సోమవారం 18 జనవరి 2021
Telangana - Nov 25, 2020 , 01:07:15

బండి.. బడాయి మానుకో

బండి.. బడాయి మానుకో

  • నిధులు తేలేమని కిషన్‌రెడ్డి కుండబద్దలు కొట్టారు కదా?
  • హైదరాబాద్‌ ఏం పాపం చేసిందని మొండిచెయ్యి చూపిండ్రు
  • ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీశ్‌

యూపీఏ యూపీఏ తీసుకువచ్చిన ఐటీఐఆర్‌ను బీజేపీ ప్రభుత్వం రద్దు చేసింది. దీంతో గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలోని యువత 4 లక్షల ఉద్యోగాలను కోల్పోయింది. మోదీ ప్రభుత్వం బీహెచ్‌ఈఎల్‌, ఓడీఎఫ్‌, ఎల్‌ఐసీ వంటి కేంద్ర సంస్థలను ఆగం చేసింది. బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి 50 వేల ఉద్యోగాలు ఊడబీకారు. 

సంగారెడ్డి ప్రతినిధి, నమస్తే తెలంగాణ: ఏదంటే అది ఇస్తామంటూ ఝూటా మాటలతో జీహెచ్‌ఎం సీలో ఓట్లు పొందాలని చూస్తున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కి ఆ పార్టీ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి గుణపాఠం చెప్పారని ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. కేంద్రం నుంచి నిధు లు తేలేమని స్వయంగా కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి ఓ వైపు స్పష్టంచేసినా.. బండి సంజయ్‌ మాత్రం కారు పోతే కారు.. బైకు పోతే బైకు ఇస్తామని ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు. మంగళవారం జీహెచ్‌ఎంసీలోని భారతీనగర్‌, రామచంద్రాపురం, పటాన్‌చెరు డివిజన్లలో వేల మంది యువకులతో నిర్వహించిన బైక్‌ ర్యాలీలో పాల్గొన్నారు. అనంతరం పటాన్‌చెరు జీఎంఆర్‌ కన్వెన్షన్‌లో జరిగిన యువ సమ్మేళనంలో హరీశ్‌రావు ప్రసంగించారు. వరదలతో నష్టపోయిన బెంగళూరుకు రూ.600 కోట్లు, గుజరాత్‌కు రూ.400 కోట్లు ఇచ్చిన ప్రధాని మోదీ.. మరీ హైదరాబాద్‌కు ఎందుకు ఇవ్వలేదని సూటిగా ప్రశ్నించారు. ఢిల్లీ నుంచి డబ్బులు రావనే విషయాన్ని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి మాటలను గ్రేటర్‌ ప్రజలు గుర్తిస్తే మంచిదన్నారు. గ్రేటర్‌లో వరదలకు నష్టపోయిన కుటుంబాలకు రూ.10 వేల చొప్పున సాయాన్ని తెలంగాణ ప్రభుత్వం అందిస్తుంటే, బీజేపీ నేతలు అడ్డుకున్నారని మండిపడ్డారు. యూపీఏ తీసుకొచ్చిన ఐటీఐఆర్‌ను బీజేపీ ప్రభుత్వం రద్దు చేయడం అన్యాయమన్నారు. ఐటీఐఆర్‌ రద్దుతో జీహెచ్‌ఎంసీలోని యువత 4 లక్షల ఉద్యోగాలను కోల్పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. మోదీ ప్రభుత్వం బీహెచ్‌ఈఎల్‌, ఓడీఎఫ్‌, ఎల్‌ఐసీ వంటి కేంద్ర సంస్థలను ఆగం చేసిందన్నారు. బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి 50 వేల ఉద్యోగాలు ఊడబీకారని, ఏడాదికి కోటి ఉద్యోగాలిస్తామని చెప్పిన మోదీ.. ఉన్న ఉద్యోగాలను తీసేస్తున్నాడని విమర్శించారు. పెద్ద నోట్ల రద్దుతో నల్లధనం మొత్తం బ్యాంకులకు తిరిగి వస్తుందని, తరువాత ఒక్కొక్కరి ఖాతాలో రూ.15 లక్షల చొప్పున వేస్తామని చెప్పిన మోదీ, ఇప్పటివరకు ఎంతమంది ఖాతాల్లో వేశారో చెప్పాలని ఆయన బీజేపీ నాయకులను ప్రశ్నించారు.

రాష్ట్రానికి తరలివస్తున్న పరిశ్రమలు..

సీఎం కేసీఆర్‌ సారథ్యంలోని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ప్రోత్సాహంతో రాష్ట్రానికి పెద్ద ఎత్తున పరిశ్రమలు వస్తున్నాయని మంత్రి హరీశ్‌రావు అన్నారు. పరిశ్రమల రాకతో యువతకు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయన్నారు. ప్రధానంగా జీహెచ్‌ఎంసీలో యువతకు ఉపాధి దొరుకుతుందన్నారు. పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగావకాశాలు కల్పించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. పటాన్‌చెరులోని ఉస్మాన్‌పూర్‌లో 400 ఎకరాల్లో ఐటీ, సుల్తాన్‌పూర్‌లో మెడికల్‌ డివైజ్‌ పార్క్‌ లు ఏర్పాటయ్యాయన్నారు. ఇక్కడికి ఇప్పటికే 200 వరకు పరిశ్రమలు వచ్చాయన్నారు. శివనగర్‌లో కూడా ఎల్‌ఈడీ పార్క్‌ వచ్చిందని, ఇక్కడ పరిశ్రమలు నెలకొల్పడానికి పెట్టుబడులతో ముందుకు వస్తున్నారని చెప్పారు. 

గ్రేటర్‌లో ఇక ఉచితంగా నీటి సరఫరా..

గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 20 వేల లీటర్లలోపు మంచినీరు వాడుకునే వారికి ఇక ఎలాంటి బిల్లు చెల్లింపులు ఉండవని మంత్రి హరీశ్‌రావు తెలిపారు. ప్రజల బాధలు తెలిసిన ముఖ్యమంత్రి కేసీఆర్‌ అద్భుతమైన వరాలు కురిపించారన్నారు. నాయీబ్రాహ్మణులు, రజకులకు ఫ్రీ కరెంట్‌ సరఫరా, 6 నెలల పన్ను రాయితీతో క్యాబ్‌, ట్యాక్సీ డ్రైవర్లు ఎంతో సంతోషిస్తున్నారన్నారు. చిన్న పరిశ్రమలకు ఫిక్స్‌డ్‌ విద్యుత్‌ చార్జీలను కూడా సర్కార్‌ రద్దు చేయడం శుభపరిణామమన్నారు. చిన్న పరిశ్రమల యాజమాన్యాలకు ఈ ప్రకటన పెద్ద ఊరట అన్నారు. గ్రేటర్‌ పరిధిలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థ్ధులు భారీ మెజార్టీతో విజయం సాధిస్తారని మంత్రి హరీశ్‌రావు ధీమా వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో మెదక్‌ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గూడెం మహిపాల్‌రెడ్డి, చంటి క్రాంతికిరణ్‌, ఎఫ్‌డీసీ చైర్మన్‌ వంటేరు ప్రతాప్‌రెడ్డి, టీఆర్‌ఎస్వీ యువ నాయకులు, కార్పొరేటర్‌ అభ్యర్థులు సింధూ ఆదర్శరెడ్డి, పుష్పానగేశ్‌యాదవ్‌, మెట్టు కుమార్‌ యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.