మంగళవారం 20 అక్టోబర్ 2020
Telangana - Sep 22, 2020 , 19:34:22

బీసీ గురుకుల గెస్ట్ టీచ‌ర్స్‌ను కొన‌సాగించాలి : వినోద్ కుమార్‌

బీసీ గురుకుల గెస్ట్ టీచ‌ర్స్‌ను కొన‌సాగించాలి : వినోద్ కుమార్‌

హైద‌రాబాద్ : సాంఘీక, గిరిజన, మైనారిటీ సంక్షేమం, జనరల్ గురుకుల పాఠశాలల్లో అమలు చేస్తున్నట్లుగానే మహాత్మా జ్యోతిబా ఫూలే బీసీ గురుకుల పాఠశాలల్లో కూడా గెస్ట్ టీచర్స్ లను కొనసాగించాలని, ఈ విషయంలో చొరవ తీసుకోవాలని కోరుతూ బీసీ గురుకుల గెస్ట్ టీచర్స్ సంఘం ప్రతినిధులు రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్‌ను కోరారు. ఈ మేరకు బీసీ గురుకుల పాఠశాలల గెస్ట్ టీచర్స్ సంఘం రాష్ట్ర ప్రతినిధులు మంగళవారం మంత్రుల అధికార నివాసంలో వినోద్ కుమార్ తో సమావేశమై తమ సమస్యలను వివరిస్తూ వినతి పత్రాన్ని అందజేశారు. కొవిడ్ నేపథ్యంలో ఒక్క బీసీ గురుకుల పాఠశాలల్లో మాత్రమే గెస్ట్ టీచర్స్  ఉద్యోగాన్ని రెన్యూవల్ చేయలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా బీసీ గురుకులాల్లో సుమారు రెండు వేల మంది గెస్ట్ టీచర్స్ ఉన్న‌ట్లు తెలిపారు.

ఈ విషయంపై స్పందించిన వినోద్ కుమార్ బీసీ సంక్షేమశాఖ మంత్రి గంగుల కమలాకర్‌తో ఫోన్‌లో మాట్లాడారు. బీసీ గురుకుల పాఠశాలల్లో గెస్ట్ టీచర్ లను కొనసాగించాలని సూచించారు. ఇతర గురుకుల పాఠశాలలలో అనుసరిస్తున్న విధానాన్ని బీసీ గురుకుల పాఠశాలలలో అమలు చేయాలని చెప్పారు. వినోద్ కుమార్‌ను కలిసిన వారిలో బీసీ గురుకుల గెస్ట్ టీచర్స్ సంఘం రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు మహేందర్, ఉపాధ్యక్షుడు ఎన్. సంపత్, ప్రధాన కార్యదర్శి వీరబోయిన తిరుపతి, కోశాధికారి గంగుల రమేష్, సహాయ కార్యదర్శులు చక్రూ నాయక్,  ప్రభాకర్, రాజశేఖర్, ఎన్. రమేష్, దివ్య, రజిత, శ్రీలత, అరుణ, నాగజ్యోతి, దీప్తి, తదితరులు ఉన్నారు.


logo