శనివారం 24 అక్టోబర్ 2020
Telangana - Oct 11, 2020 , 02:06:40

బతుకమ్మ చీరెలతో మురిసిన ఆడపడుచులు

బతుకమ్మ చీరెలతో మురిసిన ఆడపడుచులు

  • సీఎం కేసీఆర్‌ సల్లంగుండాలని దీవెనలు

నమస్తే తెలంగాణ నెట్‌వర్క్‌: దేశంలో ఎక్కడా లేనివిధంగా తెలంగాణ సర్కార్‌ అందజేస్తున్న బతుకమ్మ కానుకను చూసి మహిళాలోకం సంబురపడుతున్నది. అన్నలా మారి ముఖ్యమంత్రి కేసీఆర్‌ పంపిన పుట్టింటి చీరెలను చూసి మహిళలు మురిసిపోతున్నారు. రెండోరోజైన శనివారం ఎన్నికల కోడ్‌ ఉన్న ప్రాంతాలను మినహాయించి రాష్ట్రవ్యాప్తంగా చీరెల పంపిణీ కార్యక్రమం పండుగ వాతావరణంలో కొనసాగింది. రంగురంగుల చీరెలను అందుకున్న ఆడబిడ్డలు, అవ్వలు.. సీఎం కేసీఆర్‌ సల్లంగుండాలని దీవించారు. ఆయా జిల్లాల్లో మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మహిళలకు బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా రాయపర్తిలో కలెక్టర్‌ హరితతో కలిసి పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు చీరెలను అందజేశారు. రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు సమున్నత గౌరవం కల్పించేందుకు సీఎం కేసీఆర్‌ కృషి చేస్తున్నారని మంత్రి ఎర్రబెల్లి తెలిపారు. మహబూబాబాద్‌ పట్టణంతోపాటు మండలంలోని మల్యాలలో కలెక్టర్‌ వీపీ గౌతమ్‌, ఎమ్మెల్యే బానోతు శంకర్‌నాయక్‌తో కలిసి గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ చీరెలు పంపిణీ చేశారు. తెలంగాణలో మహిళలంతా బతుకమ్మ పండుగను ఆనందంగా జరుపుకోవాలన్న ఉద్దేశంతోనే సీఎం కేసీఆర్‌ బతుకమ్మ చీరెలు అందిస్తున్నారని పేర్కొన్నారు. కరీంనగర్‌ జిల్లా కొత్తపల్లి మండలం నాగులమల్యాల, కొత్తపల్లిలో మహిళలకు బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ చీరెలు అందజేసి మాట్లాడుతూ.. తెలంగాణలో అన్ని మతాలు, పండుగలకు ప్రభుత్వం సమ ప్రాధాన్యమిస్తున్నదన్నారు. నిర్మల్‌ మండలంలోని ముజ్గి, లక్ష్మణచాంద మండలం పీచర గ్రామాల్లో దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి బతుకమ్మ చీరెలను పంపిణీ చేశారు. పేదింటి ఆడబిడ్డల జీవితాల్లో వెలుగులు నింపేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని తెలిపారు. సూర్యాపేటలోని పలు వార్డుల్లో ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్‌తో కలిసి మంత్రి జగదీశ్‌రెడ్డి మహిళలకు చీరెలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ ప్రతి కుటుంబానికి పెద్ద కొడుకుగా.. ఆడబిడ్డల పక్షపాతిగా నిలిచారన్నారు. 


logo