సోమవారం 30 మార్చి 2020
Telangana - Mar 13, 2020 , 02:17:27

గురుకులాల పనితీరు అద్భుతం

గురుకులాల పనితీరు అద్భుతం
  • ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు వినోద్‌కుమార్‌
  • బడులనూ ఇదే తరహా మార్చాలి: విద్యా పరిరక్షణ కమిటీ వినతి

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రాష్ట్రంలో గురుకుల విద్యాలయాల పనితీరు అద్భుతంగా ఉన్నదని, అవి మంచి ఫలితాలు ఇస్తున్నాయని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ మెరుగైన విద్యను అందుబాటులోకి తెచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ ప్రతినిధులు గురువారం హైదరాబాద్‌లో వినోద్‌కుమార్‌ను కలిశారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ విద్యార్థుల కోసం ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గురుకుల పాఠశాలలు బాగున్నాయని ప్రశంసించారు. 


ప్రభుత్వ పాఠశాలలు ఇదే తరహాలో ఉండేలా చర్యలు తీసుకోవాలని వినతిపత్రం అందజేశారు. గురుకులాల మెరుగైన పనితీరు వల్ల వాటిలో ప్రవేశాలకు విపరీతమైన పోటీ ఏర్పడిందని పేర్కొన్నారు. అంగన్‌వాడీ కేంద్రాలను ప్రాథమిక పాఠశాలల పరిధిలోకి తీసుకొచ్చి, విద్యార్థులకు ఉదయం టిఫిన్‌, సాయంత్రం అరటిపండు, పాలు ఇచ్చి బడిలోనే హోంవర్క్‌ చేయించాలని కోరారు. అక్షరాస్యత పెంపునకు ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని, అందులో భాగంగానే ఈచ్‌వన్‌ -టీచ్‌వన్‌ను చేపట్టిందని వినోద్‌కుమార్‌ వారికి తెలిపారు. ఆయనను కలిసినవారిలో ప్రొఫెసర్లు హరగోపాల్‌, చక్రధర్‌రావు, లక్ష్మీనారాయణ, పీడీఎస్‌యూ రాష్ట్ర అధ్యక్షుడు పరశురామ్‌, ప్రదీప్‌, జనార్దన్‌ తదితరులు ఉన్నారు.


logo