శుక్రవారం 03 జూలై 2020
Telangana - Jun 23, 2020 , 18:59:06

పీవీకి భారతరత్న ఇవ్వాలి : సీఎం కేసీఆర్‌

పీవీకి భారతరత్న ఇవ్వాలి : సీఎం కేసీఆర్‌

హైదరాబాద్‌ : మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావుకు కేంద్రం భారతరత్న అవార్డు ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ అన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాల్సిందిగా కోరుతూ శాసనసభ, మంత్రివర్గంలో తీర్మానం చేసి తానే స్వయంగా ప్రధానికి అందించనున్నట్లు సీఎం తెలిపారు. దివంగత మాజీ ప్రధాని పీవీ నరసింహారావు శతజయంతి వేడుకల నిర్వహణపై సీఎం కేసీఆర్‌ ప్రగతి భవన్‌లో మంగళవారం అత్యున్నతస్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎంపీ కేశవరావు నేతృత్వంలోని పీవీ శతజయంతి కమిటీ, అధికారులతో సీఎం చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ...

రాష్ట్ర శాసనసభలో పీవీ నరసింహారావు చిత్రపటాన్ని ఏర్పాటు చేస్తామన్నారు. ఇదేవిధంగా పార్లమెంట్‌లో సైతం పీవీ చిత్రపటం నెలకొల్పాలన్నారు. హైదరాబాద్‌లో పీవీ మెమోరియల్‌ ఏర్పాటుకు కేకే నేతృత్వంలో కమిటీ పనిచేయనున్నట్లు చెప్పారు. మెమోరియల్‌ ఏర్పాటుపై కేకే కమిటీ ప్రభుత్వానికి సూచనలు చేయాలన్నారు. హైదరాబాద్‌, వరంగల్‌, కరీంనగర్‌, వంగరలో పీవీ కాంస్య విగ్రహాలు ఏర్పాటు చేయనున్నట్లు సీఎం తెలిపారు. ఢిల్లీలోని తెలంగాణ భవన్‌లోనూ పీవీ కాంస్య విగ్రహన్ని ఏర్పాటు చేస్తామన్నారు. 

50 దేశాల్లో పీవీ శతజయంతి వేడుకలు...

పీవీ నరసింహారావు శతజయంతి వేడుకను ఈ 28న ప్రపంచవ్యాప్తంగా 50 దేశాల్లో నిర్వహించనునట్లు సీఎం తెలిపారు. బహుముఖ ప్రజ్ఞాశాలి, మాజీ ప్రధానమంత్రి పీవీ నరసింహారావు సేవలను గుర్తుంచుకునేలా, చిరస్మరణీయంగా నిలిచేలా శతజయంతి ఉత్సవాల నిర్వహణ చేపట్టాలన్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పక్షాన ఏడాది పోడవునా శతజయంతి ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు.

శతజయంతి ఉత్సవాల నిర్వహణకు తక్షణమే రూ.10 కోట్లు కేటాయిస్తున్నట్లు చెప్పారు. రాబోయే రోజుల్లో నిర్వహించే కార్యక్రమాలను బట్టి నిధులు విడుదల చేస్తామన్నారు. ఈ 28న హైదరాబాద్‌లోని పీవీ జ్ఞానభూమిలో కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ పీవీ శతజయంతి ఉత్సవాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా జరిగే వేడుకల నిర్వహణను మంత్రి కేటీఆర్‌ పర్యవేక్షించనున్నట్లు సీఎం తెలిపారు.


logo