గురువారం 02 ఏప్రిల్ 2020
Telangana - Mar 20, 2020 , 10:25:25

భక్తులకు అండ.. భద్రుని కొండ..

భక్తులకు అండ.. భద్రుని కొండ..

భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామచంద్రస్వామి ఆలయంలో భద్రుని కోవెలకు చాలా విశిష్టత ఉంది. భద్ర మహర్షి తపస్సు చేసిన చోటు ఇదేనని చెబుతారు. భద్ర మహర్షి శ్రీరాముని అనుగ్రహంతో ఒక కొండగా మారగా, ఆ కొండ శిఖరభాగంపై శ్రీరాముడు తన పాదముద్రను ఉంచిన పవిత్ర ప్రదేశం కూడా ఇదేనని పురాణాలు చెబుతున్నాయి. ఇక్కడ రాములవారు భద్రుని శిరస్సుపై పాదాలు మోపిన భాగాన్ని శిరస్థానమని, స్వామి ఉన్నది హృదయ స్థానమని, రాజగోపురం (గాలిగోపురం) పాద స్థానమని భక్తులు విశ్వసిస్తారు. ఏనాటి వరమో కానీ ప్రస్తుతం ఆ భద్రుని శిరస్సు, రాములవారి పాదాలకే భక్తులు అభిషేకం చేస్తున్నారు. 

దండకారణ్యంలో పర్యటిస్తున్న శ్రీరాముడు భద్రుని కోరిక మేరకు దర్శనమిచ్చాడని బ్రహ్మ పురాణం చెబుతున్నది. వైకుంఠ రాముడు రావణవధ అనంతరం వైకుంఠానికి చేరినట్లు పురాణాల ద్వారా తెలుస్తున్నది. పోతన భాగవతంలో ‘సిరికిన్‌ చెప్పడు’ అన్న విధంగా శ్రీరాముడు భద్రుని తపస్సు ఫలితంగా బయలుదేరి శంఖుచక్రాలతో వైకుంఠం నుంచి వచ్చినట్లుగా పేర్కొంటారు. అందుకే వైకుంఠరామునిగా, శంఖుచక్రాలతో నారాయణునిగా, ధనుర్భాణాలతో శ్రీరామునిగా వెరసి శ్రీమన్నారాయణుడిగా భద్రాద్రి రాముడు కీర్తనందుకున్నాడు. 

ఇదే విషయాన్ని భక్తరామదాసు కూడా ‘యుత జానకీ రమణ చిన్మయ రూపమేష రామనారాయణ..’అంటూ కీర్తించాడు. భక్తులు స్వామివారిని దర్శించేటప్పుడు నిశిత దృష్టితో పరిశీలిస్తే తప్ప, పూర్తి రామదర్శనం కాదు. శ్రీమహావిష్ణువు రామునిగా, లక్ష్మీదేవి సీతగా, శేషుడు లక్ష్మణునిగా, శంఖుచక్రాలు భరత, శత్రఘ్నులుగా కనిపిస్తాయి. ఇక్కడ ‘వామం కస్తిత జానకి’ అనే పద్యరీత్యా స్వామి పద్మాసనంగా, అమ్మవారు ఎడమ తొడ మీద కూర్చొని, లక్ష్మణుడు నిల్చొని దర్శనమిస్తారు. ఆలయంలోని పూజారులు పెద్ద కిరీటం ధరించిన వారు రాములవారని, చిన్న కిరీటం ధరించిన వారు సీతమ్మగా, నిల్చున్న స్వామిని లక్ష్మణునిగా వివరిస్తూ దర్శనం చేయిస్తారు. 


logo
>>>>>>