సోమవారం 19 అక్టోబర్ 2020
Telangana - Sep 29, 2020 , 18:28:05

హైదరాబాద్‌ శివారులో సిద్ధమవుతున్న బద్రీనాథ్‌ ఆలయం

 హైదరాబాద్‌ శివారులో సిద్ధమవుతున్న బద్రీనాథ్‌ ఆలయం

హైదరాబాద్‌ : చార్‌ ధామ్‌ యాత్రలో ప్రసిద్ధమైన బద్రీనాథ్‌ ఆలయాన్ని సందర్శించుకునేందుకు చాలా మంది భక్తులు ఎన్నో కష్టాలకోర్చి ఉత్తరాఖండ్‌ వెళ్తుంటారు. రానున్న రోజుల్లో బద్రీనాథుడ్ని హైదరాబాద్‌ నగర శివారులోనే దర్శించుకునేందుక వీలు చిక్కనున్నది. నగర శివారులోని మేడల్చ్‌ పట్టణం సమీపంలో ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌ ఆలయాన్ని పోలిన ఆలయాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం 80 శాతం పనులు పూర్తయ్యాయి. మరొ రెండు, మూడు నెలల్లో భక్తులు దర్శించుకునేందుకు వీలుగా పనులు పూర్తిచేసేందుకు ఉత్తరాఖండ్‌ సంక్షేమ సంస్థ చర్యలు తీసుకుంటున్నది.

ఉత్తరాఖండ్‌ రాష్ట్రానికి చెందిన సుమారు 6 వేల కుటుంబాలు హైదరాబాద్‌కు వలస వచ్చి వివిధ పనులు చేసుకుని జీవిస్తున్నారు. వీరు తమ ఆరాధ్య దైవమైన బద్రీనాథ్‌ను చూసేందుకు వెళ్లాలంటే ఇక్కడ పనులు మానుకోవాల్సి వస్తుంది. అలాగే చాలా మొత్తంలో ఖర్చు చేయాల్సి వస్తున్నది. దీనిని దృష్టిలో పెట్టుకుని ఉత్తరాఖండ్‌ సంక్షేమ సంస్థగా ఏర్పాటైన వారు.. ఇక్కడే బద్రీనాథ్‌ ఆలయాన్ని నిర్మించేందుకు నడుం బిగించారు. రూ.60 లక్షల వ్యయంతో మేడ్చల్‌ సమీపంలో బద్రీనాథ్‌ ఆలయాన్ని కట్టేందుకు తలా ఇంతా చందాలు వేసుకుని పనులు మొదలెట్టారు. లాక్‌డౌన్‌ కారణంగా నిర్మాణ పనులు మందగించాయి. ఆలయ ప్రధాన వాస్తుశిల్పి రోషన్‌ సింగ్‌ నేగి, అతని సహచరుడు బల్వీర్‌ ప్రసాద్‌ పానులి దగ్గరుండి మరీ ఆలయ నిర్మాణ పనులను పర్యవేక్షిస్తున్నారు. వీరిద్దరూ మాజీ సైనికులు కావడం విశేషం. అనిల్‌ చంద్ర పునేత, రాజీవ బెంజ్వాల్‌ ప్రధాన పోషకులుగా ఉన్నారు. పలువురు భక్తులు కూడా విరాళాలు ఇస్తున్నారని, ఈ ఏడాది చివరికల్లా నిర్మాణం పనులు పూర్తిచేసి అందుబాటులోకి తేవడానికి కృషిచేస్తున్నామని సంస్థ అధ్యక్షుడు విక్రమ్‌ సింగ్‌ ఉనాల్‌ చెప్పారు. ఉత్తరాఖండ్‌లోని బద్రీనాథ్‌ ఆలయం శీతాకాలంలో మూసివేస్తారని, అయితే ఇక్కడ మాత్రం ఏడాది పొడవునా తెరిచివుంచుతామని తెలిపారు. ఉత్తరాఖండ్‌ బద్రీనాథ్‌ ధామ్‌లో జరుపుతున్న అన్ని ఉత్సవాలు, ఆరాధనలు, కార్యక్రమాలు ఇక్కడ కూడా చేపడతామని వెల్లడించారు.

6750 చదరపు అడుగుల విస్తీర్ణంలో.. 

బద్రీనాథ్ ఆలయాన్ని 6,750 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. ఈ ఆలయం రెండు అంతస్తులతో ఉంటుంది. దీని ఎత్తు 50 అడుగులు ఉంటుంది. ఈ ఆలయం యొక్క గ్రౌండ్ ఫ్లోర్‌లో నిర్మించిన గ్రాండ్ హాల్‌లో సుమారు 350 మందికి కూర్చునేలా సిద్ధం చేస్తున్నారు. మొదటి అంతస్తులో బద్రీనాథ్ తన బద్రీష్ పంచాయతీతో కూర్చుంటారు. తన పంచాయతీలో బద్రీనాథ్‌తోపాటు గణపతి, కుబేరుడు, బలరాముడు, మాతా లక్ష్మీ, నర-నారాయణ, నారద ముని, గరుడ విగ్రహాలను ఇక్కడ యోగముద్రలో ఏర్పాటు చేస్తారు. గణపతి, మాతా లక్ష్మీ, నవగ్రహాలకు ప్రత్యేక ఆలయాలు కూడా నిర్మించనున్నారు. ఆలయం సమీపంలో 7,200 చదరపు అడుగుల విస్తీర్ణంలో కమ్యూనిటీ హాల్ నిర్మిస్తున్నారు. రాజేంద్ర ప్రసాద్ దోవల్ అనే పెద్దాయన ఈ ఆలయానికి 1800 చదరపు అడుగుల భూమిని విరాళంగా ఇచ్చారు. ఇక్కడ గోశాలతోపాటు ఆలయంలో పనిచేసే వారికి బస ఏర్పాటు చేయనున్నారు.


logo