గురువారం 13 ఆగస్టు 2020
Telangana - Jul 22, 2020 , 02:50:44

బతుకునిస్తున్న చీరె

బతుకునిస్తున్న చీరె

  • బతుకమ్మ చీరలతో 15 వేల మందికి ఉపాధి
  • ఇతర రాష్ర్టాల నుంచి రెండువేలమంది వలస

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనాతో పవర్‌లూం పరిశ్రమ పరిస్థితి మూలిగే నక్కపై తాటిపండు చందంగా తయారైంది. దేశవ్యాప్తంగా పవర్‌లూం పరిశ్రమ తీవ్ర సంక్షోభంలో పడిపోయింది. కానీ, తెలంగాణ ఆడపడుచులకు ప్రభుత్వం అందజేసే బతుకమ్మ చీర రాష్ట్రంలో నేతన్నకు బతుకునిస్తున్నది. బతుకమ్మ చీరల ఆర్డర్లతో మరమగ్గ కార్మికులకు 24 గంటల పని లభిస్తున్నది. చేతినిండా పనిదొరుకుతుండటంతో వలసపోయిన కార్మికులు సైతం తిరిగి వచ్చి బతుకమ్మ చీరల తయారీలో నిమగ్నమయ్యారు. ఇతర రాష్ర్టాల్లో పని కోల్పోయినవారు తెలంగాణలో ఉపాధి పొందుతున్నారు. ఒక్కొక్కరికి నెలకు రూ.25 వేల వరకు కూలి లభిస్తున్నది. భార్యాభర్తలు పనిచేసుకుని నెలకు రూ.50 వేలు సంపాదిస్తున్నారు. ఇతరరాష్ర్టాల్లో మరమగ్గంపై పనిచేస్తే ఇచ్చే కూలి కంటే బతుకమ్మచీరలకు ఇచ్చే రేట్లు దాదాపుగా రెట్టింపు ఉండటంతో మహరాష్ట్ర, గుజరాత్‌ రాష్ర్టాల నుంచి రెండువేల మంది కార్మికులు ఇక్కడకు వచ్చి ఉపాధి పొందుతున్నారు. బతుకమ్మ సందర్భంగా తెలంగాణ అడపడుచులకు ప్రభుత్వం ఏటా చీరను సారెగా అందజేస్తున్నది. ఈ చీరల తయారీని రాష్ట్రంలో చేనేతలకు ఇవ్వడం ద్వారా వారికి ఉపాధి కల్పించాలని ముఖ్యమంత్రి కేసీఆర్‌ నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా కోటి చీరల తయారీకి చేనేతకు ఆర్డర్లు ఇచ్చారు. ఇందుకోసం రాష్ట్రప్రభుత్వం రూ.330 కోట్లను కేటాయించింది. సిరిసిల్లతోపాటు, రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో మరమగ్గాలు విరామం లేకుండా నడుస్తున్నాయి. చేనేతలు రేయింబవళ్లు చీరల తయారీలో నిమగ్నమవుతున్నారు. ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 50 లక్షల చీరలు తయారయ్యాయి. దాదాపు 7 కోట్ల మీటర్ల వస్ర్తాన్ని తయారుచేయాల్సి ఉండగా.. 3.50కోట్ల మీటర్లు సిద్ధమైంది. దాని ప్రాసెసింగ్‌ అనంతరం ప్యాకింగ్‌ పూర్తిచేసి గోడౌన్లలో భద్రపరచనున్నారు. సెప్టెంబర్‌లో సిద్ధమైన చీరలను ఆయా జిల్లాలకు చేరవేస్తారు. చీరల తయారీని రాష్ట్రమంత్రి కే తారకరామారావు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ అధికారులకు తగు సూచనలు, ఆదేశాలు జారీచేస్తున్నారు. 

225 వెరైటీల్లో చీరలు

తీరొక్క పూలతో బతుకమ్మ అడుకునే మహిళలకు తీరొక్క రంగుల్లో చీరలను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నది. గతేడాది 100 వెరైటీల్లో చీరెలను తయారుచేయగా.. ఈ ఏడాది 225 వెరైటీల్లో చీరలను రూపొందిస్తున్నారు. గతంలోకంటే నాణ్యమైనవిగా, మరింత ఆకర్షణీయంగా రూపొందిస్తున్నారు. బంగారు, వెండి రంగుల్లో చీర జరి రానున్నది. సిరిసిల్ల పట్టణం, శివారు ప్రాంతాలు, చంద్రంపేట, తంగళ్లపల్లిలోని టెక్స్‌టైల్‌ పార్కులో చీరల తయారీ కొనసాగుతున్నది. 15 వేల మంది కార్మికులు, దాదాపు 20వేల మరమగ్గాలపై రేయింబవళ్లు పనిచేస్తున్నారు.


logo