గురువారం 21 జనవరి 2021
Telangana - Jan 13, 2021 , 01:30:52

భార్గవరామే కిడ్నాపర్‌!

భార్గవరామే కిడ్నాపర్‌!

  • ముసుగువేసుకొని ప్రవీణ్‌ ఇంట్లోకి
  • తన భర్త ప్రత్యక్ష పాత్ర నిజమే
  • విచారణలో ఒప్పుకొన్న అఖిలప్రియ?
  • హఫీజ్‌పేట భూమి కోసమే విభేదాలు
  • బెడిసికొట్టిన బినామీ వ్యవహారం
  • గోవాలో కొందరు నిందితుల అరెస్టు!

హైదరాబాద్‌ సిటీబ్యూరో, జనవరి 12 (నమస్తే తెలంగాణ): బోయిన్‌పల్లి కిడ్నాప్‌ కేసులో ఏపీ మాజీ మంత్రి అఖిలప్రియ భర్త భార్గవ్‌రామ్‌ ప్రత్యక్ష ప్రమేయం ఉన్నట్టు తేలింది. కిడ్నాపర్‌ గుంటూరు శీనుతో కలిసి తన భర్త స్వయంగా ముసుగువేసుకొని ప్రవీణ్‌రావు ఇంట్లోకి వెళ్లారని అఖిలప్రియ పోలీసులకు వెల్లడించారు. దీంతో కిడ్నాపర్లలో భార్గవ్‌రామ్‌ కూడా ఉన్నట్లు స్పష్టమైంది. ఈ కేసుకు సంబంధించి అఖిలప్రియ రెండోరోజు కస్టడీ మంగళవారం ముగిసింది. కోర్టు ఆదేశాల మేరకు బోయిన్‌పల్లి పోలీసులు న్యాయవాది సమక్షంలో విచారణ జరిపారు. ఉదయం 10 గంటలకు ప్రారంభమైన విచారణ సాయంత్రం ఐదు వరకు సాగింది. ఈ సందర్భంగా అఖిలప్రియ కీలక విషయాలను తెలిపారు. కిడ్నాప్‌ సమయంలో తన పీఏ సంపత్‌కుమార్‌ ఇంటి బయట ఉండి తనకు ఫోన్‌లో ఎప్పటికప్పుడు సమాచారం అందించాడని తెలిపారు. హఫీజ్‌పేట భూము ల వ్యవహారంలో తన తండ్రి భూమా నాగిరెడ్డి.. ప్రవీణ్‌రావు తండ్రి కృష్ణారావు పేరుపై బినామీగా 48 ఎకరాల భూములు కొన్నారని, ఇద్దరు కూడా చనిపోయేసరికి వ్యవహారం వివాదంగా మారిందని అఖిలప్రియ చెప్పారు. ఈ విషయంలో ఎన్నిసార్లు ప్రవీణ్‌, అతని సోదరులతో మాట్లాడినా పట్టించుకోలేదని, కిడ్నాప్‌ చేసి బెదిరించడమే మార్గమని భావించినట్టు పేర్కొన్నారు. 

గాలింపు ముమ్మరం

కిడ్నాప్‌ జరిగిన నాటినుంచి వేగంగా స్పందించిన హైదరాబాద్‌ పోలీసులు ముందుగా అఖిలప్రియను, మరో ఇద్దరిని అరెస్టు చేసిన సంగతి తెలిసిందే. కిడ్నాప్‌లో ప్రధాన పాత్ర పోషించిన గుంటూరు శీను, భార్గవ్‌రామ్‌తోసహా 15 మంది ఇంకా పరారీలోనే ఉన్నారు. తాజా వార్తల ప్రకారం వీరిద్దరూ పోలీసులకు చిక్కినట్టు సమాచారం. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక బృందాలు రంగంలోకి దిగి ముమ్మరంగా గాలిస్తున్నాయి.. గోవా, విజయవాడ, కర్నూలు, ఆళ్లగడ్డ, కడప, గుంటూరుతోపాటు పలు ప్రాంతాల్లో గాలిస్తున్నారు.. ఇప్పటికే కొందరిని అదుపులోకి తీసుకొన్నట్టు తెలుస్తున్నా.. పోలీసులు అధికారికంగా ధ్రువీకరించడంలేదు. ఈ భూ వ్యవహారంలో కిడ్నాప్‌ చేసేందుకు గ్యాంగ్‌కు సుపారీ ఇచ్చారా? లేక ప్యాకేజీ మాట్లాడుకున్నారా? అన్నది తేలాల్సి ఉన్నది. ప్రధాన కిడ్నాపర్‌ గుంటూరు శీనును విచారిస్తే తప్ప కేసు మొత్తం కొలిక్కిరాదని చెప్తున్నారు. మరోపక్క ఈ కేసులో ఏ-2గా ఉన్న సుబ్బారెడ్డికి బాధితులు భారీ ఎత్తున డబ్బులు ఇచ్చారని పోలీసులకు సమాచారం అందింది.

గురువారం వరకు కస్టడీలోనే..

అఖిలప్రియ గురువారం మధ్యాహ్నం వరకు తమ కస్టడీలోనే ఉంటుందని, ఆ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరిచి జైలుకు పంపుతామని పోలీసు అధికారులు తెలిపారు. కస్టడీలో అఖిలప్రియ పోలీసులు అడిగిన కొన్ని ప్రశ్నలకు సమాధానం చెప్పినప్పటికీ.. వారికి ఆశించినంత సహకారం అందించలేదని తెలుస్తున్నది. తమకు లభించిన ఆధారాలు, సమాచారం, సాంకేతిక క్లూస్‌ను ఆమె ముందు పెట్టి విచారించినట్టు సమాచారం. హఫీజ్‌పేట్‌లోని 48 ఎకరాల స్థలానికి సంబంధించిన వివరాలను ఆమె నుంచి సేకరించినట్లు తెలిసింది. అఖిలప్రియను నార్త్‌జోన్‌ డీసీపీ కల్మేశ్వర్‌ సింగన్వార్‌, బేగంపేట ఏసీపీతోపాటు మహిళా అధికారులు విచారించారు.


logo