బుధవారం 28 అక్టోబర్ 2020
Telangana - Oct 08, 2020 , 02:03:39

భాగ్యనగరం దేశంలోనే టాప్‌

భాగ్యనగరం దేశంలోనే టాప్‌

  • సీసీ కెమెరాల నిర్వహణలోప్రపంచ నగరాల్లో 16వ స్థానం
  •  465 మంది కానిస్టేబుల్స్‌ దీక్షాంత్‌ పరేడ్‌లో హోంమంత్రి
  • రాష్ట్రంలోని 28 కేంద్రాల్లో 10 వేల మందికి శిక్షణ 
  • వారికి రెండురోజుల్లో ముగియనున్న ట్రైనింగ్‌: డీజీపీ 

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: ఇంగ్లండ్‌కు చెందిన ఓ సంస్థ 150 దేశాల్లో సీసీ కెమెరాలపై నిర్వహించిన సర్వేలో హైదరాబాద్‌ మహానగరం దేశంలోనే మొదటి స్థానంలో నిలిచిందని, ప్రపంచ నగరాల్లో 16వ స్థానంలో ఉన్నదని హోం మంత్రి మహమూద్‌ అలీ తెలిపారు. సీఎం కేసీఆర్‌ పోలీసుశాఖపై ప్రత్యేక శ్రద్ధ పెడుతూ నిధులు విడుదల చేస్తుండటంతోనే ఇది సాధ్యమైందన్నారు. హైదరాబాద్‌లోని రెండు ట్రైనింగ్‌ సెంటర్లలో 465 మంది కానిస్టేబుళ్లు శిక్షణ పూర్తిచేసుకున్నారు. వీరికి బుధవారం పేట్లబురుజులోని సిటీ ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌ శిక్షణ కేంద్రంలో దీక్షాంత్‌ పరేడ్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా మహమూద్‌ అలీ మాట్లాడుతూ.. వేల కోట్ల నిధులను సీఎం పోలీసుశాఖకు కేటాయించారని చెప్పారు. కొత్తగా ఏడు కమిషనరేట్లను ఏర్పాటు చేశామన్నారు. పెట్రోలింగ్‌కు సరికొత్త వాహనాలు ఇచ్చి, పోలీసుశాఖకు కొత్తరూపు తెచ్చారని కొనియాడారు. శిక్షణ పూర్తిచేసుకున్న వారు తమ వృత్తి పట్ల నిబద్ధతతో ఉంటూ పోలీసుశాఖకు, రాష్ర్టానికి మంచిపేరు తేవాలని ఆకాంక్షించారు. డీజీపీ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 28 పోలీసు ట్రైనింగ్‌ సెంటర్లలో 10 వేల మంది శిక్షణ పొందుతున్నారని, రెండ్రోజుల్లో వారి శిక్షణ పూర్తవుతుందని వివరించారు. పోలీసుశాఖలో ఎక్కడికి వెళ్లినా ఒకేరకం సేవలు అందుబాటులో ఉండాలని, ప్ర జల భద్రతే లక్ష్యంగా పనిచేయాలని సూచించారు. కార్యక్రమం లో నగర పోలీస్‌ కమిషనర్‌ అంజనీకుమార్‌, అదనపు డీజీపీ కొత్తకోట శ్రీనివాస్‌రెడ్డి, నగర అదనపు సీపీలు శిఖా గోయెల్‌, డీఎస్‌ చౌహాన్‌, అనిల్‌కుమార్‌, తదితరులు పాల్గొన్నారు.

ప్రతిష్ఠ మరింత పెంచాలి: స్వాతిలక్రా

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: దేశంలో ఎంతో గొప్ప పేరున్న తెలంగాణ పోలీస్‌శాఖ ప్రతిష్ఠను మరింత పెంచేలా సర్వీస్‌లో కృషిచేయాలని కొత్త కానిస్టేబుళ్లకు రాష్ట్ర మహిళా భద్రతా విభాగం ఇంచార్జి, ఏడీజీ స్వాతిలక్రా పిలుపునిచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా శిక్షణ పూర్తిచేసుకున్న 10 వేలమంది పోలీస్‌ కానిస్టేబుళ్లు 28 ట్రైనింగ్‌ సెంటర్ల నుంచి పాసింగ్‌ఔట్‌ పరేడ్‌లో పాల్గొంటున్నారు. వీరిలో కొందరు బుధవారం పాసింగ్‌ఔట్‌ పూర్తిచేయగా, మరికొందరు గురువారం చేయనున్నారు. బుధవారం తెలంగాణ రాష్ట్ర పోలీస్‌ అకాడమీలో 637 మంది మహిళా కానిస్టేబుళ్ల (ఆర్మ్‌డ్‌ రిజర్వ్‌) దీక్షాంత్‌ పరేడ్‌లో స్వాతిలక్రా పాల్గొన్నారు. పోలీస్‌శాఖలో మహిళా సిబ్బంది సంఖ్య పెరుగడం శుభపరిణామమని చెప్పారు. 


logo