శనివారం 30 మే 2020
Telangana - May 09, 2020 , 01:59:12

బీహారీ హమాలీ ఆగయా!

బీహారీ హమాలీ ఆగయా!

  • శ్రామిక్‌ ఎక్స్‌ప్రెస్‌లో రాష్ర్టానికి బీహార్‌ కూలీలు
  • స్వాగతం పలికిన మంత్రి గంగుల కమలాకర్‌
  • రైస్‌మిల్లుల్లో పనిచేసేందుకు జిల్లాలకు తరలింపు

హైదరాబాద్‌/రంగారెడ్డిజిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ/శేరిలింగంపల్లి: లాక్‌డౌన్‌ నేపథ్యంలో దేశంలోని వివిధ ప్రాంతాల్లోఉన్న వలసకూలీలు సొంతరాష్ర్టాల బాట పడుతుంటే.. బీహార్‌ నుంచి 225 మంది కూలీలు పనులకోసం తెలంగాణకు చేరుకున్నారు. దాదాపు 225మంది రాష్ట్రంలో రైస్‌మిల్లుల్లో పనిచేసేందుకు వచ్చా రు. తెలంగాణ ప్రభుత్వం వీరిని బీహార్‌లోని ఖగారియా ప్రాంతం నుంచి ప్రత్యేక రైలులో తీసుకొచ్చింది. శ్రామిక్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలులో శుక్రవారం మధ్యాహ్నం ఒంటిగంటకు లింగంపల్లి రైల్వేస్టేషన్‌కు చేరుకున్న వలసకూలీలకు పౌరసరఫరాలశాఖ మంత్రి గంగుల కమలాకర్‌, రైతు బంధుసమితి చైర్మన్‌ పల్లా రాజేశ్వర్‌రెడ్డి, సివిల్‌ సప్లయీస్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి స్వాగతం పలికారు. కూలీలకు పరీక్షలు నిర్వహించి, నల్లగొండ, మిర్యాలగూడ, కరీంనగర్‌, కామారెడ్డి, జగిత్యాల, పెద్దపల్లి, సుల్తానాబాద్‌, మంచిర్యాల, సిద్దిపేటకు ప్రత్యేక బస్సుల్లో పంపించారు. ఈ సందర్భంగా మంత్రి గంగుల కమలాకర్‌ మాట్లాడుతూ.. వలసకూలీలు తెలంగాణ అభివృద్ధిలో భాగస్వాములని, వారిని కంటికి రెప్పలా చూసుకుంటామని చెప్పారు. తెలంగాణలోని రైస్‌మిల్లుల్లో పనిచేసే బీహార్‌ కూలీ లు హోలీ పండుగకు స్వస్థలానికి వెళ్లి లాక్‌డౌన్‌వల్ల అక్కడే చిక్కుకుపోయారని తెలిపారు. విషయాన్ని సీఎం కేసీఆర్‌ దృష్టికి తీసుకెళ్లడంతో వారిని రప్పించేలా చర్యలు తీసుకున్నారని చెప్పారు. 


logo