ఆదివారం 12 జూలై 2020
Telangana - Jun 06, 2020 , 03:32:14

కొవ్వు కరుగుతలె

కొవ్వు కరుగుతలె

  • రక్తంలో పేరుకుపోతున్న చెడు కొలెస్ట్రాల్‌ 
  • తెలుగు ప్రజలకు అనారోగ్య ముప్పు
  • ఫలితంగా గుండెపోట్లు, మెదడు రోగాలు 
  • ఆహారపు అలవాట్లు మారాల్సిందే
  • ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఎన్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆవుల లక్ష్మయ్య హెచ్చరిక

హైదరాబాద్‌ సిటీబ్యూరో, నమస్తే తెలంగాణ: చెమట బొట్టు రాల్తలేదు. ఒంట్లో కొవ్వు కరుగుతలేదు. కష్టపడుమంటే కష్టమే అంటున్నం. కూర్చున్నకాడికే అన్నీ రావాలంటున్నం. ఏది పడితే అది తింటూ పెయ్యిని రోగాల పుట్టగా మార్చుకుంటున్నం. గుండెపోటు, మెదడు సంబంధిత రోగాలు అంటూ దవాఖానల చుట్టూ తిరుగుతున్నం. ఇలా ఆహారపు అలవాట్లు మార్చుకోకుండా, శరీరాన్ని కష్టపెట్టకుండా ఆరోగ్యంగా బతకాలంటే కుదరదు అంటున్నరు డాక్టర్లు. శరీరంలో కొవ్వు శాతంపై ప్రపంచవ్యాప్తంగా 200 దేశాల్లోని 102.6 మిలియన్ల మందిని పరీక్షించగా మరిన్ని షాకింగ్‌ విషయాలు తెలిశాయి. తెలుగు ప్రజల్లో చెడు కొవ్వు శాతం ఎక్కువగానే ఉంటున్నదట. జాతీయ వైద్య పరిశోధన మండలి(ఐసీఎంఆర్‌)-జాతీయ పోషకాహార సంస్థ (ఎన్‌ఐఎన్‌) చేసిన పరిశోధనలో ఈ విషయం వెల్లడైంది. 

తెలుగు రాష్ర్టాల ప్రజల్లో చెడు కొవ్వు శాతం ఎక్కువగా ఉన్నట్టు తేలిందని ఐసీఎంఆర్‌-ఎన్‌ఐఎన్‌ సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ ఆవుల లక్ష్మయ్య తెలిపారు. మంచి కొలెస్ట్రాల్‌ విషయానికి వస్తే తెలుగు రాష్ర్టాల్లో చేసిన అధ్యయనం ప్రమాదకరంగా ఉందని అన్నారు. హెచ్‌డీఎల్‌ (హై డెన్సిటీ లిపో ప్రొటీన్‌) డెసీ లీటర్‌కు 40 మిల్లీ గ్రాములు ఉండాలని, కానీ కేవలం 18 శాతం పురుషులు, 13 శాతం మహిళల్లోనే ఈ స్థాయి ఉన్నదని ఆయన చెప్పారు. ఎల్‌డీఎల్‌ (లో డెన్సిటీ లిపో ప్రొటీన్‌) విషయానికి వస్తే ప్రతి మనిషిలో డెసీ లీటరులో 130 మిల్లీగ్రాములకు తక్కువగా ఉండాలని తెలిపారు. అలా మోతాదుకు తగినట్టు 24 శాతం మంది పురుషులు, 25 శాతం మంది మహిళల్లోనే ఉన్నట్లు వెల్లడించారు. 

తెలుగు రాష్ర్టాల్లోనే కాకుండా దేశవ్యాప్తంగానూ చెడు కొలెస్ట్రాల్‌ స్థాయి ఎక్కువగానే ఉందని లక్ష్మయ్య తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా 1980 నుంచి 2018 వరకు సుదీర్ఘ పరిశోధన, అధ్యయనం కొనసాగిందని.. ఆ అధ్యయనం ప్రకారం ఆసియా దేశాల్లోని ప్రజల్లో చెడు కొలెస్ట్రాల్‌ ఎక్కువగా ఉన్నట్టు తేలిందని వెల్లడించారు. పాశ్చాత్య దేశాల్లో మాత్రం చెడు కొవ్వు స్థాయి తగ్గిందని ఆయన వివరించారు. అధిక కొవ్వు వల్ల ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3.9 మిలియన్ల మరణాలు సంభవించాయని ఐసీఎంఆర్‌ ఎన్‌ఐఎన్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ హేమలత తెలిపారు. రక్తంలో చెడు కొవ్వు ఉంటే ధమనుల ద్వారా సరఫరా అయ్యే రక్తానికి అడ్డు పడుతుందని, దాంతో గుండెపోటు, మెదడు సంబంధిత వ్యాధులు వస్తాయని తెలిపారు. ఆహారపు అలవాట్లు మార్చుకొని, వ్యాయామం వంటివి చేసి చెడు కొవ్వును తగ్గించుకోవచ్చని సూచించారు.


logo