ఆదివారం 25 అక్టోబర్ 2020
Telangana - Oct 06, 2020 , 02:27:44

గ్రేటర్‌లో బ్యాలెట్‌ బ్యాటిల్‌

గ్రేటర్‌లో బ్యాలెట్‌ బ్యాటిల్‌

  • యూఎల్బీ ఎన్నికల్లోనూ వాటితోనే.. 
  • రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయం

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) ఎన్నికలను బ్యాలెట్‌ పేపర్లతో నిర్వహించనున్నారు. అర్బన్‌ లోకల్‌ బాడీస్‌ (యూఎల్బీ) ఎన్నికల్లోనూ బ్యాలెట్‌లనే వినియోగించనున్నారు. కరోనా మహమ్మారిని దృష్టిలో ఉంచుకొని మెజార్టీ రాజకీయ పార్టీల అభిప్రాయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) ప్రకటించింది. ఎన్నికలను బ్యాలెట్‌ పత్రాలతో చేపట్టాలా లేక ఈవీఎంలతో నిర్వహించాలా అనే అంశంపై జీహెచ్‌ఎంసీ అధికారులతో చర్చలు జరిపిన ఎస్‌ఈసీ.. అభిప్రాయం చెప్పాలంటూ గతంలోనే అన్ని రాజకీయ పార్టీలకు లేఖ రాసింది. గుర్తింపు పొందినవి, రిజిస్టరై గుర్తు కేటాయించనివి మొత్తం రాజకీయ పార్టీలు 50 ఉండగా, వాటిలో 26 పార్టీలు తమ అభిప్రాయాన్ని వెల్లడించాయి. అందులో ఈవీఎంలు కావాలని 3 పార్టీలు, బ్యాలెట్‌ను వినియోగించాలని 16 పార్టీలు సూచించాయి. మరో 7 పార్టీలు ఏదైనా పర్వాలేదు అని అభిప్రాయపడ్డాయి. మెజార్టీ పార్టీలు బ్యాలెట్‌ పత్రాలతోనే ఎన్నికలు నిర్వహించాలనే అభిప్రాయాన్ని వ్యక్తంచేశాయని, వాటిని పరిగణనలోకి తీసుకొనే తుది నిర్ణయానికి వచ్చామని ఎస్‌ఈసీ వెల్లడించింది.

ఈవీఎంలతో రిస్క్‌

ఈవీఎంలు, వీవీప్యాట్లతో ఎన్నికలు నిర్వహించాలంటే మొదటి దశ చెకింగ్‌, రెండోదశ చెకింగ్‌, ఈవీఎంల ర్యాండమైజేషన్‌, కేటాయింపు ఇలా వివిధ దశలు చేపట్టాల్సి ఉంటుంది. ఇంజినీర్లు, రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఎన్నికల సిబ్బందితోపాటు ఈవీఎంల క్లీనింగ్‌, ప్యాకింగ్‌కు భారీ సంఖ్యలో సిబ్బంది అవసరమవుతారు. వీరంతా ఒకే దగ్గర క్లోస్డ్‌ ఎన్విరాన్‌మెంట్‌లో పనిచేయాల్సి ఉంటుంది. ప్రస్తుత కరోనా పరిస్థితుల్లో ఈ కార్యక్రమాల నిర్వహణ ప్రమాదకరమని, వీటన్నింటితో పోలిస్తే బ్యాలెట్‌ బాక్సులే మేలని అధికారులు భావిస్తున్నారు.


logo