శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Mar 30, 2020 , 01:18:22

హోం క్వారంటైన్‌ వ్యర్థాలతో జాగ్రత్త

హోం క్వారంటైన్‌ వ్యర్థాలతో జాగ్రత్త

  • ఆ ఇండ్ల చెత్తను పూర్తిగా దహనంచేయండి
  • మున్సిపల్‌ కమిషనర్లకు పురపాలకశాఖ ఆదేశం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: క్వారంటైన్‌ గృహాల నుంచి సేకరించే చెత్తను పూర్తిగా కాల్చడం లేదా పూడ్చడం చేయాలని పురపాలకశాఖ ఆయా మున్సిపాలిటీలను ఆదేశించింది. ఈ విషయంలో ఎవరైనా అజాగ్రత్తగా ఉంటే కఠిన చర్యలుంటాయని ఆ శాఖ డైరెక్టర్‌ డాక్టర్‌ ఎన్‌ సత్యనారాయణ మున్సిపల్‌ కమిషనర్లను హెచ్చరించారు. ప్రతి ఇంటా వ్యర్థాలతోపాటు సేకరించే మాస్కులు, గ్లవ్స్‌ ప్రమాదకరమైనవిగా భావించాలని తెలిపారు. ప్రజలు వీటిని పేపర్‌లో చుట్టి ఇవ్వాలని కోరారు. వీటిని సాధారణ చెత్తతో కలుపకూడదని కోరారు. క్వారంటైన్‌ ఇండ్లకు ప్రత్యేకంగా అందజేస్తున్న పసుపు పచ్చరంగు సంచుల్లోనే తడి, పొడి చెత్తను వేసేలా చూడాలని సిబ్బందికి సూచించారు. 

మున్సిపాలిటీలు ఈ చెత్తను బయో మెడికల్‌ వ్యర్థాలుగా పరిగణించాలని ఆ శాఖ డైరెక్టర్‌ ఆదేశించారు. ఇతర గృహాల నుంచి సేకరించే వ్యర్థాలతో వీటిని కలుపకూడదని, ఇందుకోసం ప్రత్యేక వాహనాలను వినియోగిస్తే ఉత్తమమని తెలిపారు. క్వారంటైన్‌ గృహాల వద్ద పనిచేసే ము న్సిపల్‌ సిబ్బంది తగు జాగ్రత్తలు పాటించాల న్నారు. మాస్కులు, శానిటైజర్ల వాడకం పెరిగిందని, పట్టణాల్లో స్వయం సహాయ బృందాలు మాస్కులు, శానిటైజర్ల తయారీపై దృష్టి సారించేలా చూడాలని కమిషనర్లకు చెప్పారు. అవసరమైతే వీటిని మున్సిపాలిటీయే కొనుగోలు చేయాలని ఆదేశించారు. కాగా, పట్టణాల్లోని బహిరంగ ప్రదేశాల శానిటైజేషన్‌పై కమిషనర్లు దృష్టిపెట్టారు. వాణిజ్య సముదాయాలు, పార్కులు, గార్డెన్లు ఉన్న ప్రాంతాలను శుభ్రం చేయిస్తున్నారు.


logo