ఆదివారం 05 జూలై 2020
Telangana - Jun 05, 2020 , 21:18:48

రాష్ట్ర అవసరాలకు భద్రాద్రి ప్లాంటు విద్యుత్‌

రాష్ట్ర అవసరాలకు భద్రాద్రి ప్లాంటు విద్యుత్‌

మణుగూరు: భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరు, పినపాక సరిహద్దు ప్రాంతంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న 1080(4x270) మెగావాట్ల సామర్థ్యం గల భద్రాద్రి థర్మల్‌ విద్యుత్‌ కేంద్రం(బీటీపీఎస్‌)లో ఇంజినీర్లు, భేల్‌ (భారత్‌ హెవీ ఎలక్ట్రికల్‌ లిమిటెడ్‌) అధికారులు యూనిట్‌-1లో సీవోడీ (కమర్షియల్‌ ఆపరేషన్‌ డిక్లరేషన్‌) ప్రక్రియను విజయవంతంగా పూర్తి చేశారు. బీటీపీఎస్‌ పరిధిలో మొత్తం నాలుగు యూనిట్లు నిర్మిస్తుండగా ప్రస్తుతం ఒకటో యూనిట్‌లో ఈ ప్రక్రియ పూర్తయ్యింది. సీవోడీ ప్రక్రియ ఈ నెల 2 తేదీ ఉదయం 6 గంటల నుంచి ఈ రోజు ఉదయం 6 గంటల వరకు నిరంతరాయంగా 72 గంటలు వరకు కొనసాగి యూనిట్‌ పరిధిలో 271.61 మోగావాట్ల విద్యుత్‌ ఉత్పత్తి నమోదైంది. ఈ విద్యుత్తును అధికారులు రాష్ట్ర గ్రిడ్‌కు అనుసంధానం చేశారు. ఇందుకు అవసరమైన అగ్రిమెంట్‌ ప్రతాలను టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌, ఎస్పీడీసీఎల్‌ అధికారులు బీటీపీఎస్‌ సీఈ బాలరాజు, జెన్కో అధికారులకు అందజేశారు. ఈ సందర్భంగా జెన్‌కో అండ్‌ ట్రాన్స్‌కో సీఎండీ డి.ప్రభాకర్‌రావు హైదరాబాద్‌ నుంచి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రక్రియను పర్యవేక్షించారు. సీవోడీని విజయవంతంగా పూర్తి చేసిన బీటీపీఎస్‌, భేల్‌ అధికారులకు ప్రత్యేక అభినందనలు తెలిపారు. ఇక రాష్ట్ర అవసరాలకు బీటీపీఎస్‌ విద్యుత్‌ వినియోగిస్తున్నట్లు చెప్పారు. ఇదే స్ఫూర్తితో 2,3,4 యూనిట్లలో సింక్రనైజేషన్‌ పూర్తి చేసి సీవోడీకి సిద్ధం చేయాలని సూచించారు. కార్యక్రమంలో  టీఎస్‌ ఎస్పీడీసీఎల్‌ (డైరెక్టర్‌) పి.గణపతి, బీటీపీఎస్‌ సీఈ పిల్లి బాలరాజు, సీజీఎం(టీఎస్‌ ఎన్పీడీసీఎల్‌) మధుసూదన్‌, సీజీఎం (ఎస్పీ డీసీఎల్‌) పి,ఆనంద్‌, ట్రాన్స్‌కో ఎస్‌ఈ ఎం. శ్రీనివాసరావు, సీఈలు టీఎస్‌ఎన్‌ మూర్తి, పీవీ శ్రీనివాపరావు, భేల్‌ జీఎం ఆగర్వాల్‌, ఎస్‌ఈలు, డీఈలు, ఏడీలు, ఏఈలు పాల్గొన్నారు.logo