శుక్రవారం 27 నవంబర్ 2020
Telangana - Nov 13, 2020 , 21:41:09

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా: బస్వరాజు సారయ్య

సీఎం కేసీఆర్‌కు రుణపడి ఉంటా: బస్వరాజు సారయ్య

వరంగల్‌: అత్యంత వెనుకబడిన వర్గాలకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ గొప్ప గుర్తింపు ఇచ్చారని గవర్నర్‌ కోటాలో ఎమ్మెల్సీగా అవకాశం దక్కిన బస్వరాజు సారయ్య పేర్కొన్నారు. ఎంబీసీ వర్గం వారికి ఎమ్మెల్సీగా అవకాశం కల్పించి సీఎం గొప్ప నిర్ణయం తీసుకున్నారని, రాష్ట్ర రాజకీయాల్లో ఇది కొత్త మలుపు అని చెప్పారు. సీఎం కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయంతో దక్షిణ భారతదేశంలోని రాజకీయాల్లో ఎంబీసీలకు ప్రాధాన్యత పెరుగుతుందని అభిప్రాయపడ్డారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలతో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్న కేసీఆర్‌ రాజకీయ సామాజిక న్యాయం విషయంలోనూ ఇదే పంథాలో ఉన్నారన్నారు. 

టీఆర్‌ఎస్‌లో అన్ని వర్గాల వారికి గుర్తింపు దక్కుతుందని, తనకు వచ్చిన అవకాశమే దీనికి నిదర్శమని చెప్పుకొచ్చారు. బీసీ వర్గాల అభ్యున్నతి కోసం టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఎన్నో సంక్షేమ పథకాలను అమలుచేస్తోందని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలోనే కులవృత్తిదారులు ఆర్థికంగా బలోపేతం కావడమే గాక వారికి రాజకీయంగానూ గుర్తింపు దక్కుతోందన్నారు. టీఆర్‌ఎస్‌ సర్కారు అమలుచేస్తున్న పథకాలతో వెనుకబడిన వర్గాల వారికి ఎక్కువగా మేలు జరుగుతోందని చెప్పారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ను నమ్ముకుని వచ్చినందుకు గొప్ప అవకాశం ఇచ్చారని సంతోషం వ్యక్తం చేసిన రాజకీయంగా కొత్త జీవితం ఇచ్చిన సీఎం కేసీఆర్‌కు, టీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. చిత్తశుద్ధితో పనిచేసి సీఎం కేసీఆర్‌ నమ్మకాన్ని నిలబెడతానని చెప్పారు.