శనివారం 11 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 03:32:15

భద్రాద్రిలో తొలి విద్యుత్‌ యూనిట్‌ సక్సెస్‌

భద్రాద్రిలో తొలి విద్యుత్‌ యూనిట్‌ సక్సెస్‌

  • 72 గంటల్లో 271 మెగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి

మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్న థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం (బీటీపీఎస్‌)లో తొలి యూనిట్‌ కమర్షియల్‌ ఆపరేషన్‌ డిక్లరేషన్‌ (సీవోడీ) విజయవంతంగా పూర్తయ్యింది. మణుగూరులోని పినపాక సరిహద్దులో 1080 (4x270) మెగావాట్ల సామర్థ్యంతో ప్రభుత్వం భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం(బీటీపీఎస్‌)ను నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఈ విద్యుత్‌ కేంద్రంలో శుక్రవారం విద్యుత్‌ ఇంజినీర్లు, భెల్‌ (భారత్‌ హెవీ ఎలక్ట్రికల్స్‌ లిమిటెడ్‌) అధికారులు మొదటి యూనిట్‌లో సీవోడీ ప్రక్రియను పూర్తిచేశారు. బీటీపీఎస్‌ పరిధిలో 4x 270 సామర్థ్యంతో నాలుగు యూనిట్లు నిర్మిస్తున్నారు. సీవోడీ ప్రక్రియ ఈ నెల 2 తేదీ ఉదయం 6 గంటలకు మొదలై 5వ తేదీ(శుక్రవారం) ఉదయం 6 గంటల వరకు నిరంతరాయంగా 72 గంటలపాటు కొనసాగింది. 

ఈ సందర్భంగా ఆ యూనిట్‌ 271.61 మోగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసింది. ఈ విద్యుత్తును అధికారులు రాష్ట్ర గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఇందుకు అవసరమైన అగ్రిమెంట్‌ పత్రాలను టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌, ఎస్పీడీసీఎల్‌ అధికారులు బీటీపీఎస్‌ సీఈ బాలరాజు, జెన్‌కో అధికారులకు అందజేశారు. జెన్‌కో, ట్రాన్స్‌కో సీఎండీ డీ ప్రభాకర్‌రావు హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ ప్రక్రియను పర్యవేక్షించారు. బీటీపీఎస్‌, భెల్‌ అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇక రాష్ట్ర అవసరాలకు బీటీపీఎస్‌ విద్యుత్‌ను వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఇదే స్ఫూర్తితో 2, 3, 4 యూనిట్లలో కూడా సింక్రనైజేషన్‌ పూర్తిచేసి సీవోడీకి సిద్ధంచేయాలని సూచించారు. కార్యక్రమంలో టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ (డైరెక్టర్‌) పీ గణపతి, బీటీపీఎస్‌ సీఈ పిల్లి బాలరాజు, సీజీఎం(టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌) మధుసూదన్‌, సీజీఎం (ఎస్పీ డీసీఎల్‌) పీ ఆనంద్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఎం శ్రీనివాసరావు, సీఈలు టీఎస్‌ఎన్‌ మూర్తి, పీవీ శ్రీనివాసరావు, భెల్‌ జనరల్‌ మేనేజర్‌ ఆగర్వాల్‌, ఎస్‌ఈలు, డీఈలు, ఏడీలు, ఏఈలు పాల్గొన్నారు.


logo