మంగళవారం 11 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 14:15:53

కరోనా బాధితులకు మెరుగైన వైద్యం : మంత్రి సత్యవతి రాథోడ్

కరోనా బాధితులకు మెరుగైన వైద్యం : మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ : జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ఈ వైరస్ ను కట్టడి చేసి, ప్రజలకు మెరుగైన వైద్యం అదించాలని  గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్  అధికారులను ఆదేశించారు. జిల్లాలో కరోనా పరిస్థితులపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ భీమ్ సాగర్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ సతీష్ రాథోడ్ లతో సమీక్ష చేశారు. కరోనా బాధితులకు నాణ్యమైన వైద్యం అందించాలి. ఇంకా మెరుగైన వైద్యం అందించేందుకు ఎలాంటి వసతులు, వనరులు కావాలో సూచిస్తే వెంటనే అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

అదేవిధంగా వైద్యం అందించే వైద్యులకు కావాల్సిన పీపీఈ కిట్స్, కనీస సదుపాయాలు కల్పిస్తున్నామని మంత్రి పేర్కొన్నారు. పాజిటివ్ గా నిర్ధారణ అయి ఇళ్లలో ఐసోలేషన్ ఉంటున్న వారికి ప్రభుత్వం ఐసోలేషన్ కిట్స్ అందిస్తుందని, వాటిని బాధితులకు సరైన సమయంలో అందేలా చూడాలన్నారు. ప్రతి ఐసోలేషన్ కుటుంబం, వ్యక్తిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ, వారి వ్యక్తి గత నివేదికలు రూపొందించాలన్నారు. 

కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూనే, పాజిటివ్ నిర్ధారణ అయిన వారికి త్వరగా కోలుకునేందుకు తీసుకోవాల్సిన మందులతో పాటు ధైర్యం కల్పించే విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. కరోనా వచ్చి కోలుకుని క్షేమంగా బయటపడిన వారే అత్యధికంగా ఉన్నారని, దాని బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారు తక్కువగా ఉన్నారన్నారు. పాజిటివ్ అనగానే కంగారు పడకుండా వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకొని ధైర్యంగా ఉండాలన్నారు.logo