, వాన్‌ నర్సింహన్‌లకు ఇప్పటికే ఈ అవార్డులను ప్రకటించారు. మంగళవారం రెండోరోజు జరిగే కార్యక్రమానికి కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్‌గోయల్‌ హాజరవుతారు. సీఈవోల ప్యానెల్‌ డిస్కషన్‌కు మంత్రి కేటీఆర్‌ మోడరేటర్‌గా వ్యవహరిస్తారు. బుధవారం సదస్సు ముగింపు కార్యక్రమంలో ఎంపికచేసిన స్టార్టప్‌లకు మంత్రి కేటీఆర్‌ చేతులమీదుగా అవార్డులను ప్రదానం చేస్తారు. 


ఈ సదస్సు సందర్భంగా వివిధ దేశాలకు చెందిన సంస్థలు తమ ఉత్పత్తులను ప్రదర్శించనున్నాయి. తెలంగాణకు మరిన్ని పెట్టుబడులు ఆకర్షించాలని కృతనిశ్చయంతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. ఇక్కడున్న వనరులు, అవకాశాల గురించి ప్రపంచదేశాల ఫార్మా పారిశ్రామికవేత్తలకు తెలియజేయనున్నది. ప్రధానంగా ఫార్మాసిటీతోపాటు జీనోమ్‌ వ్యాలీ, మెడికల్‌ డివైజెస్‌ పార్కుల్లో పెట్టుబడులకున్న అవకాశాలను వివరించనున్నది.


స్వాగతం పలికేందుకు ఎదురుచూస్తున్నా

  • ఇప్పటివరకు రూ.17,500 కోట్ల పెట్టుబడులు
  • మంత్రి కేటీఆర్‌ ట్వీట్‌ 


బయోఏషియా సదస్సులో ఈ ఏడాది కూడా ఆసక్తికరమైన పలు ప్రకటనలుంటాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు ఆదివారం ట్వీట్‌ చేశారు. బయోఏషియా ఇప్పటివరకు నిర్వహించిన 16 సదస్సుల్లో రూ.17,500 కోట్ల పెట్టుబడులు వచ్చాయని, 16,000 భాగస్వామ్య సమావేశాలు జరిగాయని, 95 దేశాల నుంచి ప్రతినిధులు హాజరయ్యారని వివరించారు. బ యోఏషియా సదస్సు ప్రపంచంలోనే ఎంతో పేరు పొందిందన్నారు. 


హెచ్‌ఐసీసీలో సోమవారం ఈ సదస్సును ప్రారంభించనున్నానని, తెలంగాణలో ఉన్న వనరులు, అవకాశాలను వివరించేందుకు ఈ సదస్సు చక్కటి వేదికగా ఉపయోగపడుతుందని తెలిపారు. సదస్సుకు విచ్చేయనున్న ప్రముఖ శాస్త్రవేత్తలు, నిపుణులకు స్వాగతం పలికేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నానన్నారు. కార్ల్‌ హెచ్‌ జూన్‌, కిరణ్‌ ముజుందార్‌షా, పీటర్‌ పియట్‌, రేణు స్వరూప్‌ సహా అనేక మంది ప్రముఖులు ఈ సదస్సుకు రానున్నారని, సదస్సులో భాగంగా మంగళవారం జరిగే సీఈవోల ప్యానల్‌ డిస్కషన్‌కు తాను మోడరేటర్‌గా వ్యవహరించనున్నానని పేర్కొన్నారు. గ్లోబల్‌ లీడర్లు ఈ సదస్సులో పాల్గొంటారని కేటీఆర్‌ తెలిపారు.


logo