శనివారం 31 అక్టోబర్ 2020
Telangana - Oct 05, 2020 , 01:48:10

ఆలయాల్లో ఆర్జిత సేవలు ప్రారంభం

ఆలయాల్లో ఆర్జిత సేవలు ప్రారంభం

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి, నమస్తే తెలంగాణ/బాసర/ధర్మపురి: కరోనా వైరస్‌ వ్యాప్తి నేపథ్యంలో ఆలయాల్లో నిలిపి వేసిన ఆర్జిత సేవలను దేవాదాయ శాఖ ఆదేశాల మేరకు తిరిగి ప్రారంభమయ్యాయి. ఆదివారం యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి దేవాలయంలో అభిషేకం, సహస్రనామార్చన, శ్రీసుదర్శన నారసింహహోమం, నిత్యకల్యాణం, బ్రహ్మోత్సవం, శ్రీస్వామివారి వెండి మొక్కు జోడు సేవలు, సువర్ణ పుష్పార్చన పూజలు ప్రారంభమయ్యాయి. కోవిడ్‌ నిబంధనల కారణంగా ఆర్జిత సేవల్లో భక్తులు పరిమిత సంఖ్యలో పాల్గొనేలా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. స్వామివారి ఖజానాకు ఆదివారం ఒక్కరోజే రూ.11,74,209 ఆదాయం సమకూరింది. కాగా బాసర సరస్వతి అమ్మవారి ఆలయంలోనూ అక్షరాభ్యాసం, కుంకుమార్చన, సత్యనారాయణ వ్రత పూజలను ప్రారంభించారు. జగిత్యాల జిల్లా ధర్మపురి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకం, నిత్యకల్యాణం, హోమం తదితర పూజాకార్యక్రమాలు నిర్వహించారు. ధర్మపురి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదానానికి హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ వైద్యులు శ్రీరాంభట్ల రాధాకృష్ణ-మాధవీలత దంపతులు రూ.5లక్షల విరాళాన్ని అందజేశారు. 

భద్రాచలంలో నేటినుంచి..

భద్రాచల శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో సోమవారం నుంచి ఆర్జిత సేవలు ప్రారంభంకానున్నట్లు ఈవో శివాజీ తెలిపారు.