ఆదివారం 31 మే 2020
Telangana - May 17, 2020 , 02:01:43

ప్యాకేజీ కాదు పచ్చి మోసం

ప్యాకేజీ కాదు పచ్చి మోసం

 • ఉద్దీపన పేరుతో కేంద్రం వంచన ప్రకటనలు 
 • 20 లక్షల కోట్లలో సామాన్యుడికి ఒరిగేది శూన్యం
 • సాయం చేయాల్సిన కాలంలో సంస్కరణలా?
 • రాష్ట్రాల అభిప్రాయాలు వినకపోవటం దారుణం
 • రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: కరోనా కష్టాలతో అల్లాడుతున్న పేదల కడుపు నింపే కార్యక్రమాలు చేపట్టాల్సిన కేంద్ర ప్రభుత్వం ప్యాకేజీల పేరుతో ప్రజలను మభ్యపెడుతున్నదని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. కరోనా సహాయక చర్యలను కాస్తా సంస్కరణల చర్యలుగా మార్చిందని మండిపడ్డారు. కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్‌ శనివారం ప్రకటించిన ఉద్దీపన చర్యల్లోనూ రాష్ట్రాలకు ఎలాంటి సహాయం ప్రకటించలేదని అన్నారు. ఆర్థికమంత్రి ప్రకటనల్లో ప్రచార ఆర్భాటం తప్ప మరేమీలేదని విమర్శించారు. ప్రధాని, ఆర్థికమంత్రి తీరును ఆయన ఖండించారు.  

కష్టాల్లో ఉన్న ప్రజలకు తప్పుడు ఆశలు కల్పిస్తున్న కేంద్రం ఆచరణలో ఏ విధంగానూ సాయం చేయటంలేదని వినోద్‌కుమార్‌ శనివారం ఓ ప్రకటనలో విమర్శించారు. ప్రతిరోజూ ఏదో ఒక రంగానికి సహాయం చేయటానికంటూ మోసపూరిత ప్రకటనలు చేస్తున్నారని, నేరుగా ఎవ్వరికీ ఆర్థిక సాయం చేయడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు. లాక్‌డౌన్‌ నేపథ్యంలో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న రాష్ర్టాలను ఆదుకోవడానికి శనివారం వెల్లడించిన ఉద్దీపన చర్యల్లోనూ ఎలాంటి సాయం ప్రకటించలేదన్నారు. కేంద్ర ప్రభుత్వం సమాఖ్య స్ఫూర్తికి విరుద్దంగా వ్యవహరిస్తున్నదని, రాష్ట్రాల  ప్రతిపాదనలు కనీసం పరిశీలించకపోవటం దారుణమన్నారు. 20 లక్షల కోట్ల ప్యాకేజీతో కష్టల్లో ఉన్న ఏ ఒక్క సామాన్యుడికి ప్రయోజనం కలిగేలా లేదన్నారు.  వాస్తవాలకు దూరంగా ప్యాకేజీ

ఏ రంగంలోనైన సంస్కరణలు కొనసాగుతుంటాయని, వాటి ఫలితాలు రావడానికి క్షేత్రస్థాయిలో కొంతసమయం పడుతుందని వినోద్‌కుమార్‌ అన్నారు. కానీ, కేంద్రప్రభుత్వ ఆర్థిక ప్యాకేజీ ఉత్త డొల్ల అని పేర్కొన్నారు. వీటి ఫలితాలు వచ్చేదెన్నడు.? పేదల కడుపు నిండేదెన్నడని ఆయన ప్రశ్నించారు. ఆర్థిక ప్యాకేజీ కష్టాల్లో ఉన్నవారిని తక్షణం ఆదుకునేలా ఉండాలని, కేంద్ర ప్రకటనలు మాత్రం వాస్తవానికి దూరంగా ఉన్నాయన్నారు. అణువిద్యుత్‌, గనులు, అంతరిక్షం విభాగం, రక్షణ రంగాల్లో చేపట్టే సంస్కరణలు తక్షణ సహాయ చర్యల కిందికి ఎలా వస్తాయని ప్రశ్నించారు. దేశంలో ఆర్థిక సంక్షోభం నెలకొన్న ప్రస్తుత పరిస్థితుల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లోని విద్యుత్‌ డిస్కంలను ప్రైవేటీకరించడం ఏ విధంగా సరైన నిర్ణయమని నిలదీశారు. ప్రజలకు ఉపశమనం కల్గించే చర్యలు చేపట్టాల్సిన సమయంలో సంస్కరణలు చేస్తున్నదని విమర్శించారు. ఉపశమన చర్యల పేరుతో దుర్మార్గంగా వ్యవహరిస్తూ సంస్కరణలను ప్రకటిస్తున్నదని దుయ్యబట్టారు.  

ఆర్థికమంత్రి ప్రసంగంపై వినోద్‌కుమార్‌ అభిప్రాయాలు

 • బొగ్గు గనుల రంగంలో ఇప్పటి వరకు ఉన్న ప్రభుత్వ గుత్తాధిపత్యానికి తెరపడనుంది. ఇది ప్రైవేటీకరణ చేయనున్నారు. దీనివల్ల తక్షణమే సామాన్యులకు ఒరిగేదేమీలేదు 
 • కొత్తగా 50 బొగ్గు బ్లాక్‌లను వేలం వేయనున్నారు. ఇది కేవలం బడా, ప్రైవేటు కంపెనీలకు దోచిపెట్టడమే 
 • బొగ్గుగనుల తరలింపులో మెరుగైన విధానాలకు రూ.50వేల కోట్ల పెట్టుబడులు పెట్టే అవకాశముంది 
 • 500 ఖనిజాల బ్లాక్‌లను బహిరంగవేలం వేయనున్నారు. వీటిని ప్రైవేటు వారికి అప్పగించనున్నారు. 
 • దేశీయంగా రక్షణ పరికరాల తయారీని ప్రోత్సహించనున్నారు. దీంట్లో కూడా ప్రైవేటువారికి అవకాశం ఇచ్చారు.
 • రక్షణరంగ పరికరాలను తయారు చేయడంలో విదేశీ పెట్టుబడులను 49 శాతం నుంచి 74 శాతానికి పెంచారు.    ఇది పూర్తిస్థాయిలో ప్రైవేటుకు కట్టబెట్టే చర్యే.
 • ఆర్డినెన్స్‌ ఫ్యాక్టరీ బోర్డులను కార్పోరేటికరణ చేయడంతో పాటుగా స్టాక్‌ఎక్సేంజీల్లో నమోదు చేయనున్నారు. దీనితో సామాన్యుడికి ఒరిగేది శూన్యం. 
 • కొన్ని ఎయిర్‌పోర్ట్‌లు ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామం పరిధిలోకి రానున్నాయి. ఈ రంగాన్ని పూర్తిగా ప్రైవేటీకరణ చేసినట్టే.
 • విమానాల నిర్వహణకు అవసరమైన మెయింటనెన్స్‌, రిపేర్‌, ఓవర్‌హాల్టింగ్‌ (ఎంఆర్‌వో)లకు అవసరమైన మౌళిక సదుపాయాలను ఏర్పాటుచేయడం ద్వారా విమాన నిర్వహణ వ్యయం తగ్గుతుంది. 
 • వైద్య, ఆరోగ్యరంగాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్రం రూ.8100కోట్లను వయబిలిటీ గ్యాప్‌ ఫండ్‌ (వీజీఎఫ్‌) కింద కేటాయించింది. గతంలో వీజీఎఫ్‌ మొత్తం 20 శాతం ఉండేది. దానిని ప్రస్తుతం 30శాతానికి పెంచారు. 
 • అంతరిక్ష రంగాన్ని అభివృద్ధి చేయడానికి ఈ రంగాన్ని ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యానికి అవకాశం కల్పించడం. దీనివల్ల  సామాన్యుడికి ఒరిగేదేమీలేదు.  


logo