ఆదివారం 29 మార్చి 2020
Telangana - Mar 01, 2020 , 08:21:10

నకిలీ ఈమెయిల్‌తో కస్టమర్లకు తప్పుడు సమాచారం

నకిలీ ఈమెయిల్‌తో కస్టమర్లకు తప్పుడు సమాచారం

హైదరాబాద్ : ఓ కెమికల్‌ కంపెనీ మేనేజర్‌ పేరుతో నకిలీ ఈమెయిల్‌ తయారు చేసి, ఆ కంపెనీలో ఉత్పత్తి అవుతున్న వస్తువులు నాణ్యత లేవంటూ ఆ సంస్థ కస్టమర్లకు ఓ గుర్తు తెలియని వ్యక్తి ఈ మెయిల్‌ చేయడంతో సంస్థ ప్రతినిధులు హైదరాబాద్‌ సీసీఎస్‌ సైబర్‌క్రైమ్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టిన పోలీసులు ఆ సంస్థలో పనిచేసిన మాజీ ఉద్యోగి అలా చేసినట్లు గుర్తించారు. వసంత్‌ కెమికల్స్‌ కంపెనీ హైదరాబాద్‌ జీడిమెట్ల, ఏపీలోని అచ్యూతపురంలోని సెజ్‌లో మరోశాఖ ఉంది. ఈనెల 20న సెజ్‌ లో పనిచేసే జనరల్‌ మేనేజర్‌ ఒకరి పేరులోని అక్షరాలతో ఎంవీఎస్‌ఆర్‌420 యాహు.కామ్‌ ఒక ఈమెయిల్‌ ఐడీ తయారు చేసి, దాని ద్వారా బెల్జియంలోని ఆ కంపెనీ కస్టమర్‌కు మెయిల్‌ చేశాడు. అందులో వసంత్‌ కంపెనీ ఉత్పత్తుల్లో నాణ్యత లేవని ఆరోపిస్తూ ఆ మెయిల్‌ చేశాడు, ఆ కంపెనీ వ్యాపారాని దెబ్బకొట్టాలనే ఉద్దేశంతో ఆ మెయిల్‌ పంపించాడు. బెల్జియం నుంచి సదరు వినియోగదారుడు విషయాన్ని సంస్థ ప్రతినిధులకు తెలపడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తు చేపట్టిన ఇన్‌స్పెక్టర్‌ మోహన్‌రావు బృం దం నిందితుడు ఆ సంస్థలో పనిచేసిన శ్రీనివాసుల్‌రెడ్డి ఇదంతా చేసినట్లు నిర్ధారించారు. కంపెనీలో క్వాలీ కంట్రోల్‌ మేనేజర్‌గా పనిచేసి మానేసిన శ్రీనివాసులురెడ్డి, అక్కడున్న మేనేజర్‌పై కోపంతో అతడిని ఇరుక్కున పెట్టేందుకు నకిలీ ఈమెయిల్‌ తయారు చేసి, దాని ద్వారా తప్పుడు సమాచారం పంపించినట్లు ఒప్పుకున్నాడు. ఈ మేరకు శ్రీనివాసులురెడ్డిని విచారించిన ఇన్‌స్పెక్టర్‌ అతడికి నోటీసులు జారీ చేశారు.


logo