గురువారం 09 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 03:41:42

రూ.15 లక్షలు లంచం తీసుకుంటుండగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌

రూ.15 లక్షలు లంచం తీసుకుంటుండగా రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ అరెస్ట్‌

  • ఏసీబీకి చిక్కిన షేక్‌పేట్‌ తాసిల్దార్‌ 
  • రాజీకి 30 లక్షలు డిమాండ్‌
  • ఇదే కేసులో 1.5 లక్షలు తీసుకున్న బంజారాహిల్స్‌ ఎస్‌ఐ
  • తాసిల్దార్‌ ఇంట్లో 30 లక్షలు, ఆభరణాలు స్వాధీనం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ/బంజారాహిల్స్‌/చిక్కడపల్లి: ఓ భూమి విషయంలో రాజీకోసం రూ.15 లక్షలు లంచం తీసుకుంటూ హైదరాబాద్‌ షేక్‌పేట్‌ రెవెన్యూ అధికారులు శనివారం ఏసీబీకి చిక్కారు. ఈ కేసులో రెవెన్యూ ఇన్‌స్పెక్టర్‌ (ఆర్‌ఐ) కందాల నాగార్జునరెడ్డి రెడ్‌హ్యాండెడ్‌గా దొరుకగా, తాసిల్దార్‌ సుజాత ఇంట్లో మరో రూ.30 లక్షలు నగదు, బంగారు ఆభరణాలు లభించాయి. ఇదే వివాదంలో బంజారాహిల్స్‌ ఎస్‌ఐ రవీందర్‌ రూ.1.5 లక్షలు తీసుకున్నట్టు తేలిం ది. దీంతో ఏసీబీ అధికారులు తాసిల్దార్‌ను అదుపులోకి తీసుకొని ఆర్‌ఐ, ఎస్‌ఐలను అరెస్ట్‌చేశారు. బంజారాహిల్స్‌ రోడ్‌ నంబర్‌ 14లో 4,865 చదరపు అడుగుల స్థలాన్ని తన తండ్రి 1969లో కొనుగోలు చేశారని, ఆ భూమిని సర్వేచేసి వివరాలను ఆన్‌లైన్‌లో నమోదు చేయాలంటూ సయ్యద్‌ అబ్దుల్‌ ఖాలిద్‌ షేక్‌పేట్‌ తాసిల్‌ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నా రు.

ఇది ప్రభుత్వ భూమి అని, సర్వేచేయడం కుదరదని తాసిల్దార్‌ సుజాత తేల్చడంతో బాధితుడు హైకోర్టును ఆశ్రయించారు. కోర్టు స్టే ఇవ్వగా, రూ.40 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆక్రమించుకోవడానికి సయ్యద్‌ ఖాలిద్‌ ప్రయత్నిస్తున్నారంటూ తాసిల్దార్‌ ఫిర్యాదుచేశారు. దీంతో బంజారాహిల్స్‌ ఠాణాలో రెండు కేసులు నమోదయ్యాయి. ఈ భూ వివాదంలో రాజీ కుదిర్చేందుకు నాగార్జునరెడ్డి ద్వారా తాసిల్దార్‌ రూ.30 లక్షలు లంచం డిమాండ్‌చేసింది. దీంతో బాధితుడు ఏసీబీని ఆశ్రయించారు. అధికారుల సూచన మేరకు సయ్యద్‌ ఖాలిద్‌ శనివారం మధ్యాహ్నం షేక్‌పేట్‌ తాసిల్‌ కార్యాలయ సమీపంలో ఆర్‌ఐకి రూ.15 లక్షలు ఇచ్చారు. అక్కడే మాటువేసిన ఏసీబీ అధికారులు ఆర్‌ఐని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. ఇదే వివాదంలో రెవెన్యూ అధికారులతో రాజీ కుదిర్చి కేసులు లేకుండా చేస్తానంటూ బంజారాహిల్స్‌ ఎస్‌ఐ రవీందర్‌ రూ.3 లక్షలు డిమాండ్‌చేసి, రూ.1.5 లక్షలు తీసుకున్నారు.

మరో రూ.3 లక్షలు డిమాండ్‌ చేస్తున్నట్టు బాధితుడు ఏసీబీకి సమాచారమిచ్చారు. దీంతో ఏసీబీ అధికారులు ఆర్‌ఐ నాగార్జునరెడ్డి, ఎస్‌ఐ రవీందర్‌ను అరెస్ట్‌చేసి, ఏసీబీ ప్రత్యేక కోర్టులో హాజరుపరిచారు. కాగా, గాంధీనగర్‌లోని తాసిల్దార్‌ ఇంట్లో నిర్వహించిన సోదాల్లో ఇప్పటివరకు రూ.30 లక్షల నగదు, 10 తులాల బంగారు ఆభరణాలు, పలు కీలక పత్రాలు లభించాయి. సోదాలు కొనసాగుతున్నాయని, మరికొన్ని ఆధారాలు లభించే అవకాశం ఉన్నట్టు ఏసీబీ అధికారులు తెలిపారు. ఈ దాడుల్లో ఏసీబీ డీఎస్పీలు, అచ్చేశ్వర్‌రావు, శ్రీకాంత్‌, సీఐ రాజేశ్‌ తదితరులు పాల్గొన్నారు. సుజాత గతంలో ముషీరాబాద్‌, హిమాయత్‌నగర్‌ తాసిల్దార్‌గా పనిచేశారు.


logo