గురువారం 06 ఆగస్టు 2020
Telangana - Jul 10, 2020 , 03:13:17

మూడు నెలల్లో టీకా!

మూడు నెలల్లో టీకా!

  • షార్ట్‌కట్‌లో దసరాకల్లా ఆవిష్కరణ?
  • కేంద్ర ప్రభుత్వం ముమ్మర కసరత్తు
  • మనుషులపై ప్రయోగాలు యథాతథం
  • అనుమతుల వేగం పెంచాలని నిర్ణయం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ:  దసరా నాటికి కరోనా వైరస్‌ వ్యాక్సిన్‌ను భారతదేశం ఆవిష్కరించనున్నదా? ‘షార్ట్‌కట్‌'లో మరో మూడు నెలల్లో టీకాను అందుబాటులోకి తేనున్నదా? అంటే.. అవుననే అంటున్నాయి కేంద్ర ప్రభుత్వవర్గాలు. టీకా తయారీలో ప్రయోగదశలకన్నా.. వాటిని రికార్డు చేయడం, అనుమతుల కోసం ఎదురుచూడటం వంటి పేపర్‌వర్క్‌ అధికంగా ఉంటుంది. ఈ పేపర్‌వర్క్‌ను తగ్గించడమే షార్ట్‌కట్‌గా పేర్కొంటున్నాయి. ప్రపంచ వ్యాక్సిన్‌ అవసరాల్లో 2/3 శాతం భారతే తీరుస్తున్నదని, కరోనా టీకాను అభివృద్ధి చేయడంలో, ప్రపంచవ్యాప్తంగా పంపిణీ చేయడంలో కూడా భారత్‌ కీలకపాత్ర పోషించబోతున్నదని ప్రధాని మోదీ గురువారం జరిగిన ‘గ్లోబల్‌ వీక్‌-2020’లో వ్యాఖ్యానించడం ఈ వాదనలకు ఊతమిస్తున్నది. 

హైదరాబాద్‌కు చెందిన భారత్‌ బయోటెక్‌ సంస్థ అభివృద్ధిచేసిన ‘కొవాగ్జిన్‌'ను ఆగస్టు 15 నాటికి అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేయాలని ఇటీవలే భారత వైద్య పరిశోధన మండలి (ఐసీఎమ్మార్‌) ఆదేశించిన సంగతి తెలిసిందే. గడువు పెట్టి వ్యాక్సిన్‌ తయారు చేయాలనడంపై పెద్దఎత్తున విమర్శలు వెల్లువెత్తాయి. దీంతో ఆగస్టు 15 కాకపోయినా దసరా నాటికి వ్యాక్సిన్‌ను ఆవిష్కరించాలని కేంద్రం లక్ష్యంగా పెట్టుకున్నట్టు తెలుస్తున్నది. ఇందుకోసం ప్రత్యేక వ్యూహం రూపొందించినట్టు విశ్వసనీయవర్గాల ద్వారా తెలిసింది. అయితే.. నిపుణులు మాత్రం ‘షార్ట్‌కట్‌' మంచిదికాదని చెప్తున్నారు. మనుషులపై ప్రయోగాలకు కనీసం 6-8 నెలల సమయం తీసుకోవాలని సూచిస్తున్నారు.

అనుమతుల వేగం పెంచి..

ప్రస్తుతం దేశంలో భారత్‌ బయోటెక్‌కు చెందిన ‘కొవాగ్జిన్‌', జైడస్‌ సంస్థ అభివృద్ధిచేసిన ‘జైకొవిడ్‌' వ్యాక్సిన్లు క్లినికల్‌ ట్రయల్స్‌ దశకు చేరుకున్నాయి. ఇందులో అందరి దృష్టీ కొవాగ్జిన్‌పైనే ఉన్నది. సాధారణంగా ఫేజ్‌-1, ఫేజ్‌-2 క్లినికల్‌ ట్రయల్స్‌ పూర్తికావడానికి కనీసం రెండు నుంచి మూడు నెలల సమయం పడుతుంది. ఫేజ్‌-3కి 6 నెలల నుంచి కొన్నేండ్లు పట్టవచ్చని అంటున్నారు. అయితే ఇందులో ప్రయోగదశలకన్నా.. వాటిని రికార్డు చేయడం, పై అధికారులకు పంపడం, అనుమతుల కోసం ఎదురుచూడటం.. ఇలా పేపర్‌వర్క్‌ ఎక్కువగా ఉంటుంది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వ్యాక్సిన్‌ను త్వరగా అందుబాటులోకి తెచ్చేందుకు కేంద్రం ‘పేపర్‌వర్క్‌'ను తగ్గించాలని నిర్ణయించినట్టు సమాచారం. వెంట వెంటనే అనుమతులు ఇస్తే.. కనీసం 2-3 నెలల సమయం తగ్గుతుందని భావిస్తున్నది. తద్వారా మూడు నెలల్లోనే వ్యాక్సిన్‌ అందుబాటులోకి తేవొచ్చని యోచిస్తున్నట్టు సమాచారం. అయితే దీనిని కేంద్ర ప్రభుత్వం, ఐసీఎమ్మార్‌, భారత్‌ బయోటెక్‌ వర్గాలు అధికారికంగా ధ్రువీకరించడం లేదు.


మరో ఆరు నెలల్లో సురక్షిత టీకా: సీరమ్‌ 

మరో ఆరునెలల్లో సురక్షిత కరోనా టీకా అందుబాటులోకి వస్తుందని పుణెలోని సీరం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా తెలిపింది. ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ అభివృద్ధిచేస్తున్న వ్యాక్సిన్‌ తయారీలో సీరమ్‌ పాలుపంచుకుంటున్న సంగతి తెలిసిందే. ఇటీవల సంస్థ సీఈవో మాట్లాడుతూ.. ‘మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ ఫలితాల కోసం ఎదురుచూస్తున్నాం. భారత్‌తోపాటు ప్రపంచానికి మరో ఆరునెలల్లో సురక్షిత టీకాను అందుబాటులోకి తెస్తాం’ అని పేర్కొన్నారు. అదే సమయంలో తాము ఈ విషయంలో ఏమాత్రం తొందరపడబోమంటూ పరోక్షంగా ఐసీఎంఆర్‌ ప్రకటనను తప్పుబట్టారు.

తొందరపాటు మంచిది కాదు: సీసీఎంబీ

తక్కువ సమయంలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తేవాలనుకోవడం మంచిదికాదని సీసీఎంబీ డైరెక్టర్‌ రాకేశ్‌మిశ్రా పేర్కొన్నారు. టీకా తయారీకి తగిన సమయం అవసరమని, దీనిని తగ్గించలేమని చెప్పారు. మరో 3నెలల్లో వ్యాక్సిన్‌ కష్టమేనని స్పష్టంచేశారు. దేశంలో వ్యాక్సిన్‌ ప్రయోగాలు ఫేజ్‌-1 దశలోనే ఉన్నాయని, ఫేజ్‌-2, ఫేజ్‌-3 దశలు పూర్తవడానికి కనీసం కొన్ని నెలల సమయం పడుతుందని చెప్పారు. కొన్నిసార్లు వ్యాక్సిన్‌ ప్రయోగాలతో దీర్ఘకాలంలో సైడ్‌ ఎఫెక్ట్స్‌ వస్తాయని, షార్ట్‌కట్‌లతోవాటిని గుర్తించలేమన్నారు.  

క్లినికల్‌ ట్రయల్స్‌లో రాజీలేదు 

భద్రత, రక్షణ ప్రమాణాల విషయంలో రాజీపడకుండా క్లినికల్‌ ట్రయల్స్‌ కొనసాగుతాయని కేంద్ర ఆరోగ్యశాఖ ప్రత్యేక అధికారి రాజేశ్‌ భూషణ్‌ గురువారం చెప్పారు. ఆగస్టు 15 డెడ్‌లైన్‌ గురించి ఆయన వివరణ ఇస్తూ.. కేవలం క్లినికల్‌ ట్రయల్స్‌ను వేగవంతం చేయడం కోసమే ఐసీఎంఆర్‌ డైరెక్టర్‌ జనరల్‌ ఆ లేఖ రాశారని చెప్పారు. 

అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారమే.. 

కొవాగ్జిన్‌ను ఆగస్టు 15లోగా అందుబాటులోకి తేవాలంటూ ఐసీఎంఆర్‌ ఈ నెల 2న భాగస్వామ్య సంస్థలకు లేఖలు రాసిన సంగతి తెలిసిందే. దీనిపై పెద్దఎత్తున విమర్శలు చెలరేగడంతో సంస్థ స్పందించింది. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారమే క్లినికల్‌ ట్రయల్స్‌ జరుగుతాయని వివరణ ఇచ్చింది. అకారణంగా జరుగుతున్న ఆలస్యాన్ని (రెడ్‌ టేపిజం) తగ్గించి, త్వరగా వ్యాక్సిన్‌ను తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొన్నది. 


logo