సోమవారం 30 నవంబర్ 2020
Telangana - Nov 16, 2020 , 20:33:06

కరోనాకు నాజల్‌ డ్రాప్స్ వ్యాక్సిన్‌: భారత్‌ బయోటెక్‌

కరోనాకు నాజల్‌ డ్రాప్స్ వ్యాక్సిన్‌: భారత్‌ బయోటెక్‌

హైదరాబాద్‌: కరోనా వైరస్‌ను ఎదుర్కొనేందుకు నాజల్‌ డ్రాప్స్‌ (ముక్కులో వేసుకునే చుక్కల మందు)పైన భారత్‌ బయోటెక్‌ ప్రయోగాలు చేస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఎండీ డాక్టర్‌ కృష్ణా ఎల్లా వెల్లడించారు. హైదరాబాద్‌లోని ఇండియన్‌ స్కూల్‌ ఆఫ్‌ బిజినెస్‌ (ఐఎస్‌బీ) ఆధర్యంలో నిర్వహించిన దక్కన్‌ డైలాగ్‌ వర్చువల్‌ కార్యక్రమంలో ఆయన పాల్గొని, మాట్లాడారు. ప్రస్తుతం తాము కొవాగ్జిన్‌పై మూడో విడుత క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది డబుల్‌ డోస్‌ ఇంజెక్టబుల్‌ టీకా అని పేర్కొన్నారు. దీన్ని దేశంలో అందరికీ అందించాలంటే 260 కోట్ల సిరంజీలు, సూదులు అవసరమవుతాయని తెలిపారు. ఇది చాలా కష్టంతో కూడుకున్నదని ఆయన వెల్లడించారు. అందుకే తాము దీనికి ప్రత్యామ్నాయంగా నాజల్‌ డ్రాప్స్‌ అభివృద్ధిపై దృష్టిపెట్టామని పేర్కొన్నారు. 

ప్రపంచంలో బీఎస్‌ఎల్‌-3 ఉత్పత్తి కేంద్రం ఉన్న ఏకైక సంస్థ తమదేనని చెప్పుకునేందుకు గర్వపడుతున్నానని కృష్ణా ఎల్లా తెలిపారు. కరోనా మహమ్మారి చాలా ప్రమాదకరంగా మారుతుందని ముందే ఊహించి ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఇప్పుడు చైనా 250 మిలియన్‌ డాలర్లతో ఏర్పాటు చేస్తోందని, అమెరికా, ఐరోపాలోనూ ఈ బీఎస్‌ఎల్‌-3 ఉత్పత్తి కేంద్రం లేదన్నారు. కొవాగ్జిన్‌ టీకా కోసం ఐసీఎంఆర్‌తో తాము భాగస్వామ్యమయ్యామని తెలిపారు. ప్రస్తుతం దీనిపై మూడో దశ క్లినికల్‌ ట్రయల్స్‌ నడుస్తున్నాయని పేర్కొన్నారు. కానీ తాను దీనిపై సంతోషంగా లేనన్నారు.  అందుకే నాజల్‌ డ్రాప్‌ తయారీపై దృష్టిపెట్టినట్లు చెప్పారు. ఇది ముక్కులో ఒక్కసారి వేస్తే సరిపోయే చుక్కల మందు అని వివరించారు. గతంలో రోటా వైరస్‌, పోలియో కోసం చుక్కల మందులు తయారుచేసిన అనుభవం తమకుందని పేర్కొన్నారు. వచ్చే ఏడాదిలో ఇది అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నట్లు తెలిపారు. 

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.