బుధవారం 12 ఆగస్టు 2020
Telangana - Jul 15, 2020 , 14:46:52

కరోనా వ్యక్తులకు మెరుగైన వైద్యం : మంత్రి సత్యవతి రాథోడ్

కరోనా వ్యక్తులకు మెరుగైన వైద్యం : మంత్రి సత్యవతి రాథోడ్

మహబూబాబాద్ : జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో వైరస్ వ్యాప్తిని కట్టడి చేసి, రోగుల‌కు మెరుగైన వైద్యం అదించాలని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ జిల్లా అధికారులను ఆదేశించారు. మ‌హ‌బూబాబాద్ జిల్లాలో కరోనా పరిస్థితులపై జిల్లా వైద్యారోగ్య శాఖ అధికారి డాక్టర్ శ్రీరామ్, ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ భీమ్ సాగర్, నోడల్ ఆఫీసర్ డాక్టర్ సతీష్ తో మంత్రి స‌మీక్ష స‌మావేశం నిర్వ‌హించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి మాట్లాడుతూ... కరోనా బాధితులకు నాణ్యమైన వైద్యం అందించాల‌న్నారు. ఇంకా మెరుగైన వైద్యం అందించేందుకు ఎలాంటి వసతులు, వనరులు కావాలో సూచిస్తే వెంటనే అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. వైద్యులకు కావాల్సిన పీపీఈ కిట్స్, కనీస సదుపాయాలు కల్పిస్తున్నామన్నారు.  

పాజిటివ్ గా నిర్ధారణ జరిగి ఇళ్లలో ఐసోలేషన్ ఉంటున్న వారికి ప్రభుత్వం ఐసోలేషన్ కిట్స్ అందిస్తుందన్న‌ట్లు తెలిపారు. వాటిని బాధితులకు సరైన సమయంలో అందేలా చూడాలన్నారు. ప్రతి బాధిత‌ వ్యక్తిపై ప్రత్యేక దృష్టి పెట్టి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేయాల‌న్నారు. కరోనా రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఎప్పటికప్పుడు అవగాహన కల్పిస్తూనే, పాజిటివ్ నిర్ధారణ అయిన వారికి త్వరగా కోలుకునేందుకు తీసుకోవాల్సిన మందులతో పాటు ధైర్యం కల్పించే విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాలన్నారు. 

కరోనా మందులేని వ్యాధి మాత్రమేనని కానీ నయంకానీ వ్యాధి మాత్రం కాదన్నారు. సరైన జాగ్రత్తలు పాటిస్తే వ్యాధి నుంచి బ‌య‌ట‌ప‌డొచ్చ‌న్నారు. కరోనా వచ్చి కోలుకుని క్షేమంగా బయటపడిన వారే అత్యధికంగా ఉన్నారన్నారు. వైర‌స్ బారిన పడి ప్రాణాలు కోల్పోతున్న వారు చాలా స్వ‌ల్ప‌మ‌న్నారు. కావునా కరోనా పాజిటివ్ అనగానే కంగారు పడకుండా ధైర్యంగా ఉంటూ వైద్యులను సంప్రదించి చికిత్స తీసుకోవాలన్నారు. 



logo