శనివారం 11 జూలై 2020
Telangana - Jun 07, 2020 , 01:41:01

విద్యావిధానంలో కొత్త పుంతలు

విద్యావిధానంలో కొత్త పుంతలు

  • ఐదేండ్ల పరిశోధనకు సెస్‌తో ఉన్నత విద్యామండలి ఒప్పందం
  • సమన్వయానికి ఉన్నతస్థాయి కమిటీ 

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: విద్యావిధానంలో నూతన ఒరవడి సృష్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధంచేస్తున్నది. విద్యావిధానంపై ఐదేండ్లపాటు సమగ్ర పరిశోధన కోసం రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ ఆధ్వర్యంలో ఉన్నత విద్యామండలి.. సెంటర్‌ ఫర్‌ ఎకనామిక్స్‌ అండ్‌ సోషల్‌ స్టడీస్‌ (సెస్‌)తో ఒప్పందం కుదుర్చుకున్నది. శనివారం హైదరాబాద్‌లోని ఉన్నత విద్యామండలి కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి చైర్మన్‌ తుమ్మల పాపిరెడ్డి, సెస్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ రేవతి, ఉన్నత విద్యామండలి వైస్‌ చైర్మన్‌ ప్రొఫెసర్‌ లింబాద్రి, ప్రొఫెసర్‌ వెంకటరమణ, సెక్రటరీ ఎన్‌ శ్రీనివాసరావు పాల్గొన్నారు. 

ప్రాథమిక, మాధ్యమిక, ఉన్నత విద్యావిధానం ఎలా ఉండాలన్న అంశంపై సెస్‌.. ఐదేండ్లు క్షేత్రస్థాయిలో పరిశోధనలు, సర్వే చేయనున్నది. ఉన్నతవిద్య కోర్సులు, వృత్తిపరంగా ఉపాధ్యాయులు నైపుణ్యం సాధించడం, సామాజిక, ఆర్థికపరమైన ప్రణాళికల రూపకల్పన వంటి అంశాలపై సమగ్ర నివేదికను అందజేయనున్నది. ఈ ఒప్పందాన్ని ఎప్పటికప్పుడు సమన్వయం చేయడం కోసం ఏడుగురు సభ్యులతో ఉన్నతస్థాయి కమిటీని ఏర్పాటుచేశారు. ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ఆధ్వర్యంలో ఈ కమిటీ పనిచేస్తుంది.


logo