శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
Telangana - Sep 09, 2020 , 04:02:18

పీవీకి భారతరత్న ఇవ్వాలి

పీవీకి భారతరత్న ఇవ్వాలి

  • తెలంగాణ ఔన్నత్యానికి అది గుర్తింపు
  • మరుగునపడిన వైతాళికులను గుర్తించి గౌరవించిన కేసీఆర్‌: మంత్రి కేటీఆర్‌  
  • సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన తీర్మానానికి మంత్రులు, ఎమ్మెల్యేల మద్దతు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ప్రస్తుతం భారతదేశం గ్లోబలైజేషన్‌.. ప్రైవేటైజేషన్‌.. లిబరలైజేషన్‌... అనే పదాలు వింటున్నదంటే.. అది మాజీ ప్రధాని వీపీ నరసింహారావు చలవేనని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. పీవీకి భారతరత్న ఇవ్వాలంటూ శాసనసభలో సీఎం కేసీఆర్‌ ప్రవేశపెట్టిన తీర్మానంపై జరిగిన చర్చలో మంత్రి కేటీఆర్‌ పాల్గొన్నారు. పీవీకి భారతరత్న ఇవ్వాలని సీఎం ప్రవేశపెట్టిన తీర్మానాన్ని బలపరుస్తున్నామని తెలిపారు. పీవీ స్థాయికి తగినట్లుగా, ఆయన అద్భుత పనితీరుకు తగినవిధంగా, తెలంగాణ ఔన్నత్యాన్ని గుర్తించేలా భారతరత్న ఇవ్వాలన్నారు. 

పీవీ ఒక్కరే కాదని, తెలంగాణకు సంబంధించిన ఎంతోమంది వైతాళికులు మరుగున పడిపోయారన్నారు. వారిని గుర్తించి, గౌరవించిన ఘనత సీఎం కేసీఆర్‌దేనని చెప్పారు. మఖ్దూం మొయినుద్దీన్‌, సేవాలాల్‌, దాశరథి కృష్ణమాచార్య, కాళోజీ, సర్దార్‌ పాపయ్య గౌడ్‌, ఈశ్వరీబాయి, భాగ్యరెడ్డివర్మ, సురవరం ప్రతాపరెడ్డి, దొడ్డి కొమురయ్య, పైడి జయరాజ్‌, చాకలి ఐలమ్మలాంటి ఎందరో మహానుభావుల స్ఫూర్తిని భవిష్యత్తు తరాల్లో నింపేందుకు వారి జయంతి, వర్ధంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నామన్నారు. పీవీ అద్భుతమైన వ్యక్తి అని, ఏ రంగంలో తనకు బాధ్యతలు అప్పగించినా ఆ రంగంలో సంస్కరణలు చేపట్టి ప్రజలకు ఎంతో మేలు చేశారని కొనియాడారు. భూ సంస్కరణలు మొదలుపెట్టి తన భూమిని పేదలకు పంచిన మహానుభావుడు పీవీ అని గుర్తుచేశారు. 73, 74 రాజ్యాంగ సవరణల ద్వారా స్థానిక ప్రభుత్వాలకు అధికారాలిచ్చి బలోపేతం చేశారన్నారు. ఓబీసీ రిజర్వేషన్లను సైతం పీవీనే తెచ్చారని తెలిపారు. దేశానికి పీవీ చేసిన సేవలు అంతర్జాతీయంగా, దేశంలోని జాతీయ రాజకీయ వ్యవస్థకు తెలిసేలా తెలంగాణ ప్రభుత్వం శత జయంతి ఉత్సవాలను నిర్వహిస్తుందని చెప్పారు. 


logo