ఆదివారం 29 నవంబర్ 2020
Telangana - Nov 02, 2020 , 01:30:00

బ్రాహ్మణులకు ‘బెస్ట్‌' ఆర్థిక చేయూత

 బ్రాహ్మణులకు ‘బెస్ట్‌' ఆర్థిక చేయూత

  • నేటి నుంచి దరఖాస్తులు
  • వార్షిక ఆదాయం 5 లక్షలు మించొద్దు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బ్రాహ్మ ణ కుటుంబాలు ఆర్థిక పురోగతి సాధించాలన్న సంకల్పంతో తెలంగాణ రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌ (టీఎస్‌బీఎస్‌పీ) ద్వారా ‘బ్రాహ్మణ ఎంటర్‌ప్రెన్యూర్‌ స్కీం తెలంగాణ’ (బెస్ట్‌) పేరిట రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ రుణాలిచ్చి ప్రోత్సహిస్తున్నది. చిన్న తరహా పరిశ్రమలు, వ్యాపార కేంద్రాలు, వ్యవసాయ అనుబంధ పరిశ్రమలు, ఇతర కుటీర పరిశ్రమలను నిర్వహించుకొని ఆదాయ వనరులు పెంచుకునేలా ప్రత్యేక కార్యాచరణ అమలు చేస్తున్నారు. అర్హులైన పేద బ్రాహ్మణులకు వారు ప్రతిపాదించిన యూనిట్‌ను బట్టి రూ.5 లక్షల వరకు ఆర్థిక చేయూత అందించనున్నారు. ఇందులో భాగంగానే 2020-21 ఆర్థిక సంవత్సరానికి బెస్ట్‌ ద్వారా లబ్ధి పొందేందుకు అభ్యర్థులు సోమవారం నుంచి దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ఈ పథకం ద్వారా 137 రకాల యూనిట్లను ఏర్పాటుచేసుకునేందుకు ఆర్థిక చేయూతను అందించనున్నారు. అభ్యర్థులు www.brahminparishad.telangana.gov.inలో దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుదారులు తాము నెలకొల్పే పరిశ్రమ, వ్యాపారంలో గత అనుభవం ఉండాలి. అందుకు సంబంధించిన ధృవీకరణ పత్రాలను సమర్పించాలి. స్థానికత, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలను సమర్పించాలి. అభ్యర్థి వార్షిక ఆదాయం రూ.5 లక్షలకు మించకుండా ఉంటేనే అర్హులుగా నిర్ణయిస్తారు. బెస్ట్‌ లబ్ధి కోసం గత ఆర్థిక సంవత్సరంలో దరఖాస్తు చేసుకున్నవారికి సోమవారం నుంచి ఈ నెల 10వ తేదీవరకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నట్టు టీఎస్‌బీఎస్‌పీ వెల్లడించింది. 450 మంది దరఖాస్తుదారులకు ప్రత్యేక కమిటీ ద్వారా హైదరాబాద్‌లోని దేవాదాయ, ధర్మాదాయశాఖ భవనంలో కొవిడ్‌ నిబంధనలు పాటిస్తూ రోజువారీగా ఇంటర్వ్యూ విధానంతో ఎంపిక ప్రక్రియ చేపట్టనున్నారు.

లబ్ధిదారులకు సబ్సిడీ ఇలా..

  • రూ.లక్ష వరకు 80% సబ్సిడీ 
  • రూ.2 లక్షల వరకు 70% సబ్సిడీ
  • రూ.5 లక్షల వరకు యూనిట్‌ కాస్ట్‌కు 60%  సబ్సిడీ 
  • సబ్సిడీ పోను మిగిలిన మొత్తాన్ని బ్యాంకు రుణం లేదా లబ్ధిదారుని వాటాగా చెల్లించాల్సి ఉంటుంది.