ఆదివారం 20 సెప్టెంబర్ 2020
Telangana - Sep 15, 2020 , 02:52:23

అక్టోబర్‌ 16 నుంచే బతుకమ్మ

అక్టోబర్‌ 16 నుంచే బతుకమ్మ

  • తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత
  • తెలంగాణ విద్వత్సభ ప్రతినిధులతో పండుగపై చర్చ

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: ఈ ఏడాది బతుకమ్మ పండుగను అక్టోబర్‌ 16 నుంచి 24వరకు జరుపుకోవాలని తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు, మాజీ ఎంపీ కల్వకుంట్ల కవిత కోరారు. అధిక ఆశ్వయుజ మాసం కారణంగా బతుకమ్మ పండుగ తేదీలపై ఉన్న అస్పష్టతను తొలిగించేందుకు సోమవారం ప్రముఖ సిద్ధాంతులు, పంచాంగకర్తలు, జ్యోతిష్య పండితులతో కూడిన తెలంగాణ విద్వత్సభ ప్రతినిధులతో కవిత హైదరాబాద్‌లోని తన నివాసంలో చర్చించారు. అధిక మాసాన్ని పరిగణనలోకి తీసుకొని, ప్రతి సంవత్సరంలాగే భాద్రపద మాసంలో కాకుండా ఆశ్వయుజ మాసంలో అక్టోబర్‌ 16న బతుకమ్మను ప్రారంభించి 9 రోజులపాటు ఘనంగా నిర్వహించుకోవాలని పండితులు సూచించినట్టు కవిత తెలిపారు. ప్రతి 19 ఏండ్లకోసారి ఇలాంటి పరిస్థితి ఎదురవుతుందని, శాస్త్రం ప్రకారం ఇందులో ఎలాంటి తప్పు లేదని వేదపండితులు తెలిపారని ఆమె పేర్కొన్నారు. పం డితులు, సిద్ధాంతుల సూచనల ప్రకారం అక్టోబర్‌ 16న బతుకమ్మ ప్రారంభించాలని ఆడపడుచులను కవిత కోరారు. తెలంగాణ జాగృతి చాలా ఏండ్ల నుంచి బతుకమ్మ పండుగను నిర్వహిస్తున్నందున, చాలామంది పండుగ తేదీలపై తనను సంప్రదించారని కవిత పేర్కొన్నారు. ఈ చర్చలో విద్వత్సభ రాష్ట్ర అధ్యక్షుడు యాయవరం చంద్రశేఖరశర్మ సిద్ధాంతి, బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహనశర్మ తదితరులు పాల్గొన్నారు.

అక్టోబర్‌లోనే బతుకమ్మ పండుగ: మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి

అధిక మాసం నేపథ్యంలో తెలంగాణ విద్వత్సభ ప్రతినిధులు సూచించిన ప్రకారం అక్టోబర్‌ 16 నుంచి 24 వరకు బతుకమ్మ పండుగ నిర్వహించాలని నిర్ణయించినట్టు దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి తెలిపారు. విద్వత్సభ ప్రతినిధులు సోమవారం మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డిని ఆయన నివాసంలో కలిసి బతుకమ్మ నిర్వహణ తేదీలను వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా దేవాలయాలు, ధార్మిక సంస్థలు, బతుకమ్మ పండుగలో పాలుపంచుకునే వారందరికీ అధికారిక ప్రకటన ద్వారా సమాచారం అందించనున్నట్టు మంత్రి వివరించారు. మంత్రిని కలిసినవారిలో తెలంగాణ విద్వత్సభ ప్రతినిధులు మరుమాముల వెంకటరమణశర్మ, బీ హనుమంతాచార్యులు, గాడిచెర్ల నాగేశ్వరసిద్ధాంతి, తెలంగాణ బ్రాహ్మణ సేవా సంఘాల సమాఖ్య అధ్యక్షుడు వెన్నంపల్లి జగన్మోహనశర్మ, నరేశ్‌ కులకర్ణి ఉన్నారు.


logo