శుక్రవారం 14 ఆగస్టు 2020
Telangana - Jul 27, 2020 , 01:56:51

హ్యాకర్లున్నారు జాగ్రత్త!

హ్యాకర్లున్నారు జాగ్రత్త!

  • చిన్నపాటి జాగ్రత్తలతో బయటపడొచ్చు 
  • సైబర్‌ నిపుణుల సూచనలు

మీరు సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉన్నారా..? ఈ మెయిల్‌, ఫేస్‌బుక్‌, ట్విట్టర్‌, ఇన్‌స్టాగ్రాం, వాట్సాప్‌ అకౌంట్లు మీకున్నాయా..? అయితే జరభద్రం. హ్యాకర్లు మిమ్మల్ని నీడలా వెంటాడుతున్నారు. సోషల్‌ మీడియా అకౌంట్లన్నింటికీ ఆధారం మీ జీమెయిల్‌ ఐడీ.. పాస్‌వర్డ్‌! దానిని దొంగిలించి ఇబ్బందుల పాలు చేస్తారు తస్మాత్‌ జాగ్రత్త.. చిన్నపాటి జాగ్రత్తలు తీసుకుంటే హ్యాకర్ల బారినపడకుండా రక్షించుకోవచ్చని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు చెప్తున్నారు.  

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: హ్యాకర్ల బారిన పడకుండా ఉండేందుకు జీమెయిల్‌, సోషల్‌ మీడియాలో చాలా అప్రమత్తంగా వ్యవహరించాలని సైబర్‌ సెక్యూరిటీ నిపుణులు సూచిస్తున్నారు. లేకుంటే ప్రమాదంలో పడే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండడమే శ్రీరామరక్ష అని పేర్కొంటున్నారు. 

రెండంచెల వెరిఫికేషన్‌ బెస్ట్‌

ఈ రోజుల్లో కేవలం ఓ క్లిష్టమైన పాస్‌వర్డ్‌ పెట్టుకుంటే మన సోషల్‌ మీడియా, ఈ మెయిల్‌ అకౌంట్లు సురక్షితమనుకుంటే పప్పులో కాలేసినట్టే! ప్రస్తుతం రెండంచెల వెరిఫికేషన్‌(టూ స్టెప్‌ వెరిఫికేషన్‌) తప్పనిసరి. మీ జీమెయిల్‌ అకౌంట్‌లో సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. దానిలో గూగుల్‌ అని వస్తుంది. దానిపై క్లిక్‌ చేస్తే మేనేజ్‌ యువర్‌ గూగుల్‌ అకౌంట్‌ వస్తుంది. దీనిపై మరలా క్లిక్‌ చేసి సెక్యూరిటీ అనే ఆప్షన్‌ను నొక్కాలి. అందులో టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ ఆప్షన్‌ ఆన్‌లో పెట్టుకోవాలి.. ఎవరైనా హ్యాకర్‌కు మన జీ మెయిల్‌ పాస్‌వర్డ్‌ తెలిసినా మన అకౌంట్‌ను హ్యాక్‌ చేసేందుకు ప్రయత్నించినా వెంటనే మన రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు వెంటనే ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీ ఎంటర్‌ చేస్తేనే వారు ముందుకు వెళ్లగలుగుతారు. లేదంటే వాళ్ల ఆటలు సాగవు.  

యాపిల్‌ ఫోన్‌ అయితే!

మీ ఫోన్‌ను ఓపెన్‌ చేసి యాపిల్‌ ఐడీలోకి వెళ్లండి. పాస్‌వర్డ్‌ అండ్‌ సెక్యూరిటీ వస్తుంది. దానిలో టు ఫ్యాక్టర్‌ ఐడెంటిపికేషన్‌ ఆన్‌చేసి, మీ ఫోన్‌ నంబర్‌ ఎంటర్‌ చేయాలి. ఇకపై ఏ మార్పులు జరిగినా, హ్యాక్‌ చేసినా మీ రిజిస్టర్‌ మొబైల్‌ నంబర్‌కు తెలుస్తుంది. 

ఫేస్‌బుక్‌లో ఇలా.. 

ఫేస్‌బుక్‌ సెట్టింగ్స్‌లో టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌ ఆన్‌లో పెట్టుకోవాలి. ప్రైవసీ అనేది కూడా చాలా ముఖ్యం. ఏ యాప్‌ డౌన్‌లోడ్‌ చేసినా సరే మనకు సంబంధించిన సమాచారం మనమే ఇస్తుంటాం. ఆ పొరపాటు ఎట్టిపరిస్థితిలో చేయవద్దు. ఉదాహరణకు ఫేస్‌బుక్‌లో మీరు చేరిన తర్వాత అందులో ముందే కొన్ని ఆప్షన్లు అడుగుతుంది. మీరు అందులో ఎవ్రీవన్‌ అనే ఆప్షన్‌ పెడితే అపరిచిత వ్యక్తులు మీకు రిక్వెస్ట్‌లు పంపుతారు. అందుకే అది డిసేబుల్‌ చేయాలి. మీ పోస్టులు ఎవరెవరు చూడవచ్చు..?మీకు పోస్టులు ఎవరు ట్యాగ్‌ చేయాలి?.అన్న చోట మన అనుమతి లేకుండా చేయవద్దన్న ఆప్షన్‌ ఇవ్వాలి. సెక్యూరిటీ లాగిన్‌లోకి వెళితే మీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ను ఎవరెవరు వాడుతున్నారో చూపుతుంది. అందులో మీకు తెలియని డివైజ్‌లు ఉంటే మీ అకౌంట్‌ హ్యాక్‌ అయినట్టు గుర్తించాలి. లాగ్‌ఔట్‌ అయ్యి పాస్‌వర్డ్‌ మార్చుకుని రీ లాగిన్‌ కావాలి. ఒకవేళ మీ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ హ్యాక్‌ అయినట్లయితే facebook.com/hacked  లో సమాచారం ఇస్తే మళ్లీ ఆ అకౌంట్‌ను పొందవచ్చు. 

ఇన్‌స్టాగ్రాంలో? 

ఇన్‌స్టాగ్రాంలోనూ టూ ఫ్యాక్టర్‌ అథెంటికేషన్‌లోకి వెళ్లి దానిలో కామెంట్‌ కంట్రోల్‌ ఆప్షన్‌ ఉంటుంది. దానిలో అసభ్యకరమైన వ్యాఖ్యలను హైడ్‌ చేసే ఆప్షన్‌ ఆన్‌లో పెట్టుకోవాలి. ఇన్‌స్టాగ్రాం హ్యాక్‌ అయితే help.instagram.com లో ఫిర్యాదు చేయాలి. 

వాట్సప్‌లో 

సెట్టింగ్స్‌లో ప్రైవసీ ఆప్షన్‌లోకి వెళ్లి అక్కడ టూ స్టెప్‌ వెరిఫికేషన్‌ను ఎనేబుల్‌ చేస్తే హ్యాకర్ల బెడద ఉండదు. మీ వాట్సప్‌కోడ్‌ ఎట్టిపరిస్థితిలోనూ ఎవరికీ ఇవ్వవద్దని సైబర్‌ నిపుణులు సూచిస్తున్నారు. అదేవిధంగా మీరు మీ ల్యాప్‌టాప్‌లో వాట్సప్‌వెబ్‌ వాడుతున్నట్టయితే వాట్సప్‌వెబ్‌లో కింద ‘ఎప్పటికీ లాగిన్‌' అనే ఆప్షన్‌ ఆన్‌లో పెట్టవద్దు. మీ పని అయిపోగానే లాగ్‌అవుట్‌ చేయాలి. గ్రూప్స్‌ అనేచోట కూడా కేవలం మై కాంటాక్ట్స్‌ అని మాత్రమే పెట్టుకుంటే అపరిచిత వ్యక్తులు మిమ్మల్ని మీకు తెలియని గ్రూప్స్‌లో యాడ్‌ చేయకుండా ఉంటారు.  

ఇవి గుర్తుంచుకోండి..

ఏ యాప్స్‌ను అయినా డౌన్‌లోడ్‌ చేసుకున్నప్పుడు అందులో అడిగే పర్మిషన్లపై కన్నేసి ఉంచాలి. చాలా వరకు గేమింగ్‌ యాప్స్‌కూడా క్యాలెండర్‌, కెమెరా, కాంటాక్ట్స్‌, లొకేషన్‌, మైక్రోఫోన్‌, ఫోన్‌, స్టోరేజ్‌ ఇలా అనేక ఆప్షన్లలో పర్మిషన్‌ కోరుతుంది. కానీ ఏదీకూడా పర్మిషన్‌ ఇవ్వవద్దు. అత్యంత అవసరం అయిన వాటిని మాత్రమే ఎనేబుల్‌ చేయాలి. బ్రౌజర్‌లో మీ పాస్‌వర్డ్‌లు సేవ్‌ చేయవద్దు. మీ ఆల్టర్‌నేట్‌ ఈ మెయిల్‌, రికవరీ ఫోన్‌ నంబర్లు జాగ్రత్తగా గుర్తు పెట్టుకోవాలి. 


logo