బుధవారం 03 జూన్ 2020
Telangana - May 03, 2020 , 01:17:31

కరోనాను తక్కువ అంచనా వేయొద్దు

కరోనాను తక్కువ అంచనా వేయొద్దు

  • ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ 
  • సిరిసిల్లలో ఉన్నతాధికారులతో సమీక్ష

రాజన్న సిరిసిల్ల ప్రతినిధి, నమస్తే తెలంగాణ: కరోనాను తక్కువ అంచనా వేయవద్దని, జాగ్రత్తగా ఉండాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్‌కుమార్‌ సూచించారు. మొదటి ప్రపంచయుద్ధం సమయంలో స్పానిష్‌ఫ్లూ ప్రభావాన్ని తక్కువ అంచనా వేయడంతో భారత్‌ భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వచ్చిందని తెలిపారు. శనివారం రాజన్న సిరిసిల్ల జిల్లాకేంద్రంలోని కలెక్టరేట్‌లో కరోనా నివారణ చర్యలు, అకాల వర్షంతో పంట నష్టంపై సమీక్షించారు. కరోనా మహమ్మారి మరో రెండేండ్లపాటు కొనసాగే అవకాశం ఉన్నదని,       కట్టడికి నిర్ణీతదూరమే అసలైన మందు అని చెప్పారు.  

పంట నష్టంపై సమగ్ర ఆలోచన 

ధాన్యం చేతికొచ్చే సమయానికి అకాల వర్షాలు కురిసి పంట నష్టపోవడం దురదృష్టకరమని వినోద్‌కుమార్‌ పేర్కొన్నారు. ఏటా ఈ విధంగా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని, దీనిపై ప్రణాళికా శాఖ సమగ్ర ఆలోచన చేస్తున్నదని చెప్పారు. ఈ సమావేశంలో జెడ్పీ చైర్‌పర్సన్‌ న్యాలకొండ అరుణ, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ జిందం కళ, వైస్‌చైర్మన్‌ మంచె శ్రీనివాస్‌, కలెక్టర్‌ కృష్ణభాస్కర్‌, ఎస్పీ రాహుల్‌ హెగ్డే, గ్రంథాలయశాఖ చైర్మన్‌ ఆకునూరి శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

చిక్కుకుపోయినవారిని రప్పించేందుకు ఏర్పాట్లు

 ఉపాధి కోసం వెళ్లి ఇతర రాష్ర్టాల్లో చిక్కుకున్న కూలీలను ప్రత్యేక రైళ్లలో రప్పిస్తామని వినోద్‌కుమార్‌ హామీఇచ్చారు. జార్ఖండ్‌లో చిక్కుకున్న 168 మందిని క్షేమం గా తీసుకురావాలని కరీంనగర్‌ జిల్లా గన్నేరువరం మాజీ సర్పంచ్‌ మన్మోహన్‌రావు.. వినోద్‌కుమార్‌ను కోరగా, ఆయన సానుకూలంగా స్పందించారు.


logo