మంగళవారం 26 జనవరి 2021
Telangana - Jan 07, 2021 , 01:39:07

ముసుగులో దోచేస్తారు

ముసుగులో దోచేస్తారు

  • నకిలీ అధికారులు వస్తున్నారు జాగ్రత్త
  • బోయిన్‌పల్లి కిడ్నాప్‌తో మరోసారి కలకలం
  • అనుమానం వస్తే 100కు ఫిర్యాదు చేయండి

‘వీ ఆర్‌ ఫ్రం..’ ఓ గంభీరమైన గొంతుతో సడన్‌గా సీన్‌లోకి ఎంటర్‌ అవుతారు. మీ ఇల్లు, షాప్‌ సెర్చ్‌చేయాలి, ఆధారాలు సేకరించాలని హడావుడి చేస్తారు.. ఆపై అమాయకుల డబ్బుతో ఉడాయిస్తున్నారు నకిలీ అధికారులు. సరిగ్గా ఇదే తరహాలో బోయిన్‌పల్లి పోలీస్‌స్టేషన్‌ పరిధిలో కొందరు ‘మేం ఇన్‌కంట్యాక్స్‌ అధికారులం’ అంటూ చెప్పి ముగ్గుర్ని కిడ్నాప్‌ చేయడం రాష్ట్రంలో మరోసారి కలకలం రేపింది.

హైదరాబాద్‌, జనవరి 6 (నమస్తే తెలంగాణ): సూటు, బూటుతో మెరిసిపోతారు. టక్కు, టైతో నమ్మిస్తారు. నాలుగు ఇంగ్లిష్‌ ముక్కలతో ఇంట్లో ఉన్నవాళ్లను బెదిరించి డబ్బులు కొట్టేస్తున్నారు నకిలీ అధికారులు. రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట నకిలీ అధికారుల ఆగడాలు కొనసాగుతూనే ఉన్నాయి. అమాయకులే లక్ష్యంగా మోసాలు నమోదవుతూనే ఉన్నాయి. కాబట్టి ఎవరైనా అకస్మాత్తుగా ఇండ్లు, కార్యాలయాలకు వచ్చి.. తాము పోలీసులమని, ఐటీ అధికారులమని, సీబీఐ అని చెప్పినప్పుడు ఏమైనా తేడాగా అనిపిస్తే వెంటనే డయల్‌ 100కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచిస్తున్నారు. అలా చేయడం వల్ల వచ్చినవారు నిజమైన అధికారులైతే వెంటనే స్థానిక పోలీసులు నిర్ధారిస్తారని, లేదంటే స్పాట్‌కు వచ్చి సాయంచేస్తారని చెప్తున్నారు. 

నకిలీ అధికారుల ఘటనలు కొన్ని..

  • ఐపీఎస్‌ అధికారినంటూ పలువురిని మోసగించిన కేసులో నిందితుడు గురు వినోద్‌కుమార్‌రెడ్డిని గతేడాది మేలో హైదరాబాద్‌ సెంట్రల్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ సిబ్బంది అరెస్టుచేశారు. 
  •  హైదరాబాద్‌కు చెందిన వై మణివర్ధన్‌రెడ్డి, తమిళనాడులోని మధురైకి చెందిన సెల్వం రామ్‌రాజ్‌ కలిసి సీబీఐలో సీనియర్‌ అధికారులమంటూ ఢిల్లీలో పలువురిని మోసగించారు. డబ్బులిస్తే కేసులు మాఫీ చేస్తామని బురిడీ కొట్టించారు. వీరిని గతేడాది జనవరి 19న అసలైన సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. 
  • సీరియళ్లలో వేసిన పోలీస్‌ వేషాలతో వచ్చిన అనుభవంతో నిజజీవితంలోనూ పోలీస్‌ అవతారం ఎత్తాడు ఉప్పల్‌కు చెందిన బలిజ విక్కీ. బెదిరింపులతో మోసాలకు పాల్పడ్డ అతడిని కూకట్‌పల్లి పోలీసులు గతేడాది డిసెంబర్‌లో అరెస్టు చేశారు. 
  • తాను ఆర్మీలో మేజర్‌నంటూ పెండ్లిళ్ల పేరిట రూ.20 కోట్లకుపైగా వసూళ్లకు పాల్పడిన ఏపీలోని ప్రకాశం జిల్లా కల్లెమంపల్లెకి చెందిన శ్రీనునాయక్‌ను హైదరాబాద్‌ నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. 


logo