శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 12, 2020 , 16:46:56

మెరుగైన వైద్యం అందించేందుకే బస్తీ దవాఖానలు : మంత్రి మల్లారెడ్డి

 మెరుగైన వైద్యం అందించేందుకే బస్తీ దవాఖానలు : మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్‌ మల్కాజిగిరి : ప్రజలకు మెరుగైన వైద్య సేవలందించడమే లక్ష్యంగా బస్తీ దవాఖానలను ఏర్పాటు చేస్తున్నామని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం కేపీహెచ్‌బీ కాలనీ 3వ ఫేజ్‌లో నూతనంగా ఏర్పాటు చేసిన బస్తీ దవాఖానాను ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా జీవించాలన్న లక్ష్యంతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ ప్రభుత్వ వైద్యశాలలను అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. 

నగరంలో నివసిస్తున్న పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడం కోసమే బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. నగరంలో ఇప్పటికే 350 పైగా బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేసిన ఘనత టీఆర్‌ఎస్‌ ప్రభుత్వందేనన్నారు. పేదలు నివసిస్తున్న ప్రతి బస్తీకి అందుబాటులో బస్తీ దవాఖాన అందుబాటులోకి వస్తుందన్నారు. అలాగే రాష్ట్ర ప్రభుత్వం పేదల ఆరోగ్యం కోసం వైద్యశాలలలో మెరుగైన సౌకర్యాలను అందుబాటులోకి తెస్తుందన్నారు.

 సీఎం రిలీఫ్‌ ఫండ్‌, ఆరోగ్యశ్రీ ద్వారా పేదలందరికీ వైద్య సేవలందించడంలో ప్రభుత్వం ఆదర్శంగా పనిచేస్తుందని తెలిపారు. ఈ వైద్యశాలలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ఎమ్మెల్సీ కుర్మయ్యగారి నవీన్‌కుమార్‌, మేడ్చల్‌ కలెక్టర్‌ వాసం వెంకటేశ్వర్లు, మూసాపేట సర్కిల్‌ ఉప కమిషనర్‌ కె.రవికుమార్‌, కేపీహెచ్‌బీ కాలనీ కార్పొరేటర్‌ మందడి శ్రీనివాస్‌రావు, డీఎంహెచ్‌వో వీరాంజనేయులు, బాలానగర్‌ ఆరోగ్య కేంద్రం డాక్టర్‌ చందర్‌, బస్తీ దవాఖాన వైద్యురాలు పూజారెడ్డి తదితరులు పాల్గొన్నారు.