శుక్రవారం 05 జూన్ 2020
Telangana - Apr 02, 2020 , 02:25:41

బియ్యం పంపిణీ ప్రారంభం

బియ్యం పంపిణీ ప్రారంభం

  • సీఎం హామీ అమలు 
  • 17,025 రేషన్‌ షాప్‌లద్వారా సరఫరా
  • 2.80 కోట్లమందికి లబ్ధి 

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: కరోనా నేపథ్యం లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ హామీమేరకు ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభమైంది. రాష్ట్రంలోని 87.54 లక్షల ఆహార భద్రత కార్డుల్లోని 2.80 కోట్లమంది పేదలకు బియ్యం అందించనున్నారు. బుధవారం రాష్ట్రంలోని అన్ని జిల్లాల్లో రేషన్‌ దుకాణాల ద్వారా ఒక్కో వ్యక్తికి 12 కిలోల బి య్యం అందజేసే కార్యక్రమం  మొదలైంది. 

కరీంనగర్‌ జిల్లా కేంద్రంలోని 14వ డివిజన్‌లో బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ బియ్యం పంపిణీని   ప్రారంభించారు. చొప్పదండిలో ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌, తిమ్మాపూర్‌ మండలం మహాత్మానగర్‌లో మానకొండూర్‌ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్‌ పంపిణీ చేశారు.  ఉమ్మడి వరంగల్‌ జిల్లావ్యాప్తంగా రేషన్‌కార్డుదారులకు ఉచిత బియ్యం పంపిణీ ప్రారంభమైంది. వరంగల్‌ రూరల్‌   చౌకడిపోల్లో 418 కార్డులపై 14,964 కిలోల ఉచిత బియ్యాన్ని పంపిణీ చేసినట్లు పౌరసరఫరాల శాఖ జిల్లా అధికారి దీప్తి వెల్లడించారు. చెన్నారావుపేట మండల కేంద్రంలో నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి, వర్ధన్నపేట మండలం ఇల్లందలో  ఎమ్మెల్యే ఆరూరి రమేశ్‌ బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

మహబూబాబాద్‌ జిల్లాలో 553 రేషన్‌ షాపుల్లో ఉచితం బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించారు. మరిపెడలో ఎమ్మెల్యే రెడ్యానాయక్‌ బియ్యం పంపిణీ మొద లుపెట్టారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం, అశ్వారావుపేట, ఇల్లెందు, మణుగూరు, కొత్తగూడెం నియోజకవర్గాల్లో బియ్యం అందజేశారు. నల్గొండ జిల్లాలో రేషన్‌ బియ్యం పంపిణీని మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కర్‌ రావుతో కలిసి మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి ప్రారంభించారు.  రేషన్‌ బియ్యం పంపిణీలో వృద్ధులకు, దివ్యాంగులకు ప్రాధాన్యమివ్వాలని మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌ అధికారులను ఆదేశించారు. మహబూబ్‌నగర్‌ కలెక్టర్‌ వెంకట్రావుతో హైదరాబాద్‌లోని తన కార్యాలయం నుంచి బుధవారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. 

 మంత్రి కేటీఆర్‌ సూచనలతో 1500 మంది కార్మికులకు సాయం

భవన నిర్మాణ కార్మికులకు ఆపన్నహస్తం అందించాలన్న పురపాలక శాఖ మంత్రి కేటీఆర్‌ సూచనల్ని అందుకున్న ప్రణీత్‌ గ్రూప్‌.. బుధవారం బాచుపల్లిలోని రెండు ప్రాజెక్టుల్లో రెండున్నర టన్నుల కూరగాయలు, వెయ్యి లీటర్ల నూనె, బియ్యం పంపిణీ చేసింది. తెలంగాణ పౌరసరఫరాల సంస్థ ఛైర్మన్‌ మర్రెడ్డి శ్రీనివాస్‌ రెడ్డి, ఎమ్మెల్సీ శంభీపూర్‌ రాజు చేతుల మీద ఈ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ప్రణీత్‌ గ్రూప్‌ ఎండీ నరేంద్ర కామరాజు మాట్లాడుతూ.. మంత్రి కేటీఆర్‌ సూచనల మేరకు తమ మొత్తం ప్రాజెక్టుల్లో 3,500 మంది కార్మికులకు అవసరమయ్యే సమస్త సదుపాయాల్ని అందజేస్తున్నామని వెల్లడించారు. ముందస్తుగానే భవన కార్మికులకు జీతాలను కూడా అందజేశామని తెలిపారు. 

అర్హులందరికీ పంపిణీ 

పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌ శ్రీనివాస్‌రెడ్డి


రాష్ట్రంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ రూ.12 కిలోల ఉచిత బియ్యం అందుతాయని పౌరసఫరాల సంస్థ చైర్మన్‌ మారెడ్డి శ్రీనివాస్‌రెడ్డి పేర్కొన్నారు. హైదరాబాద్‌ ఖైరతాబాద్‌లోని రేషన్‌షాప్‌ నంబర్‌- 702లో ఉచిత బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని బుధవారం ఆయన ప్రారంభించి మాట్లాడుతూ.. రాష్ట్రంలోని 87.54 లక్షల ఆహార భద్రత కార్డులోని 2.80 కోట్ల మంది పేదలకు ఉచితంగా బియ్యం అందిస్తున్నట్టు చెప్పారు. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 17,025 రేషన్‌ షాపుల్లో 3.34 లక్షల టన్నుల బియ్యాన్ని అందుబాటులో ఉంచామన్నారు. రేషన్‌ షాపుల వద్ద టోకెన్‌ విధానం అమలు చేస్తున్నామని, లబ్ధిదారులు క్యూలో నిర్ణీతదూరం పాటించాలని కోరారు. ఫిర్యాదుల కోసం పౌరసరఫరాల కేంద్ర కార్యాలయం టోల్‌ ఫ్రీ నంబర్‌ 1967, 1800 42500333 ఏర్పాటుచేశామని చెప్పారు. రాష్ట్రంలో గుర్తించిన 3.35 లక్షల మంది వలస కార్మికులకు ఒక్కొక్కరికీ 12 కిలోల చొప్పున రూ.13 కోట్లతో 4,038 టన్నుల బియ్యం అందిస్తున్నామని పేర్కొన్నారు.


logo