ఆదివారం 17 జనవరి 2021
Telangana - Nov 25, 2020 , 00:04:55

బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి ఊస్ట్‌?

బండి సంజయ్‌, కిషన్‌రెడ్డి ఊస్ట్‌?

  • బీజేపీలో తారస్థాయికి విభేదాలు
  • మూడు గ్రూపులుగా రాష్ట్ర పార్టీ నేతలు 
  • పదవుల నుంచి పలువుర్ని తప్పించే అవకాశం 
  • జీహెచ్‌ఎంసీ ఎన్నికలయ్యాక కీలక మార్పులు 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: బీజేపీలో ముసలం ముదిరింది. రాష్ట్ర నేతల మధ్య అంతర్గత విభేదాలు తారస్థాయికి చేరాయి. మూడు గ్రూపులుగా తయారై ఆధిపత్యం కోసం కొట్లాడుకుంటున్నారు. దాంతో కీలకమైన గ్రేటర్‌ ఎన్నికలను పక్కనబెట్టి.. నేతలు ఆధిపత్యపోరులో మునిగిపోవడాన్ని బీజేపీ అధిష్ఠానం తీవ్రంగా పరిగణిస్తున్నది. ఎన్నికలు పూర్తికాగానే కిషన్‌రెడ్డి, బండిసంజయ్‌ పదవులు పోవడం ఖాయమని తెలుస్తున్నది. ఈ మేరకు ఇప్పటికే జాతీయ నాయకత్వం నుంచి సమాచారం వచ్చినట్టు పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తున్నది. ప్రస్తుతం రాష్ట్ర పార్టీలోని నేతలు మూడు గ్రూపులుగా విడిపోయారు. పార్టీ బలోపేతాన్ని పక్కనపెట్టిన వీరు.. వ్యక్తిగత ఆధిపత్యంపై దృష్టి పెట్టినట్లు పార్టీ శ్రేణులే చెప్తున్నాయి. 

ఎవరికి వారే.. యమునా తీరే..

పార్టీ అధ్యక్షుడు బండి సంజయ్‌, మంత్రి శ్రీనివాసులు, గరికపాటి రామ్మోహన్‌రావు ఒక గ్రూపుగా తయారై.. పార్టీలో పాతకాపులుగా ఉన్న నేతలకు చెక్‌ పెడుతున్నట్లు తెలిసింది. వీరి ఆధిపత్యాన్ని అడ్డుకునేందుకు వైరివర్గాలుగా ఉన్న కిషన్‌రెడ్డి, డాక్టర్‌ లక్ష్మణ్‌, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, చింతల రామచంద్రారెడ్డి జతకట్టారు. ఎంపీ ధర్మపురి అర్వింద్‌, ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, రాజాసింగ్‌ ఇంకో గ్రూపుగా ఉంటున్నట్లు తెలుస్తున్నది. పార్టీలో తమ ఆధిపత్యాన్ని చాటుకోవాలని ఎవరికి వారు వ్యక్తిగత కార్యక్రమాలకు ప్రాధాన్యం కల్పిస్తూ.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల ప్రచారాన్ని పట్టించుకోవడం లేదని పార్టీ శ్రేణుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. నేతల మధ్య తలెత్తిన విభేదాలపై జాతీయ నాయకత్వానికి అందిన ఫిర్యాదులపై చర్చించిన అనంతరం.. పార్టీని గాడిలో పెట్టాలంటే కిషన్‌రెడ్డి, బండి సంజయ్‌ని వారి పదవుల నుంచి తప్పించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలియవచ్చింది.

ఒకరిపై మరొకరి ఫిర్యాదు

జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా అభ్యర్థుల ఎంపిక, టికెట్ల కేటాయింపులో కిషన్‌రెడ్డి, డాక్టర్‌ లక్ష్మణ్‌ తమ పట్ల వ్యవహరించిన తీరుపై ఆగ్రహంతో ఉన్న బండి సంజయ్‌.. వారిపై అమిత్‌షాకు ఫిర్యాదు చేసినట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. పార్టీ నేతలను కిషన్‌రెడ్డి కలుపుకుని పోవడంలేదని, పార్టీ అభివృద్ధిపై దృష్టి సారించడంలేదని అసంతృప్తితో ఉన్న జాతీయ నాయకత్వం.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల అనంతరం ఆయనను మంత్రి పదవి నుంచి తొలగించాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. అదేవిధంగా బండి సంజయ్‌ తన హోదాకు తగినట్లుగా వ్యవహరించడం లేదన్న అభిప్రాయంలో జాతీయ నాయకత్వం ఉన్నట్లు తెలుస్తున్నది. ముఖ్యంగా రాష్ట్ర కమిటీ ఏర్పాటు, అనుబంధ సంఘాల నియామకంలో ఏకపక్షంగా వ్యవహరించారని, బండి సంజయ్‌ తనను మోసం చేశారంటూ ఎమ్మెల్యే రాజాసింగ్‌ ఫిర్యాదు చేశారు. పార్టీ కోసం పనిచేసిన నాయకులను, కార్యకర్తలను పక్కన పెట్టి తన వర్గానికి పదవులు కట్టబెట్టడంతో పార్టీ శ్రేణులు అసంతృప్తికి గురవుతున్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన కేంద్ర నాయకత్వం.. గ్రేటర్‌ ఎన్నికల అనంతరం పార్టీ ప్రక్షాళనపై దృష్టిసారించాలన్న నిర్ణయానికి వచ్చినట్టు సమాచారం.

రాష్ట్ర బీజేపీ నేతలపై అమిత్‌షా ఆగ్రహం!
ప్రచారంలో మాటలు జారవద్దని హితవు 
హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌ ఎన్నికల్లో రాష్ట్ర బీజేపీ నాయకుల తీరుపై జాతీయ నాయకత్వం అసంతృప్తి వ్యక్తం చేసింది. జీహెచ్‌ఎంసీ ఎన్నికల సందర్భంగా కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జీ కిషన్‌రెడ్డి, ఓబీసీ చైర్మన్‌ డాక్టర్‌ 
కే లక్ష్మణ్‌తో పాటు రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ఎంపీ ధర్మపురి అరవింద్‌, ఎమ్మెల్యేలు రఘునందన్‌రావు, రాజాసింగ్‌ చేస్తున్న వ్యాఖ్యలు, ప్రకటనలు బాధ్యతారహితంగా ఉంటున్నాయని కేంద్ర హోంశాఖమంత్రి అమిత్‌షా తలంటు పోసినట్లు  తెలిసింది. ఇష్టానుసారంగా మాట్లాడుతూ ప్రజల్లో పార్టీని చులకన చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైన తర్వాత బండి సంజయ్‌  చేసిన చార్మినార్‌ పర్యటన, అనంతరం సీఎం కేసీఆర్‌పై చేసిన చౌకబారు వ్యాఖ్యలపై అమిత్‌షా మందలించినట్లుగా సమాచారం. ఎన్నికల ప్రచారంలో హుందాగా, బాధ్యతాయుతంగా మాట్లాడి ఓటర్లను ఆకట్టుకోవాలని పార్టీ నేతలకు సూచించినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. కేంద్ర ప్రభుత్వ నిధుల విషయంలో పార్టీ నేతలు చెప్పిన అంశాలకు విరుద్ధంగా కిషన్‌రెడ్డి మాట్లాడటం పట్ల ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి వ్యతిరేకంగా మాట్లాడిన తాజా ఎమ్మెల్యే రఘనందన్‌రావు మాటలు, పార్టీ అధ్యక్షుడిపై మాట్లాడినట్లు విడుదలైన రాజాసింగ్‌ ఆడియోపై తలంటు పోసినట్లు పార్టీ నేతలు చర్చించుకుంటున్నారు. ఎంపీ ధర్మపురి అరవింద్‌ను కూడా చాలా జాగ్రత్తగా మాట్లాడాలని, మాటలు జారి పార్టీని ఇబ్బందుల్లోకి నెట్టవద్దని అమిత్‌షా చెప్పినట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.