మంగళవారం 27 అక్టోబర్ 2020
Telangana - Feb 16, 2020 , 03:13:40

రేపటినుంచి బయో ఏషియా సదస్సు

రేపటినుంచి బయో ఏషియా సదస్సు
  • ఒకే వేదికపైకి పలురంగాల ప్రముఖులు, ఆవిష్కర్తలు
  • 37 దేశాల నుంచి 2 వేల మంది ప్రతినిధులు హాజరు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: లైఫ్‌సైన్సెస్‌ రంగంలో కీలకమైన బయో ఏషియా సదస్సు ఈ నెల 17 నుంచి ప్రారంభంకానున్నది. ఎంతో ప్రతిష్ఠాత్మకమైన ఈ సదస్సుకు రాష్ట్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. హెచ్‌ఐసీసీలో మూడురోజులపాటు జరిగే ఈ సదస్సుకు 37 దేశాల నుంచి 2,000 మంది ప్రతినిధులు, 800 కంపెనీల ప్రతినిధులతోపాటు 75 స్టార్టప్‌ కంపెనీలు హాజరుకానున్నాయి. ‘రేపటి కోసం నేడు’ అనే ఇతివృత్తంతో నిర్వహించనున్న ఈ సదస్సు ద్వారా రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టేలా పారిశ్రామికవేత్తలను ఆకర్షించాలని ప్రభుత్వం ప్రయత్నిస్తున్నది. 


ప్రపంచంలోని లైఫ్‌సైన్సెస్‌ కంపెనీలు రేపటి తరాల కోసం తమ సామర్థ్యాన్ని పెంచుకొని పెట్టుబడులు పెట్టేందుకు అవసరమైన విధానాలను రూపొందించడంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ సంవత్సరం ఈ సదస్సుకు స్విట్జర్లాండ్‌తోపాటు అసోం, కేరళ, ఒడిశా, గుజరాత్‌ రాష్ట్రాలు భాగస్వాములుగా ఉన్నాయి. భారత్‌ లాంటి వర్ధమాన మార్కెట్లలోని అవకాశాలను పరిశీలించి పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచస్థాయి లైఫ్‌సైన్సెస్‌, ఫార్మా పారిశ్రామిక వర్గాలతోపాటు పరిశోధకులు, విధాననిర్ణేతలు, ఆవిష్కర్తలను ఒకే వేదికపైకి తీసుకరావడంలో బయో ఏషియా కీలకపాత్ర పోషిస్తున్నది. 


దేశంలో లైఫ్‌సైన్సెస్‌, ఫార్మా, మెడికల్‌ డివైజెస్‌ అండ్‌ డిజిటల్‌ హెల్త్‌కేర్‌ రంగాల అభివృద్ధితోపాటు నూతన ఆవిష్కరణలు, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఆరోగ్యరంగంలోని సవాళ్లకు చవకైన పరిష్కారాలను కనుగొనడం లాంటి పలు కీలక అంశాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించనున్నారు. లైఫ్‌సైన్సెస్‌ టెక్నాలజీ, హెల్త్‌కేర్‌ రంగాల్లో మహిళలు సాధించిన ప్రగతిపై ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించి వారి సేవలను గుర్తించనున్నారు. ఇండియా, స్విట్జర్లాండ్‌, జర్మనీ, ఆస్ట్రేలియా, బ్రిటన్‌ తదితర దేశాల నుంచి ఎంపికచేసిన 75 స్టార్టప్‌ కంపెనీలు ఈ సదస్సులో 175 ప్రదర్శనలు ఇవ్వనున్నాయి. 


మరిన్ని పెట్టుబడులు ఆకర్షించడమే ధ్యేయం

  • ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్‌

ప్రపంచస్థాయి లైఫ్‌సైన్సెస్‌ కంపెనీలు హైదరాబాద్‌కు రావడంలో బయోఏషియా కీలకపాత్ర పోషిస్తున్నదని రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. హైదరాబాద్‌లోని ప్రపంచస్థాయి పరిశ్రమల్లో మౌలికవసతుల ప్రమాణాలను, పెట్టుబడులకు ఇక్కడున్న అవకాశాలను ప్రదర్శించేందుకు బయోఏషియా చక్క ని అవకాశంగా ఉన్నదని, ఇక్కడి బయో, లైఫ్‌సైన్సెస్‌ ఎకో సిస్టమ్‌ గురించి నే రుగా తెలుసుకోవడానికి ఈ సదస్సు వీలుకల్పించనున్నదని తెలిపారు. 


ఈ సదస్సును విజయవంతంచేసి లైఫ్‌సైన్సెస్‌, ఫార్మారంగాల్లో హైదరాబాద్‌కు మరి న్ని పెట్టుబడులు తీసుకురావాలని తెలంగాణ ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉన్నదన్నారు. బయోఏషియా 17 ఏండ్ల నుంచి ఇలాంటి సదస్సులు నిర్వహిస్తూ వందల కొద్దీ ప్రత్యేక సమావేశాలు ఏర్పాటుచేసి స్థానిక కంపెనీలకు ప్రపంచ పెట్టుబడిదారులను పరిచయం చేసిందని తెలిపారు. ఈ సంవత్సరం జరిగే 17వ సదస్సుకు అనేకమంది ప్రముఖులతోపాటు కేంద్ర వాణిజ్య, రైల్వేశాఖల మంత్రి పీయూష్‌ గోయల్‌, ప్రపంచస్థాయి కంపెనీల సీనియర్‌ ప్రతినిధులు, పరిశోధకులు ప్రత్యేక అతిథులుగా హాజరవుతున్నట్టు మంత్రి కేటీఆర్‌ వివరించారు.


logo