ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 19, 2020 , 02:34:46

ఈ మూడు నెలలు కీలకం

ఈ మూడు నెలలు కీలకం

 • కరోనా, సీజనల్‌ వ్యాధులతో జాగ్రత్తగా ఉండాలి
 • మీడియాతో వైద్యాధికారులు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈ నెలతోపాటు నవంబర్‌, డిసెంబర్‌లోనూ ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ జీ శ్రీనివాసరావు సూచిం చారు. పండుగల వేళ ప్రజల రాకపోకలు పెరుగడం, గుమిగూడటం వల్ల కరోనా వ్యాప్తి ఎక్కువయ్యే ప్రమాదం ఉన్నదని పేర్కొన్నారు. రాష్ట్రంలో నమోదవుతున్న కేసుల్లో 70 శాతంవరకు ఎలాంటి లక్షణాలు కనిపించడం లేదని, వీరు వైరస్‌ వాహకాలుగా మారి వ్యాప్తిని పెంచే అవకాశం ఉన్నదన్నారు. పండుగలను ఇంట్లోనే కుటుంబసభ్యులతో మాత్రమే నిర్వహించుకోవాలని సూచించారు. ఆదివారం కోఠిలోని డీపీహెచ్‌ కార్యాలయంలో కొవిడ్‌పై ప్రచార కార్యక్రమాన్ని ప్రారంభించిన అనంతరం వైద్యవిద్యా సంచాలకుడు డాక్టర్‌ రమేశ్‌రెడ్డితో కలిసి శ్రీనివాసరావు మీడియాతో మాట్లాడారు. వానలతో సీజనల్‌ వ్యాధులు విజృంభించే అవకాశం ఉన్నదన్నారు. జీహెచ్‌ఎంసీతోపాటు రాష్ట్రవ్యాప్తంగా అవసరమైన ప్రాంతాల్లో ప్రత్యేక వైద్యసేవలు ప్రారంభించినట్టుచెప్పారు. ప్రత్యేక క్యాంపులు ఏర్పాటుచేసి 24 గంటలు వైద్య సేవలందిస్తున్నట్టు తెలిపారు. ఇక్కడే కరోనా టెస్టులు జరిపి వైరస్‌ కట్టడికి కృషిచేస్తున్నట్టు పేర్కొన్నారు.  

వ్యాక్సిన్‌ పంపిణీకి సిద్ధమవుతున్నాం

జనవరిలో కరోనా వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తుందని ఆశిస్తున్నామని, ముందుగా ఫ్రంట్‌లైన్‌ వర్కర్స్‌, ఆ తర్వాత తీవ్రముప్పు ఉండేవారికి, అనారోగ్య సమస్యలున్నవారికి ప్రాధాన్యం ఇస్తామని శ్రీనివాసరావు చెప్పారు. వ్యాక్సిన్‌ వస్తే ఎలా పంపిణీ చేయాలి? అందుకు న్న వనరులు, ఇతర అంచనాలను కేంద్రానికి పంపుతున్నట్టు వివరించారు. గాంధీ దవాఖాన లో ప్రస్తుతం 350 మంది కరోనా బాధితులు ఉన్నారని, వైరస్‌ వ్యాప్తి తగ్గుముఖం పట్టిందనడానికి ఇదే నిదర్శనమన్నారు. డీఎంఈ రమేశ్‌రెడ్డి మాట్లాడుతూ.. ప్రభుత్వ దవాఖానకు వచ్చిన ఏ ఒక్క రోగిని చేర్చుకోకుండా తిరిగి పంపించవద్దని ఆదేశించారు. ప్రాథమిక చికిత్స అందించిన తర్వాతే అవసరం ఉంటే మరో దవాఖానకు పంపించాలని సూచించారు.  

పాటించాల్సిన జాగ్రత్తలివే..

 • కాచి వడపోసి చల్లార్చిన నీరు తాగాలి
 • ఆహారం వేడిగా ఉన్నప్పుడే తీసుకోవాలి
 • పరిశుభ్రతను పాటించాలి
 • ఏ లక్షణాలున్నా సమీప ప్రభుత్వ దవాఖానకు వెళ్లాలి
 • దోమలు వృద్ధిచెందకుండా చూసుకోవాలి
 • మాస్కు ధరించాలి, భౌతికదూరం పాటించాలి
 • ఫిర్యాదులు, సమస్యల కోసం 104కు కాల్‌చేయాలి

జీహెచ్‌ఎంసీలో వైద్యసేవలు

 • 182 ప్రత్యేక వైద్య శిబిరాలు
 • 24 గంటలపాటు వైద్యసేవలు
 • ఎక్కడికక్కడే కరోనా నిర్ధారణ పరీక్షలు
 • ఇప్పటివరకు 14,900 మందికి చికిత్స
 • 10 వేలకు పైగా మాస్కులు పంపిణీ
 • 1,200 పైగా శానిటైజర్స్‌ బాటిల్స్‌ అందజేత
 • ప్రత్యేకంగా 350 పైగా వైద్యులు, సిబ్బంది 
 • 67 మొబైల్‌ అంబులెన్స్‌ల సేవలు
 • పెద్ద మొత్తంలో నీటి స్వచ్ఛత పరీక్షలు

89.05 శాతానికి చేరిన రికవరీ రేటు 

రాష్ట్రంలో కరోనా బాధితుల రికవరీ రేటు రోజురోజుకు పెరుగుతున్నది. శనివారం దేశంలో రికవరీ రేటు 88 శాతం నమోదు కాగా, తెలంగాణలో 89.05 శాతానికి చేరుకున్నది. ఇప్పటివరకు 38 లక్షల వైరస్‌ నిర్ధారణ పరీక్షలు చేయగా.. 2.22 లక్షల మందికి పాజిటివ్‌గా తేలింది. ఇందులో 1.98 లక్షల మంది కోలుకోగా, 22,050 మంది ఇండ్లు, దవాఖానల్లో చికిత్స పొందుతున్నట్టు ఆదివారం బులెటిన్‌లో వైద్యారోగ్యశాఖ పేర్కొన్నది. శనివారం 41 వేల టెస్టులు చేయగా.. 1,436 మందికి పాజిటివ్‌ గా తేలింది. జీహెచ్‌ఎంసీలో 249, రంగారెడ్డి జిల్లాలో 110, మేడ్చల్‌ మల్కాజిగిరిలో 105 కేసు లు నమోదయ్యాయి. కరోనాకుతోడు అనారోగ్య కారణాల వల్ల ఆరుగురు మరణించారు.


logo