గురువారం 28 జనవరి 2021
Telangana - Nov 26, 2020 , 15:16:21

బీజేపీకి చిత్తశుద్ది ఉంటే పీవీకి భారతరత్న ప్రకటించాలి : ఎమ్మెల్సీ కవిత

బీజేపీకి చిత్తశుద్ది ఉంటే పీవీకి భారతరత్న ప్రకటించాలి : ఎమ్మెల్సీ కవిత

హైద‌రాబాద్ : భార‌తీయ జ‌న‌తా పార్టీకి నిజంగా చిత్తశుద్ధి ఉంటే వెంటనే మాజీ ప్రధాని పీవీ నరసింహారావు భారతరత్న ప్రకటించాలని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. గ్రేట‌ర్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీనగర్‌లో ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ఎంపీ బండి సంజయ్ పీవీ సమాధి దగ్గర రాజకీయ డ్రామాలు చేస్తున్నారని విమర్శించారు. వరదసాయంపై రాష్ట్రం నివేదిక పంపలేదన్న కేంద్ర సహాయ మంత్రి కిషన్ రెడ్డి వాఖ్యలపై స్పందిస్తూ.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి నివేదిక పంపకుండానే వరద ప్ర‌భావిత ఆరు రాష్ట్రాలకు కేంద్ర హోంశాఖ రూ.4,700 కోట్ల తక్షణ సహాయం అందించిన విషయంపై కిషన్ రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. అంతేకాదు రోహింగ్యాల అంశంపై స్పందిస్తూ విదేశీయులు ఉంటే అది కేంద్ర ప్రభుత్వం వైఫల్యం తప్ప రాష్ట్ర ప్రభుత్వానిది కాదన్నారు. 

టీఆర్ఎస్ ప్రభుత్వం గత కొంతకాలంగా పీవీ శతజయంతి ఉత్సవాలను నిర్వహిస్తుంటే.. బీజేపీ, కాంగ్రెస్ నేతలు ఒక్క రోజు కూడా పీవీ గురించి మాట్లాడలేదన్నారు. కానీ ఇప్పుడు జీహెచ్ఎంసీ ఎన్నికలు రాగానే ఒక పార్టీ పీవీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తే, మరోపార్టీ దాన్ని తమ పార్టీకి అనుకూలంగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. పీవీ సమాధి దగ్గర ఎంపీ బండి సంజయ్ రాజకీయ డ్రామాలు చేస్తున్నారన్న కవిత, పీవీకి భారతరత్న ప్రకటించకుండా కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీని ఎవరు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ భారతరత్న ఇవ్వాలని చాలా కాలంగా డిమాండ్ ఉందన్నారు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న పార్టీలు ఇప్పటివరకు పట్టించుకోలేదన్నారు. పీవీ, ఎన్టీఆర్ లకు భారతరత్న  ప్రకటించకుండా జీహెచ్ఎంసీలో ఓట్లు అడిగే అర్హత బీజేపీకి లేదన్నారు. 

ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చింపేస్తున్న బీజేపీ నేతల విచిత్ర ప్రవర్తనను ప్రజలు గమనిస్తున్నారన్నారు. బీజేపీ ఎక్కడ ఎన్నికలు జరిగినా మత రాజకీయం తప్ప అభివ‌`ద్ధి గురించి మాట్లాడదన్నారు. దేశ జీడీపీ, డెవలప్ మెంట్ వంటి అంశాలపై స్పందించకుండా దేవుడు, మ‌తం పేరుతో రాజకీయాలు చేస్తుందని విమర్శించారు. కేవలం ఎన్నికల కోసం ఇష్టారీతిన మాట్లాడే పార్టీలను ప్రజలు నమ్మొద్ద‌న్నారు. నిరంతరం ప్రజల కోసమే పనిచేసే టీఆర్ఎస్ పార్టీకి ఓటెయ్యాలని ఆమె విజ్ఞప్తి చేశారు.


logo