శనివారం 30 మే 2020
Telangana - May 13, 2020 , 01:52:30

వరిపంటతోనే మార్పు మొదలు

వరిపంటతోనే మార్పు మొదలు

  • 50 లక్షల ఎకరాల్లో వరి.. 50 లక్షల ఎకరాల్లో పత్తి
  • ఉన్నతస్థాయి సమీక్షలో సీఎం కేసీఆర్‌ నిర్ణయం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈ వానకాలం నుంచే నియంత్రిత పద్ధతిలో పంట సాగుచేసే పద్ధతిని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యవసాయంపై మంగళవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో వరిపంటతోనే మార్పు శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకొన్నారు. తెలంగాణ వ్యవసాయ శాస్త్రవేత్తలు రూపొందించిన సోనారకం బియ్యానికి బ్రాండ్‌ ఇమేజ్‌ ఉండటంతో ఈ వానకాలం సీజన్‌లో ఈ పంటను వీలైనంత అధిక విస్తీర్ణంలో పండించాలని ప్రభుత్వానికి నిపుణులు ఇప్పటికే సూచించిన సంగతి తెలిసిందే. మన బియ్యానికి అంతర్జాతీయ స్థాయిలో బ్రాండ్‌ ఇమేజ్‌ సృష్టించేలా చర్యలు తీసుకోవాలని మంత్రివర్గ ఉపసంఘం కూడా ప్రభుత్వానికి సూచించింది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని ఏయే ప్రాంతాల్లో ఏయే పంటలు వేయాలో ప్రభుత్వం సూచిస్తుంది. 

రాష్ట్రంలో ఈసారి 50 లక్షల ఎకరాల్లో వరి (సన్న, దొడ్డు రకాలు) సాగుచేయాలని నిర్ణయించారు. పది లక్షల ఎకరాల్లో తెలంగాణ సోనారకాన్ని పండించాలని నిశ్చయించారు. ఏ ప్రాంతంలో ఏ రైతులు ఏ రకం పండించాలి? ఎంత విస్తీర్ణంలో పండించాలి? అనే విషయాలను త్వరలోనే ప్రభుత్వం వెల్లడిస్తుంది.  ప్రభుత్వం చెప్పిన రకం పంటలు సాగుచేసిన రైతులకే రైతుబంధు ఇవ్వాలని, ఆ పంటలకే మద్దతుధర ఇచ్చి కొనుగోలుచేయాలనే నిర్ణయం జరిగింది. ఈ వానకాలంలో 50 లక్షల ఎకరాల్లో పత్తి, 10 లక్షల ఎకరాల్లో కందులు పండించాలని నిర్ణయించారు. ఏ పంట ఎక్కడ పండించాలి? ఎంత పండించాలి? అనే వివరాలను అధికారులు త్వరలోనే వెల్లడిస్తారు. పట్టణ ప్రాంతాలకు సమీపంలో ఉన్న వ్యవసాయ క్షేత్రాల్లో కూరగాయల సాగుచేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఏ ప్రాంతంలో.. ఎంత విస్తీర్ణంలో.. ఏయే కూరగాయలు పండించాలి? ఏ కూరగాయలు పండించాలి? ఎంత విస్తీర్ణంలో పండించాలి? అనే విషయాలు కూడా రైతులకు ప్రభుత్వం సూచిస్తుంది. 


logo