మంగళవారం 24 నవంబర్ 2020
Telangana - Nov 23, 2020 , 02:34:37

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చొరవతో..

ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చొరవతో..

  • మలేషియా నుంచి బాలరవీందర్‌ మృతదేహం

నిజామాబాద్‌ రూరల్‌: ఉపాధి కోసం మలేషియా వెళ్లిన నిజామాబాద్‌ నగర శివారులోని గూపన్‌పల్లికి చెందిన ఓ వ్యక్తి గుండెపోటుతో మరణించాడు. ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చొరవ తీసుకోవడంతో మృతదేహం ఆదివారం స్వగ్రామానికి చేరుకున్నది. బాలరవీందర్‌(46) ఈ ఏడాది జనవరిలో మలేషియా వెళ్లాడు. కొన్ని రోజులకే కరోనా వైరస్‌ ప్రభావంతో ఉపాధి కోల్పోయాడు. తీవ్ర మనస్తాపంతో ఉన్న బాలరవీందర్‌ అక్టోబర్‌ 24న గుండెపోటుతో మృతి చెందాడు. అప్పులతో కొట్టుమిట్టాడుతున్న ఆ కుటుంబానికి మృతదేహాన్ని తెప్పించే పరిస్థితి లేకపోవడంతో.. ఈ విషయం తెలంగాణ జాగృతి ప్రధాన కార్యదర్శి నవీన్‌ ఆచారి ద్వారా ఎమ్మెల్సీ కవిత దృష్టికి వెళ్లింది. తక్షణమే స్పందించిన ఆమె.. మలేషియాలోని భారత రాయబార కార్యాలయ అధికారులతో ఫోన్‌ ద్వారా మాట్లాడి.. బాలరవీందర్‌ మృతదేహాన్ని రప్పించే విషయంలో తగు చర్యలు తీసుకోవాలని కోరారు. మలేషియా తెలుగు అసోసియేషన్‌ అధ్యక్షుడు తిరుపతికి కూడా ఫోన్‌చేసి మృతదేహం స్వగ్రామానికి వచ్చేలా చూడాలన్నారు. అవసరమైన పత్రాలను తిరుపతి సమర్పించడంతో రవీందర్‌ మృతదేహం ఆదివారం ఉదయం హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయానికి చేరుకున్నది. అక్కడి నుంచి గూపన్‌పల్లికి భౌతికకాయం చేరేలా ఎమ్మెల్సీ కవిత అంబులెన్స్‌ సమకూర్చారు.