సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 02, 2020 , 01:10:51

వ్యవసాయాన్ని పండుగచేశాం

వ్యవసాయాన్ని పండుగచేశాం
  • కాళేశ్వరం నీళ్లతో రైతుల కాళ్లు కడుగుతున్నం
  • రైతుల పట్ల కాంగ్రెస్‌ది మొసలి కన్నీరు
  • ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ మండిపాటు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: వ్యవసాయాన్ని కాంగ్రెస్‌ దండుగలాగా మారిస్తే.. పండుగలాగా చేసిన ఘనచరిత్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని ప్రభుత్వ విప్‌ బాల్క సుమన్‌ పేర్కొన్నారు. తెలంగాణ రైతుల కన్నీళ్లు తుడిచి, కాళేశ్వరం నీళ్లతో వారి కాళ్లు కడుగుతున్న చరిత్ర టీఆర్‌ఎస్‌ ప్రభుత్వానిదని చెప్పారు. ఆదివారం తెలంగాణభవన్‌లో పెద్దపల్లి ఎంపీ వెంకటేశ్‌ నేతకాని, ఎమ్మెల్సీ ఎం శ్రీనివాస్‌రెడ్డి, టీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి గట్టు రాంచందర్‌రావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ.. తెలంగాణ సీఎంగా కేసీఆర్‌ బాధ్యతలు స్వీకరించిన తర్వాత కాళేశ్వరం ఎత్తిపోతలు నిర్మించి గోదావరి జలాలను రైతుల పోలాలకు మళ్లించిన చరిత్ర టీఆర్‌ఎస్‌ది, తమ ప్రభుత్వానిదని చెప్పారు. కాంగ్రెస్‌ హయాంలో రైతులకు సకాలంలో ఎరువులు, విత్తనాలు లభించక ఇబ్బందులు పడ్డారని, అలాంటి కాంగ్రెస్‌ పార్టీ ఇప్పుడు రైతుల పట్ల మొసలి కన్నీరు కారుస్తున్నదని దుయ్యబట్టారు. నిజమైన రైతు నేస్తం, రైతు పక్షపాతి కేసీఆర్‌ అని కొనియాడారు. 


రేవంత్‌పై కఠినచర్యలు తీసుకోవాలి

కాంగ్రెస్‌ ఎంపీ రేవంత్‌రెడ్డి వైఖరి నవ్విపోదురుగాక నాకేంటి సిగ్గు అన్నట్టుగా ఉన్నదని బాల్క సుమన్‌ ఆరోపించారు. రేవం త్‌ భూదందాపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. చేసిన తప్పునకు క్షమాపణలు చెప్పాలని, బలవంతంగా తీసుకొన్న భూములను వెనక్కి ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.


logo